- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో మే 29 వరకు లాక్‌డౌన్
దిశ, న్యూస్ బ్యూరో :
రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 29వ తేదీ వరకు లాక్‌డౌన్ కొనసాగనుంది. కేంద్ర మార్గదర్శకాలను యథాతథంగా ప్రభుత్వం అమలుచేయనుంది. కంటైన్‌మెంట్ జోన్లు మినహా రాష్ట్రమంతటా మద్యం దుకాణాలను బుధవారం నుంచే తెరవనుంది. అయితే క్లబ్బులు, పబ్బులు, రెస్టారెంట్లకు మాత్రం ఆంక్షలు యథావిధిగా కొనసాగనున్నాయి. భూముల, వాహనాల రిజిస్ట్రేషన్లను కూడా ప్రభుత్వం బుధవారం నుంచే ప్రారంభించనుంది. గ్రీన్ జోన్లలో యథావిధిగా మామూలు కార్యకలాపాలు ప్రారంభవుతాయని, ఆరెంజ్ జోన్‌లో మాత్రం పరిమిత సడలింపులతో ఉంటాయని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం అమలుచేస్తున్న సడలింపులపై ఈ నెల 15వ తేదీన మళ్ళీ సమీక్షిస్తామని ఆ ప్రకారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రివర్గంలో సుదీర్ఘంగా చర్చ జరిగిన అనంతరం మద్యం దుకాణాలను తెరవడంపై నిర్ణయం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రం మొత్తంమీద పదిహేను మాత్రమే కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నందున ఇక్కడ వైన్ షాపులు, ఇతర వ్యాపార కార్యకలాపాలు ఉండవన్నారు. ఆర్టీసీ బస్సులు సైతం ఈ నెల 15 వరకు రాష్ట్రంలో ఎక్కడా తిరగవన్నారు. జోన్లతో సంబంధం లేకుండా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల అనుమతి ఉన్న దుకాణాలు పనిచేస్తాయని, సాయంత్రం ఏడు గంటల నుంచి మాత్రం రాత్రిపూట కర్ఫ్యూ మొత్తం రాష్ట్రంలో ఉంటుందన్నారు. మంత్రివర్గంలో పలు అంశాలను చర్చించిన అనంతరం కేసీఆర్ మీడియా సమావేశంలో పై వివరాలు వెల్లడించారు.
కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రైవేటు ఆఫీసులు 33 శాతం సిబ్బందితో పనిచేస్తాయని తెలిపారు. లాక్‌డౌన్ కొనసాగుతున్నా రాష్ట్రంలో ఆర్థిక అవసరాల కోసం యాక్టివిటీస్ ప్రారంభం కావాల్సి ఉందని, కేంద్రం మార్గదర్శకాల్లోనే స్పష్టత ఇచ్చిందన్నారు. ఏ జోన్‌లో ఏం చేయాలో చెప్పినందున వాటిని యథాతథంగా అమలు చేస్తామన్నారు. రెడ్‌జోన్‌లో కూడా షాపులు తెరుచుకోవచ్చని కేంద్రం చెప్పినా రాష్ట్రంలో మాత్రం తెరవడంలేదన్నారు. గృహనిర్మాణానికి అవసరమైన దుకాణాలు, కిరాణా దుకాణాలు సిమెంటు, స్టీలు షాపులు, హార్డ్‌వేర్, ఎలక్ట్రికల్ షాపులు తెరుచుకోవచ్చన్నారు. వ్యవసాయ సంబంధ పనిముట్లు, స్పేర్ పార్ట్స్ దుకాణాలకు కూడా అనుమతి ఉందన్నారు. జిల్లా కలెక్టర్లు పర్యవేక్షిస్తారని తెలిపారు.
గత్యంతరం లేకనే సడలింపులు..
కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి మరో గత్యంతరం లేకనే లాక్‌డౌన్‌ను కొనసాగించాల్సి వస్తోందని, హైదరాబాద్‌లో ఇన్ని ఆంక్షలు పెట్టాల్సి వచ్చిందని సీఎం వివరించారు. డాక్టర్లు, మేధావులు చాలా మంది చెప్పిన అంశాలను మంత్రివర్గం కూడా లోతుగా చర్చించిందని, కేంద్రం సడలింపులు ఇచ్చినా హైదరాబాద్‌లో మాత్రం ఈ నెల 15 వరకు తెరవకుండా చూస్తామన్నారు. ఢిల్లీ, చెన్నయ్, బెంగుళూరులో నగరాల్లో ఏం జరిగిందో చూశామని, ఈ ఇబ్బందులు మంచిది కాదన్నారు. ఈ నెల 15న రాష్ట్రంలోని గ్రీన్, ఆరెంజ్ జోన్లలోని, పట్టణాల్లోని పరిస్థితిని పరిశీలించి తదనుగుణమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. రూరల్ ఏరియాలో అన్ని షాపులూ తెరుచుకోవచ్చన్నారు. మున్సిపాలిటీల్లో మాత్రం మున్సిపల్ కమిషనర్ లాటరీ ద్వారా ఒక్కో రోజు ఒక్కో షాపుకు తెరవడానికి అవకాశం ఇస్తారని, సోషల్ డిస్టెన్స్ పాటించాల్సిందేనని అన్నారు. ప్రైవేటు ఆపీసులు 33% పనిచేస్తాయని, కానీ స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ, రవాణాశాఖ మాత్రం పూర్తిస్థాయిలో పనిచేస్తాయన్నారు. బుధవారం నుంచే భూముల అమ్మకాలు, కొనుగోళ్ళు యదావిధిగా జరుగుతాయన్నారు. ఇసుక మైనింగ్ కూడా మొదలవుతుందన్నారు.
త్వరలో పదవ తరగతి పరీక్షలు..
విద్యార్థులకు పదోతరగతి పరీక్షలు మధ్యలోనే ఆగిపోయాయని, మూడు మాత్రమే జరిగి ఇంకా ఎనిమిది బాకీ ఉన్నాయని, త్వరలోనే వాటిని కూడా నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర్రవ్యాప్తంగా సుమారు 2500 సెంటర్లు ఉన్నాయని, సోషల్ డిస్టెన్స్ కారణంగా సెంటర్ల సంఖ్యను పెంచాల్సి ఉంటుందని, విద్యార్థులకు శానిటైజర్లు, మాస్కులు ఇస్తామన్నారు. పిల్లలు, తల్లిదండ్రులు టెన్షన్ లేకుండా ఆర్టీసీ బస్సుల్ని పెడతామన్నారు. మే నెలలోనే పరీక్షలను కంప్లీట్ చేస్తామన్నారు. చాలా పైస్థాయి కోర్సులు దీనిమీదే ఆధారపడి ఉంటుందన్నారు. ఇంటర్ పరీక్షలు అయిపోయినందున జవాబు పత్రాలను దిద్దే కార్యక్రమం కూడా బుధవారం నుంచే ముమ్మరంగా జరుగుతుందన్నారు. ఉన్నత విద్యా సంస్థలపై రాష్ట్రంలోని సబ్ కమిటీ సమావేశమై సిలబస్ పూర్తి చేయడంపైనా, ఇకపైన ఏ పద్ధతి అవలంబించాలనే అంశంపైనా చర్చించి నిర్ణయం తీసుకుంటుందన్నారు.
రుణమాఫీ, రైతుబంధు ఆగదు..
