ఎలాంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు.. మళ్లీ మోడీనే ప్రధాని: అమిత్ షా

by GSrikanth |
ఎలాంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు.. మళ్లీ మోడీనే ప్రధాని: అమిత్ షా
X

దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే ఫుల్ టర్మ్ ప్రధానిగా మోడీయే ఉంటారని, ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదని, పార్టీలో కూడా ఆ కన్ఫ్యూజన్ లేదని కేంద్ర హోశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజైన శనివారం అమిత్ షా వికారాబాద్, వనపర్తిలో నిర్వహించిన బహిరంగ సభలకు ఆయన హాజరయ్యారు. అనంతరం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ నియమాల ప్రకారం 75 ఏండ్ల తర్వాత పదవిలో కొనసాగకూడదని జరుగుతన్న చర్చకు ఆయన ఫుల్ స్టాప్ పెట్టారు. 75 ఏండ్ల వయస్సు తర్వాత మోడీ ప్రధానిగా ఉండరనేది అవాస్తవమని ఆయన చెప్పారు. నాలుగో విడుత పోలింగ్ ప్రచారం ముగిసిందని, మూడు విడుతల్లో ఎన్డీయే 200 కుపైగా సీట్లలో గెలవనుందని ధీమా వ్యక్తంచేశారు. మూడు విడతల్లో కంటే నాలుగో విడతలో బీజేపీకి మరిన్ని సీట్లు అధికంగా పెరగబోతున్నాయన్నారు. ఈ విడుతలో కంప్లీట్‌గా స్వీప్ చేస్తామని చెప్పుకొచ్చారు. తెలంగాణలో బీజేపీకి 13 స్థానాల్లో సానుకూల పరిస్థితలు ఉన్నాయని, అందులో కనీసం 10 సీట్లు గెలవబోతున్నట్లు షా జోస్యం చెప్పారు.

తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్రం సర్ ప్లేస్ స్టేట్‌గా ఉందని, కానీ ఇప్పుడు రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. కరప్షన్, కుటుంబ పాలన అనేది కాంగ్రెస్ ఎజెండా అని షా విమర్శలు చేశారు. మజ్లీస్‌ను ఔట్ సోర్స్ చేసిన పార్టీ కాంగ్రెస్ అంటూ విరుచుకుపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ కాళేశ్వరం అవినీతిపై కాంగ్రెస్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. సోనియాగాంధీ బర్త్ డే సందర్భంగా రుణమాఫీ చేస్తామని చెప్పిందని, అయితే ఏ బర్త్ డే‌కు మాఫీ చేస్తారనేది చూడాలని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని, అయితే ఒక్కటి మాత్రం చేసిందని, కానీ అది కాంగ్రెస్ హైకమాండ్ కు ఇచ్చిన హామీ అని ఆయన చెప్పారు. అదేంటంటే.. యావత్ దేశానికి కావాల్సిన ఎన్నికల ఖర్చు తెలంగాణ నుంచి అందిస్తామన్న ఒక్క హామీని తెలంగాణ కాంగ్రెస్ నిలబెట్టుకుందని అమిత్ షా విమర్శనాస్త్రాలు సంధించారు.

ఈ ఎన్నికల్లో గెలవలేమని భావించి తనపై ఫేక్ వీడియో క్రియేట్ చేసి సర్క్యులేట్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సర్జికల్ స్ట్రైక్ పై దేశం గర్విస్తోందని, కానీ మైనారిటీ వర్గాలకు కొమ్ము కాసే కాంగ్రెస్ మాత్రం ప్రూఫ్స్ అడుగుతోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్, కూటమి నాయకుడు ఫారూఖ్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు దేశసమగ్రతను దెబ్బతీసేలా ఉన్నాయని విరుచుకుపడ్డారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిర్దోషి అని కోర్టు తీర్పు ఇవ్వలేదని, కేవలం ఎన్నికల ప్రచారం కోసమే సమయం ఇచ్చిందని షా తెలిపారు. బెయిల్ రావడమే క్లీన్ చిట్ అనుకుంటే.. అంతకన్నా అమాయకత్వం ఇంకోటి ఉండదని అమిత్ షా ఎద్దేవాచేశారు. కాంగ్రెస్.. ఇప్పటికే దేశాన్ని ఒకసారి విడగొట్టిందని, ఇప్పుడు ఉత్తర, దక్షిణాలుగా విభజన చేస్తోందని షా మండిపడ్డారు. ఇకపోతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు సీట్లే రావని అంటున్నారని, ఫలితాల రోజు ఎన్ని సీట్లు వస్తాయో చూడాలంటూ అమిత్ షా వ్యాఖ్యానించారు.

Read More..

ఆ విషయంలో BRS, కాంగ్రెస్ సేమ్ టు సేమ్.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు



Next Story