దుకుణం తీసినం.. జనాలు వస్తలేరు..

by Sridhar Babu |   ( Updated:2020-05-08 09:58:20.0  )
దుకుణం తీసినం.. జనాలు వస్తలేరు..
X

దిశ, కరీంనగర్: రద్దీగా ఉండే రోడ్లు, కిటకిటలాడే షాపులు, కోట్ల రూపాయల టర్నోవర్.. ఇదంతా గతం. పెద్దగా జనసంచారంలేని రోడ్లు, ఒకరిద్దరే కస్టమర్లు, నామమాత్రపు సేల్స్.. ఇదే ప్రస్తుతం. ఉత్తర తెలంగాణకే తలమానికంగా నిలిచే కరీంనగర్ జిల్లా కేంద్రంలో కరోనా లాక్‌డౌన్‌ సడలింపులిచ్చినా వ్యాపారం మాత్రం బొటాబొటిగానే సాగుతోంది. ఫిజికల్ డిస్టెన్స్ మెయింటెన్ చేస్తూ 50 శాతం దుకాణాలు తెరవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రకారంగానే మూడు రోజులుగా షాపులు తెరుస్తున్నా వ్యాపారాలు మాత్రం నామమాత్రంగానే సాగుతున్నాయి. కరీంనగర్‌లోని టవర్ సర్కిల్, అన్నపూర్ణ కాంప్లెక్స్, మంకమ్మతోట, కోర్టు చౌరస్తా, కమాన్, రాజీవ్ చౌక్, గాంధీ రోడ్ తదితర ప్రాంతాలన్నీ కూడా లాక్‌డౌన్‌కు ముందు వినియోగదారుల రాకపోకలతో రద్దీగా ఉండేవి. కానీ ఇప్పుడు సరి, బేసి విధానంతో షాపులు తెరుచుకునే అవకాశమిచ్చినా.. కొనుగోలుదారుల నుంచి పెద్దగా స్పందన లేదు. 43 రోజులుగా షాపులు కట్టేసి ఉండటంతో ప్రస్తుతం దుకాణాలు తెరిచి కూర్చోవడం తప్ప మెయింటనెన్స్ ఖర్చులు కూడా రాని పరిస్థితి నెలకొంది.

బోసిపోతున్న వస్త్ర దుకాణాలు..

మూడు రోజులుగా షాపులు తెరుస్తున్నా వస్త్ర దుకాణాల్లో అంతగా గిరాకీ కనిపించడం లేదు. సాయంత్రం వరకు ఒకరిద్దరు కస్టమర్లు మాత్రమే వస్తున్నారు. గతంలో లక్ష రూపాయల కౌంటర్ సేల్ జరిగే షాపుల్లో ప్రస్తుతం వెయ్యి రూపాయల అమ్మకాలు కూడా జరగడం లేదు. రెడీమేడ్ డ్రెస్సుల షాపుల యజమానులు కరోనా కోసం కొత్త నిబంధనలు విధిస్తున్నారు. మోడల్ నచ్చి వినియోగదారుడు ట్రయల్ చేసిన తరువాత ఒకవేళ డ్రెస్ సెట్ కాకపోతే వేరే సైజ్ డ్రెస్ ఇస్తున్నారు. కానీ, ట్రయల్ చేసిన డ్రస్‌ను మాత్రం మూడు రోజుల వరకు వ్యాపారులు ముట్టుకోవడం లేదు. ఆ తరువాతే సదరు డ్రెస్‌ను అమ్మకానికి షోకేస్‌లో పెడుతున్నారు. ఒకవేళ వినియోగదారుల్లో కరోనా బాధితుడు లేదా లక్షణాలున్నవారున్నా సరే.. వైరస్ మరొకరికి సోకకుండా ఉండేందుకే ఈ విధంగా వ్యవహరిస్తున్నారు.

ముట్టుకుంటానంటే అమ్మేది లేదు

నగరంలోని కొన్ని ఫర్నిచర్ షాపుల్లో అమలవుతున్న విధానం కూడా వినియోగదారులను ఫర్నిచర్ కొనేందుకు వెనకడుగు వేసేలా చేస్తోంది. అలాగే ఫర్నిచర్ షాపు యజమానులు సైతం తప్పనిసరి పరిస్థితి అయితేనే అమ్ముతామన్న కండిషన్ పెడుతున్నారు. సోఫా సెట్ వంటి వాటిపై కొనుగోలుదారులు కూర్చుని చూస్తుంటారు. దీనివల్ల అతని దుస్తులపై కరోనా వైరస్ ఉన్నట్టయితే ఫర్నిచర్‌కు అంటుకునే ప్రమాదం ఉందని చాలా వరకు వాటిని అమ్మేందుకే మొగ్గు చూపడం లేదు. ఈ నేపథ్యంలో పెళ్లిల్లు, ఇతరత్రా శుభకార్యాలకు తప్పనిసరి అయితే తప్ప ఫర్నిచర్ అమ్మడం లేదు. దీంతో నగరంలో లక్షల్లో టర్నోవర్ సాధించే ఫర్నిచర్ దందా ఇప్పుడు వేల రూపాయలకు పడిపోయింది.

పడిపోయిన కూలర్ల అమ్మకం..