కేసీఆర్ బతికున్నంతవరకు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంతవరకు రైతుబంధు ఆగదని సీఎం వ్యాఖ్యానించారు. రైతులందరికీ రైతుబంధును వంద శాతం ఇస్తామని, కోతలు లేకుండా యథాతథంగా అమలవుతుందన్నారు. త్వరలోనే రూ. 7 వేల కోట్లను విడుదల చేస్తామన్నారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగంలో చెప్పినట్లుగా పాతిక వేలలోపు రుణం ఉన్న రైతులకు ఒకే దఫాలో మాఫీ చేస్తామన్నారు. రెండుమూడు రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయన్నారు. ఈ పథకం ద్వారా సుమారు ఐదున్నర లక్షల మంది లబ్ది పొందుతారన్నారు. ఆసరా పింఛన్ల విషయంలోనూ రాజీపడే ప్రసక్తే లేదన్నారు. రైతు, పేదల సంక్షేమం ఈ ప్రభుత్వానికి ప్రాధాన్యతా అంశాలన్నారు. వచ్చే సీజన్‌కు రైతులు సిద్ధమవుతున్నందున గ్రామీణ ప్రాంతమంతా గ్రీన్ జోన్ పరిధిలోనే కాబట్టి తానే స్వయంగా వెళ్తానని అన్నారు. రైతులు పండించిన వరి, పప్పులు తదితర పంటలన్నింటినీ ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తూ ఉందని, ఇప్పటికే రైతుల నుంచి సుమారు 30 లక్షల టన్నుల వరి కొనుగోలు చేసిందని, రూ. 2500 కోట్లను వారి ఖాతాల్లో కూడా జమ చేసిందన్నారు. ప్రతిపక్షాలకు ఏ అంశాలూ దొరక్క ఇప్పుడు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నాయన్నారు. వారి మాయలో పడొద్దని రైతులకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
మద్యం ధరలు 16% పెంపు..
ఇంతకాలం మద్యం రెవిన్యూ లేకపోవడంతో రెడ్ జోన్లు సహా దుకాణాలను తెరవాలని నిర్ణయించిన ప్రభుత్వం.. సగటున 16% మేర ధరలు పెంచింది. తక్కువ ధర ఉన్న బ్రాండ్లపై 11%, ఎక్కువ ధరలు ఉన్నవాటిపై ఎక్కువగా పెంచింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దుకాణాలు ఉంటాయని, సోషల్ డిస్టెన్స్ పాటించాల్సేందేనని, లేకుంటే మూసేయాల్సి వస్తుందన్నారు. తెలంగాణ ప్రజల క్రమశిక్షణను దేశానికి ఆదర్శంగా చూపాలని, ప్రతీ ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలన్నారు. మూడు సంవత్సరాలు కష్టపడి గుడుంబా లేకుండా చేశామని, ఇప్పుడు పొరుగు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో ఇక్కడకు స్మగ్లింగ్ అవుతున్నాయని, మళ్ళీ గుడుంబా మొదలవుతోందని, దానికి తావివ్వవద్దనే ఉద్దేశంతోనే వైన్ షాపుల్ని తెరవాలనే నిర్ణయం తీసుకున్నట్లు కేసీఆర్ వివరించారు. సుమారు రూ. 1000 కోట్లు ఖర్చు పెట్టి గుడుంబా లేకుండా చేసిన తర్వాత ఇప్పుడు కరోనా లాక్‌డౌన్‌లో మద్యం దుకాణాలు లేకపోవడంతో మళ్ళీ మొదలవుతోందన్నారు. కంటైన్‌మెంట్ క్లస్టర్లలో మినహా రెడ్‌జోన్ జిల్లాల్లో మద్యం షాపులు తెరుచుకుంటాయన్నారు. రాష్ట్రం మొత్తం మీద ఉన్న 2200 షాపుల్లో కేవలం 15 మాత్రమే తెరుచుకోవన్నారు. బార్లు, పబ్బులు, క్లబ్బులు మూసే ఉంటాయన్నారు. ప్రతీ దుకాణం దగ్గర శానిటైజర్ ఉండాల్సిందేనని, మాస్కు లేకుంటే మద్యం విక్రయం ఉండదన్నారు.
కేంద్రం తప్పుడు విధానాలు..
