బ్యాక్ టు 1950 : లోక్‌సభకు తొలిసారిగా ఎన్నికలు.. ఆశ్చర్యపోయిన దేశ ప్రజలు.. రెండుసార్లూ ఓడిపోయిన అంబేద్కర్

by Swamyn |   ( Updated:2024-04-02 15:56:52.0  )
బ్యాక్ టు 1950 : లోక్‌సభకు తొలిసారిగా ఎన్నికలు.. ఆశ్చర్యపోయిన దేశ ప్రజలు.. రెండుసార్లూ ఓడిపోయిన అంబేద్కర్
X

తొలి లోక్‌సభ ఎన్నికల చిత్రం: ఓటేసేందుకు వృద్ధుడిని భుజాలపై తీసుకొచ్చిన వ్యక్తి

దిశ, నేషనల్ బ్యూరో: త్వరలోనే లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. హ్యాట్రిక్ కొట్టాలనే లక్ష్యంతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే బరిలోకి దిగుతుండగా, ఈసారైనా బీజేపీని గద్దె దించి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి భావిస్తోంది. రసవత్తరంగా సాగనున్న ఈ పోరులో విజేత ఎవరన్నది మరికొన్ని వారాల్లోనే తేలిపోనుంది. లోక్‌సభకు ఇవి 18వ ఎన్నికలు. అంటే, స్వాతంత్ర్యం సిద్ధించినప్పటి నుంచి 2019వరకు 17సార్లు లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఈ క్రమంలోనే అసలు లోక్‌సభ ఎన్నికలు తొలిసారిగా ఎలా నిర్వహించారు? ఎంత మంది ఓటేశారు? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి? రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ ఎన్నికల్లో ఎలా ఓడిపోయారు? అనే ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

భారత పార్లమెంటు

ముందుగా పార్లమెంటు గురించి తెలుసుకుందాం. భారత పార్లమెంటు ద్విసభా విధానాన్ని అనుసరిస్తుంది. అంటే, రెండు సభలు ఉంటాయి. వీటిలో ఒకటి రాజ్యసభ. దీనినే ఎగుసభ అని కూడా అంటారు. మరోటి లోక్‌సభ. దీనికి మరో పేరు దిగువ సభ. రాజ్యసభకు పరోక్ష ఎన్నికలు జరుగుతాయి. అంటే, రాజ్యసభ ఎంపీలను నేరుగా ప్రజలు ఎన్నుకోరు. కానీ, లోక్‌సభకు ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతాయి. దిగువసభ సభ్యులను ప్రజలే ఎన్నుకుంటారు. లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ సాధించిన పార్టీ(లేదా కూటమి) కేంద్రంలో అధికారాన్ని ఏర్పాటు చేస్తుంది. లోక్‌సభ పదవీకాలం గరిష్టంగా ఐదేళ్లు. లేదా అధికార పార్టీ(లేదా కూటమి) మెజార్టీ కోల్పేయేదాకా. వీటిలో ఏది ముందైతే అది అమల్లోకి వస్తుంది.

రాజ్యాంగ సభ: 1946-49

పలు నివేదికలు, కథనాల ప్రకారం, బ్రిటీష్ రాజ్ కింద ఉనికిలో ఉన్న ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యులచే రాజ్యాంగ సభ పరోక్షంగా ఎన్నుకోబడింది. రాజ్యాంగ సభ ప్రతినిధులు 1946 డిసెంబరు 9న తొలిసారిగా ఢిల్లీలో సమావేశమయ్యారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వతంత్ర్యం వచ్చింది. రాజ్యాంగ సభ ఏర్పాటుకు ప్రధాన కారణం రాజ్యాంగాన్ని రూపొందించడం. ఇది స్వతంత్ర భారతానికి తొలి పార్లమెంటుగా పేరొందింది. 1946-49 వరకు రాజ్యసభ కొనసాగింది. బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగ సభలో అవసరమైన చర్చలతో భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. రాజ్యాంగ సభ నవంబర్ 26, 1949న రాజ్యాంగాన్ని ఆమోదించింది. జనవరి 26, 1950 నుండి అమలులోకి వచ్చింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత, రాజ్యాంగ సభ భారత తాత్కాలిక పార్లమెంటుగా మారింది. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశపు మొదటి పార్లమెంట్‌గా ఇది దాదాపు మూడు సంవత్సరాలపాటు కొనసాగింది.

