రూ.5 వేల కోట్ల కోసం ఇలా చేస్తోంది ?

by Anukaran |   ( Updated:2020-08-27 21:02:27.0  )
Personal Loan Interest rates
X

దిశ, న్యూస్ బ్యూరో: ప్రభుత్వం అనుమతులు లేని లేఅవుట్లను, భవన నిర్మాణాలను ఆదాయమార్గంగా మార్చుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు మరోవారంలో మారోసారి లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్)ను తీసుకువచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈసారి కనీసంగా రూ.5 వేల కోట్లు రాబట్టే విధంగా చూస్తున్నట్లు సమాచారం.

ఇందులో భాగంగానే భారీగా లేఅవుట్లలోని ప్లాట్లకు, భవనాలలోని గదులకు రిజిస్ట్రేషన్‌లను నిలువరించిందని తెలుస్తోంది. రాష్ట్రంలో డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, పురపాలక సంఘాలు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను స్వీకరిస్తాయి. ఎల్ఆర్ఎస్‌లో అధిక శాతం దరఖాస్తులు హెచ్ఎండీన, జీహెచ్ఎంసీలకే అధికంగా వస్తాయి. గత 2015లో జీఓ 151 ప్రకారంగా హెచ్ఎండీఏకు మొత్తం దరఖాస్తులు 1.75 లక్షలు రాగా, వీటితో అథారిటీకి రూ. 1000 కోట్లు, జీహెచ్ఎంసీకి 85,291 దరఖాస్తులతో సుమారు రూ.500 కోట్లు, డీటీసీపీలో 29,200 దరఖాస్తుల ద్వారా రూ.110 కోట్లు ఆదాయం వచ్చింది.

ఈసారి భారీగానే రుసుం..!
గతంలో ఎల్ఆర్ఎస్ ప్రాథమిక రుసుంలు 100 చదరపు మీటర్ల వరకు రూ.200, 300 చదరపు మీట్లర్లకు రూ.400, 500 చదరపు మీటర్లకు రూ.600 ఇలా ఉండేవి. ఇక 3వేల నుంచి 50 వేల చదరపు గజాలలోపు ఉన్నప్లాట్లకు భూమి విలువను పరిగణలోకి తీసుకుని 20శాతం నుంచి 100 శాతం వరకు వసూలు చేయడం జరిగింది. ఓపెన్ స్పేస్ చార్జీలు అంటూ అదనంగా భూమి మార్కెట్ విలువపై 14 శాతం విధించారు. మరోమారు కొనసాగింపు చేసినప్పుడు ఓపెన్ స్పేస్ 33 శాతంగా వసూలు చేశారు. భూమి నియోగ మార్పిడి రుసుంలు కూడా ప్రతి చదరపు గజానికి రూ.150 నుంచి రూ. 250 వరకు విధించారు. ఇప్పుడు మాత్రం అభివృద్ధి రుసుంలు, ఓపెన్ స్పేస్, అపరాధ రుసుంలు లాంటివి భారీగానే విధించనున్నట్టు సమాచారం. హెచ్ఎండీఏ పరిధిలో అధికారులు గుర్తించినవే సుమారు 600 అక్రమలే అవుట్లున్నాయి. గుర్తించనివి మరో 800 వరకు ఉంటాయని, డీటీసీపీ పరిధిలో 500వరకు లే అవుట్లు ఉంటాయనే అంచనా ఉన్నది. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 75 వేల ప్లాట్లు ఎల్ఆర్ఎస్‌కు దరఖాస్తులు వచ్చే అవకాశాలున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి ప్లాట్ల రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో ఇటు రియల్టర్లు, అటు మధ్యతరగతి ప్రజలు కొంత ఆందోళనలకు గురవుతున్నారు.

Advertisement

Next Story