‘మధ్యప్రదేశ్ హైడ్రామా’ 16న ముగిసేనా?

by Shamantha N |
‘మధ్యప్రదేశ్ హైడ్రామా’ 16న ముగిసేనా?
X

దిశ, వెబ్‌డెస్క్ : మాజీ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా.. కాంగ్రెస్‌పై తిరుగుబాటు చేయడం.. బీజేపీ కండువా కప్పుకోవడం.. అతని వర్గం ఎమ్మెల్యేలు కర్ణాటకలోని బెంగళూరుకు తరలిపోవడంతో మధ్యప్రదేశ్‌లోని కమల్‌నాథ్ సర్కారు సంక్షోభంలో పడింది. 22 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జ్యోతిరాదిత్య సింధియాకు మద్దతుగా నిలిచారు. రాజీనామాకు సిద్ధమయ్యారు. ఒకవేళ వీరి రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తే కమల్‌నాథ్ సర్కారు కుప్పకూలకతప్పని స్థితి.

కాగా, సింధియాకు మద్దతునిచ్చిన ఆరుగురు మంత్రులను సీఎం కమల్‌నాథ్ విజ్ఞప్తి మేరకు గవర్నర్ లాల్‌జీ టాండన్ తొలగించారు. శుక్రవారం గవర్నర్‌ను కలిసి బలపరీక్షకు తమ ప్రభుత్వం సిద్ధమేనని సీఎం తెలిపారు. ఈ నెల 16న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు మొదలు కానున్నాయి. కాబట్టి 16వ తేదీనాడే అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాల్సిందిగా స్పీకర్‌ను సీఎం కమల్‌నాథ్ కోరారు. కాగా, బీజేపీ కూడా ఇదే డిమాండ్‌తో ఉన్నట్టు తెలుస్తున్నది. దీంతో వారం రోజులుగా సాగుతున్న మధ్యప్రదేశ్ హైడ్రామాకు ఈ నెల 16న ఫుల్‌స్టాప్ పడనున్నట్టు తెలుస్తున్నది.

19 మంది సింధియా మద్దతు ఎమ్మెల్యేలు శుక్రవారం బెంగళూరు నుంచి మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు తిరిగిరావల్సి ఉన్నట్టు బీజేపీవర్గాలు తెలిపాయి. కానీ, దాదాపు ఏడుగంటల తర్వాత ఈ ప్లాన్‌లో కొత్త ట్విస్టు వచ్చింది. భోపాల్‌కు రాకుండా ఆ ఎమ్మెల్యేలు ఎయిర్‌పోర్టు నుంచి తిరిగి రిసార్టుకు వెళ్లినట్టు తెలిసింది. రాష్ట్రంలో ఈ పరిణామాలపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. జ్యోతిరాదిత్య సింధియాపై కాంగ్రెస్ కార్యకర్తలు గుస్సా అయ్యారు కూడా. అలాగే, బెంగళూరు నుంచి భోపాల్‌కు రెబల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరిగివస్తున్నారన్న సమాచారంతో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పెద్దఎత్తున ఎయిర్‌పోర్టుకు చేరారు. ముందస్తు జాగ్రత్తగా పోలీసులు 144 సెక్షన్ కూడా విధించడం గమనార్హం. ఇటువంటి పరిస్థితుల నడుమనే సింధియా మద్దతు ఎమ్మెల్యే టూర్ క్యాన్సిల్ అయింది. ఓవైపు ఎమ్మెల్యేలు నేరుగా వచ్చి రాజీనామాలు సమర్పించాలని స్పీకర్ ఆదేశించడం.. భద్రతా కారణాల రీత్యా భోపాల్ ప్రయాణాన్ని రద్దు చేసుకోవడంతో.. ఈ సస్పెన్స్ ఈ నెల 16నే వీడెట్టు కనబడుతున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags: madhya pradesh, crisis, political, high drama, kamal nath govt, jyotiraditya scindia, rebel congress mla, resort, camp

Advertisement

Next Story

Most Viewed