తొలి లోక్‌సభ ఎన్నికలు.. ఆశ్చర్యపోయిన ప్రజలు

దేశానికి తొలి లోక్‌సభ ఎన్నికలు 1951 అక్టోబర్ 25 నుంచి 1952 ఫిబ్రవరి 21వరకు జరిగాయి. లోక్‌సభ ఎన్నికల గురించి ప్రజలకు తెలియగానే ప్రజలంతా ఆశ్చర్యానికి గురయ్యారు. తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎంచుకోవచ్చని తెలుసుకుని సరికొత్త భావనను అనుభవించారు.

పెద్ద ఎత్తున అవగాహనా కార్యక్రమాలు

తొలి లోక్‌సభ ఎన్నికలకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కొత్తగా ఏర్పాటైన భారత ఎన్నికల సంఘం, రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాయి. ఇందులో భాగంగా 3,000కు పైగా సినిమా హాళ్లలో 21ఏళ్లు పైబడినవారంతా ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ ఎన్నికల సంఘం డాక్యుమెంటరీని ప్రదర్శించింది.

నిరక్షరాస్యులకు అర్థమయ్యేలా.. గుర్తుల ముద్రణ

మొదటి లోక్‌సభ ఎన్నికల నాటికి దేశంలో 85శాతం మంది ప్రజలు నిరక్షరాస్యులు. దాదాపు 40 కోట్ల జనాభాలో 15శాతం మందికి మాత్రమే ఒక భాషలో చదవడం, రాయడం తెలుసు. దీంతో అభ్యర్థుల పేర్లు, ఎన్నికల్లో పోటీ చేసే పార్టీల పేర్లను ముద్రించడం వల్ల ఓటర్లు తమకు నచ్చినవారిని ఎన్నుకోలేరు. ఈ క్రమంలోనే సుకుమార్ సేన్ నేతృత్వంలోని ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు సంబంధించిన గుర్తులను ముద్రించాలని నిర్ణయించింది. జవహార్‌లాల్ నెహ్రూ నాయకత్వంలోని కాంగ్రెస్‌కు కాడిని మోస్తున్న ఎద్దుల జత గుర్తు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చేతి గుర్తును ముద్రించింది.

ఓటర్ల జాబితాకు నానా తంటాలు

చివరగా ఎన్నికల జాబితాను రూపొందించడానికి సిబ్బంది నానా తంటాలు పడ్డారు. ఎలక్టోరల్ రోల్‌ను సిద్ధం చేసేందుకు ఎన్నికల సంఘం 16,500 మంది క్లర్క్‌లను నియమించింది. వీరు ఆరు నెలలపాటు దేశవ్యాప్తంగా తిరిగి జాబితాను సిద్ధం చేశారు. అయితే, అప్పటి సామాజిక పద్ధతుల కారణంగా ఓటర్ల వివరాల సేకరణ చాలా కష్టంగా మారింది. పేర్లు, వయస్సు, లింగం తదితర ఎన్నికల సమాచారాన్ని సేకరించేందుకు ఎన్నికల సంఘం ప్రతినిధులు గ్రామాలను సందర్శించినప్పుడు, అనేక మంది మహిళలు తమ పేర్లను అపరిచితులతో పంచుకోవడానికి నిరాకరించారు. మహిళలను పేర్లు అడిగితే, ఫలానా వ్యక్తి భార్యను అనో లేక ఫలానా వ్యక్తి తల్లి, కుమార్తె, సోదరి అని మాత్రమే చెప్పేవారు తప్ప తమ పేరును చెప్పడానికి మాత్రం నిరాకరించారు. ఈ డేటా ఎన్నికల కమిషన్‌కు చేరినప్పుడు, పూర్తి వివరాలు లేనందున తొలి ఎన్నికల్లో ఓటర్ల జాబితా నుంచి 28 లక్షల మంది పేర్లను తొలగించాల్సి వచ్చింది.