కేంద్రం తప్పుడు విధానాలను అవలంబిస్తోందని కేసీఆర్ ఆరోపించారు. దేశ ఆర్థిక పరిస్థితి కరోనాకు ముందే ఘోరంగా ఉందని, కానీ భేషజాలకు పోయి ఒప్పుకోవడం లేదన్నారు. కరోనా వచ్చిన తర్వాత మన ఆర్థిక వ్యవస్థ తీరు పులి మీద పుట్రలా దెబ్బ తగిలిందన్నారు. రాష్ట్రానికీ ప్రతీ నెల అన్నీ కలిపి రూ. 15 వేల కోట్ల రెవిన్యూ వస్తుందని, అందులో స్వీయ ఆదాయం రూ. 11 వేల కోట్లు ఉంటుందని, కానీ ఏప్రిల్ నెల మొత్తానికి వచ్చింది మాత్రం కేవలం 1600 కోట్లేనన్నారు. జీతాలకే రూ. 3 వేల కోట్లు అవసరమైతే ఇక ఎలా సర్దుబాటు చేయాలని ప్రశ్నించారు. ఇలాంటి సందర్భంలో కేంద్రం వివిధ రూపాల్లో ఆదుకోవాల్సిందిగా ప్రధానిని వీడియో కాన్ఫరెన్సులోనే కోరానని, కానీ ఇప్పటికీ స్పందన రాలేదన్నారు. ఎఫ్ఆర్‌బీఎం పెంచాలని కోరినా, అప్పుల చెల్లింపులను ఆరు నెలలు వాయిదా వేయాలని కోరినా సానుకూల స్పందన రాలేదన్నారు. ఈ దేశ ఆర్థిక నియంత్రణకు అవసరమైన అధికారం కేంద్రం దగ్గరే ఉందని, ఆ ప్రకారం నిర్ణయం తీసుకోవాలని లేదంటే ఆ అధికారాన్ని రాష్ట్రాలకు బదిలీ చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే ప్రపంచవ్యాప్తంగా అవలంబించే విధానాలను పాటించాలని సూచించారు. దానిపైనా శ్రద్ధ పెట్టలేదన్నారు. పేదలకు రైలు టికెట్ ఛార్జీల దగ్గర కూడా కక్కుర్తిగా వ్యవహరించిందని, కనీసం ఆ మాత్రం కూడా డబ్బులు లేనంత దరిద్రంలో ఉందా అని అన్నారు. ఇది మంచి పద్ధతి కాదని, దేశ సమస్య కాబట్టి మౌనాన్ని వీడాలన్నారు. రెండు రోజులు వేచి చూసి ఆ తర్వాత తగిన కార్యాచరణ తీసుకుంటామన్నారు. సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా పోరాడతామన్నారు.
ఎలక్ట్రిసిటీ బిల్లును వ్యతిరేకిస్తాం
రాష్ట్రాల అధికారాన్ని హరించే విధంగా, సహకార సమాఖ్య స్ఫూర్తికి తిలోదకాలు ఇచ్చే విధంగా కేంద్రం వ్యవహరిస్తోందని, ఎలక్ట్రిసిటీ బిల్లులో అలాంటి అంశాలే ఉన్నాయని కేసీఆర్ గుర్తుచేశారు. పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే రాష్ట్రాలకు అధికారాలు, హక్కులు ఉండవన్నారు. రైతులకు ఉచిత వ్యవసాయ విద్యుత్ ఇవ్వడం, ధరలను నిర్ణయించడం కేంద్రం చేతుల్లోకి పోతుందని, సబ్సిడీలు ప్రశ్నార్థకమవుతాయన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఇస్తున్న సబ్సిడీ కూడా అగమ్యగోచరంగా మారుతుందన్నారు. ప్రజల నుంచి ముక్కు పిండి మరీ వసూలుచేస్తునందన్నారు. గిరిజనుల హక్కులను కాలరాసే విధంగా వెలువడిన సుప్రీంకోర్టు తీర్పును సవాలు చేస్తూ రివ్యూ పిటిషన్ వేస్తామన్నారు.