ప్రేమించుకున్నారు.. ప్రాణాలు తీసుకున్నారు

by Sridhar Babu |
ప్రేమించుకున్నారు.. ప్రాణాలు తీసుకున్నారు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ పెద్దలు ఒప్పుకుంటారా లేదా అన్న అనుమానంతో ప్రాణాలు తీసుకున్నారు. మనసులు పంచుకున్నవారితోనే మనువాడాలని నిర్ణయించుకున్న యువతి, యువకుడు… ప్రేమ పెళ్లిపై పెద్దలకు చెప్పకుండానే కఠిన నిర్ణయం తీసుకొని కన్నవాళ్లకు కడుపు కోత మిగిల్చారు. జగిత్యాల జిల్లాలో చోటుచేసుకున్న విషాదకర సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన ప్రణిత్, అదే గ్రామానికి చెందిన గుండేటి రమ్య కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. అయితే ఇద్దరి కులాలు వేరుకావడంతో పెద్దలకు ఈ విషయాన్ని చెప్పలేదు. ఇదే క్రమంలో ప్రేమ పెళ్లి చేసుకోలేక, పెద్దలకు విషయాన్ని చెప్పలేక మదనపడిపోయిన యువతి, యువకుడు చనిపోవాలని నిర్ణయించుకున్నారు. సోమవారం రాత్రి 7గంటల సమయంలో గ్రామశివారులోని చెట్టు వద్దకు వెళ్లి పురుగుల మందు తాగారు. అనంతరం ప్రణిత్ చెట్టుకు ఉరేసుకొని చనిపోగా, భయంతో రమ్య ఇంటికి వెళ్లిపోయింది. అప్పటికే పురుగుల మందు తాగి ఉన్న యువతి… రాత్రి 3గంటల సమయంలో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయింది. గ్రామంలో యువతి యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story