ఆవుల శరీరంపై ప్రచారం

ఎన్నికల ప్రచారాన్ని ఎలా కొనసాగించాలనేది రాజకీయ పార్టీలకు సవాల్‌గా మారింది. కొంతమంది నాయకులు, ప్రత్యేకించి నెహ్రూ వంటి దిగ్గజాలు బహిరంగ సభలు నిర్వహించగా, మరికొందరు ఓట్లు కోరుతూ ఇంటింటికీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కోల్‌కతాలో, వీధుల్లో వినూత్నంగా ఆవుల వీపుపై బెంగాలీలో ‘ఓటు ఫర్ కాంగ్రెస్’ అని రాసి ప్రచారం నిర్వహించారు. ఆ ఆవులు వీధుల్లో తిరుగుతూ మొత్తం ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో ఆసక్తి రేకెత్తించాయి.

చివరగా, ఎన్నికలు.. బుల్లెట్ ప్రూఫ్ బాక్సులు

మొదటి లోక్‌సభకు మొత్తం 4 నెలల్లో 68 దశల్లో ఎన్నికలు జరిగాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని చిని తహసిల్ (ప్రస్తుతం కిన్నౌర్ జిల్లా)లో నివసిస్తున్న బౌద్ధులు లోక్‌సభ ఎన్నికలలో తమ ఓటు వేసిన మొదటి భారతీయులు. శీతాకాలపు మంచును నివారించడానికి అక్టోబర్ 25, 1951న ఇక్కడ ఎన్నికలు జరిగాయి. 3,80,000 రీమ్స్ పేపర్లపై ముద్రించిన ఓటర్ల జాబితా ఆధారంగా మరుసటి ఏడాది(1952) జనవరి, ఫిబ్రవరిలో దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో పోలింగ్ జరిగింది. మొదటి లోక్‌సభ ఎన్నికల ఖర్చు ఓటరుకు 60 పైసలు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇది రూ.72 అయినట్టు సమాచారం. పోలింగ్ అనంతరం బ్యాలెట్ పేపర్లలో పోలైన ఓట్లను భద్రపరిచేందుకు దాదాపు 20 లక్షల బ్యాలెట్ బాక్సులను వినియోగించారు. ఇవి బుల్లెట్ ప్రూఫ్ బాక్సులు కావడం విశేషం. ఆ పెట్టెల తయారీలో 8,200 టన్నుల ఉక్కును ఉపయోగించినట్లు అంచనా. అలాగే, భారతీయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన చెరగని ఇంక్, రిపీట్ ఓటర్లను గుర్తించి, మళ్లీ ఓట్లు వేయకుండా నిరోధించడానికి ఉపయోగించబడింది.

ఫలితాలు

మొత్తం 489 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగ్గా, కాంగ్రెస్ 364 స్థానాలను గెలుచుకుంది. జవహార్‌లాల్ నెహ్రూ భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి అయ్యారు. నార్త్ సెంట్రల్ బాంబే రిజర్వ్‌డ్ స్థానం నుంచి పోటీ చేసిన రాజ్యాంగ పితామహుడు బీఆర్ అంబేద్కర్ తొలి లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. తన అసిస్టెంట్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నారాయణ్ సదోబ కజ్రోల్కర్‌పై ఓడిపోయారు. 1954లో భండారా లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలోనూ ఓటమి తప్పలేదు. అయితే, అప్పటికే ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.


Advertisement

Next Story