లాక్​డౌన్‌తో రవాణా శాఖకు తాళం

by Shyam |
Department of Transportation
X

దిశ, తెలంగాణ బ్యూరో : రవాణా శాఖ కార్యాలయాలకు తాళం పడింది. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే రవాణా శాఖ ప్రస్తుతానికి పనులేమీ చేయడం లేదు. ఇప్పటి వరకు కేటాయించిన స్లాట్లను బదలాయించింది. అంటే కరోనా లాక్​డౌన్​తర్వాత వీటిని పునరుద్ధరించనున్నట్లు రవాణా శాఖ అధికారులు వెల్లడించారు.

కరోనా నేపథ్యంలో గత నెల నుంచే స్లాట్లను తగ్గించారు. డ్రైవింగ్​ లైసెన్స్​లు, పర్మిట్లు తదితర వాటి కోసం మొన్నటి వరకు కార్యాలయాలను తెరిచారు. వాస్తవంగా వాహనాల రిజిస్ట్రేషన్లను కొన్ని రోజుల కిందటే ఆపేశారు. తాజాగా డ్రైవింగ్​ సైలెన్స్​లు, ఇతర రెన్యూవల్స్​ అన్నింటినీ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం లాక్​డౌన్​ విధించిన విషయం తెలిసిందే. 33 శాతం ఉద్యోగులతో ప్రభుత్వ కార్యాలయాలు పని చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అదే సమయంలో లాక్​డౌన్​ సడలింపును కేవలం నాలుగు గంటలకే పరిమితం చేసింది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకే ఆంక్షలను ఎత్తివేసింది.

కానీ ఆ సమయంలో రవాణా శాఖలో నిర్వహణ చాలా కష్టంగా మారింది. తొలి రోజు ఎలా కొనసాగించాలో ప్రయత్నాలు చేశారు. కానీ సాధ్యం కాకపోవడంతో ఈ శాఖ మొత్తం విధులను పక్కకు పెట్టింది. దీంతో ఇప్పటి వరకు ఖరారైన స్లాట్లను లాక్​డౌన్​ తర్వాత పునరుద్ధరించేందుకు నిర్ణయించి, వాటిని బదలాయించింది. అంటే ఇప్పటి వరకు స్లాట్లు బుక్​ చేసుకున్న వారికి తర్వాత సమాచారం అందించనున్నట్లు అధికారులు ప్రకటించారు.

Advertisement

Next Story