సీఎం జగన్ ఇలాకాలో లాకప్ డెత్ కలకలం.. రాత్రికి రాత్రే..

by Anukaran |   ( Updated:2021-08-11 02:57:48.0  )
pulivendula
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ ఇలాకా లో దారుణం చోటుచేసుకుంది. దొంగతనం కేసులో అరెస్ట్ చేసిన యువకుడిని పోలీసులు లాకప్ డెత్ చేసినట్లు వస్తున్న వార్తలు కడపలో కలకలం రేపుతున్నాయి. రాత్రికి రాత్రి పోలీసులు ఆ యువకుడి మృతదేహాన్ని దహనం కూడా చేశారని తెలుస్తోంది. పోలీసులు తీవ్రంగా కొట్టడం వలనే యువకుడు మృతిచెందినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పులివెందుల అహోబిళపురం కాలనీకి చెందిన వల్లెపు అశోక్ అలియాస్ అక్కులప్ప (25) అనే వ్యక్తి అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకొని అక్కడే నివాసముంటున్నాడు. అతడి తండ్రి చిన్నప్పుడే చనిపోగా, తల్లి కువైట్‌కు వలస వెళ్లింది. అక్కులప్పకు ఓ సోదరి కూడా ఉంది. ఇక డబ్బు కోసం అక్కులప్ప చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. ఈ నేపథ్యంలోనే ఒక దొంగతనం కేసులో అక్కులప్పను అనుమానించిన పులివెందుల పోలీసులు ఆదివారం అతడిని అరెస్ట్ చేసినట్లు స్థానికులు తెలుపుతున్నారు. మొదట్లో సున్నితంగానే విచారణ మొదలుపెట్టిన పోలీసులు ఆ తరువాత మాట వినకపోయేసరికి అతడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, చిత్రహింసలు తట్టుకోలేక లాకప్ లోనే అక్కులప్ప మృతిచెంది ఉంటాడని అనుమానాలు రేకెత్తుతున్నాయి. కాగా ఈ విషయం బయటకు రాకుండా స్థానిక నాయకుడి సాయంతో అక్కులప్ప కుటుంబ సభ్యులతో పంచాయితీ నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని రాత్రికి రాత్రే స్థానిక హిందూ శ్మశాన వాటికలో దహనం చేసినట్టు సమాచారం. అంతేకాకుండా నిందితుడి మృతికి ముందు అతని అక్క, బావ వద్ద నుంచి సంతకాలు కూడా పోలీసులు సేకరించినట్లు తెలుస్తోంది.

ఇక ఈ మృతిపై డీఎస్పీ శ్రీనివాస్ స్పందిస్తూ అక్కులప్పది లాకప్ డెత్ కాదని, అతను అనారోగ్యంతో మృతిచెందాడని తెలిపారు. తన తమ్ముడు అనారోగ్యంతోనే మృతిచెందినట్లు అక్కులప్ప అక్క స్టేట్ మెంట్ ఇచ్చిందని కూడా తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన కడపలో సంచలనం సృష్టిస్తోంది.

Advertisement

Next Story