సాధారణంగా వేసవి కాలంలో ఒక్కో షాపులో 200 వరకు కూలర్లు విక్రయించిన వ్యాపారులు.. ప్రస్తుతం లాక్‌డౌన్‌కు సడలింపులిచ్చినా కేవలం 10 నుంచి 15 వరకు మాత్రమే అమ్మగలుగుతున్నారు. కూలర్ల తయారీ కంపెనీలకు వ్యాపారులు ఏడాది ముందుగానే డబ్బులు చెల్లించి కూలర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సారి లాక్‌డౌన్ కారణంగా కూలర్ల అమ్మకాలు లేకపోవడంతో డబ్బులు బ్లాక్ కాకుండా ఉండేందుకు సడలింపు రోజుల్లో కూలర్ల విక్రయానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కూలర్లను ఇప్పుడు విక్రయించకపోతే వచ్చే ఏడాది వరకు వాటిని స్టోర్ చేయాల్సి వస్తుంది. అదీగాక డబ్బులు టర్నోవర్ కాక ఆర్థిక భారం పడుతుందని వ్యాపారులు వాటిని నామమాత్రపు లాభానికైనా అమ్మేందుకు మొగ్గు చూపుతున్నారు. బ్రాండెడ్ కూలర్ల వ్యాపారమే ఇలా ఉంటే స్థానికంగా తయారు చేసే అసెంబుల్డ్ కూలర్ల అమ్మకాలైతే గణనీయంగా పడిపోయాయి.

చెప్పుల దుకాణాలు, టీవీ రిపేర్లు, మోటార్ల అమ్మకాలు అంతంతే..

ఫుట్‌వేర్ షాపుల్లోనూ గిరాకీ అంతంత మాత్రమే. చాలా వరకు దుకాణాల్లో కస్టమర్లు కనిపించడం లేదు. ఒకటి అరా దుకాణాల్లో గిరాకీ ఉన్నా రోజుకు వెయ్యి రూపాయల వ్యాపారమైనా జరగని పరిస్థితి. ఇకపోతే వివిధ ఎలక్ట్రానిక్ వస్తువులను రిపేర్ చేసి జీవనం సాగించే వారికి కూడా ఆదరణ లేకుండా పోయింది. మూడు రోజులుగా ఒకటి రెండు టీవీలు రిపేర్ కోసం వస్తున్నా.. వాటికి అవసరమైన విడిభాగాలు మార్కెట్‌లో దొరక్క వాటిని రిపేర్ చేయలేని పరిస్థితి. ఇకపోతే వ్యవసాయ రంగానికి అవసరమయ్యే మోటార్ల క్రయవిక్రయాలపైనా లాక్‌డౌన్ ఎఫెక్ట్ పడింది. వ్యవసాయ పనులు ముగిసిన తరువాత సడలింపులు ఇవ్వడం వల్ల మోటార్ల అమ్మకాలు లేనేలేవు. ఇవేకాక టీవీలు, ఫ్రిజ్‌లు, హోమ్ అప్లయెన్స్‌కు సంబంధించిన వస్తువుల అమ్మకాలు తక్కువే. ప్రజలు కూడా లాక్‌డౌన్ ప్రభావంతో పెద్దగా రోడ్లపైకి రాకపోవడంతో వీటి అమ్మకాలు సాగడం లేదు.

రవాణా వ్యవస్థే కీలకం..

వివిధ ప్రాంతాల నుంచి కరీంనగర్‌కు షాపింగ్ నిమిత్తం వచ్చేందుకు అవసరమైన రవాణా వ్యవస్థ లేకపోవడంతో గిరాకీ అంతగా సాగడం లేదు. అత్యవసరం ఉన్న వారు మాత్రం కరీంనగర్‌కు వస్తున్నా వీరి సంఖ్య చాలా తక్కువ. వ్యక్తిగత అవసరాల కోసం కరీంనగర్‌కు వచ్చే పరిస్థితి లేకపోవడంతో వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాలవారే కాకుండా కరీంనగర్ ఉమ్మడి జిల్లాతో పాటు మంచిర్యాల ప్రాంతానికి చెందిన వారు కూడా గతంలో అవసరమైన వస్తువుల కొనుగోలు కోసం ఇక్కడికి వచ్చేవారు. కానీ ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో ఆ ప్రభావం క్రయవిక్రయాలపైనా పడింది.

భయం భయంగానే వ్యాపారం..

కరోనా వైరస్ కారణంగా అమ్మకాలు భయం భయంగా జరుపుతున్నాం. కేవలం కూలర్ల విక్రయానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాం. ఫర్నిచర్ అమ్మకాలు జరపేది లేదని కస్టమర్లకు స్పష్టం చేస్తున్నాం. అయితే తప్పనిసరి పరిస్థితి ఉందంటే ఫర్నిచర్ అమ్ముతున్నా.. కండిషన్ పెడుతున్నాం. ఫర్నిచర్‌ను ముట్టుకోవడం వంటివి చేయొద్దని చెబుతున్నాం.

– పవన్, పవన్ అప్లయన్సెస్ యజమాని

మధ్య తరగతి వ్యాపారులను ఆదుకోవాలి

లాక్‌డౌన్‌తో గిరాకీలు లేకుండా పోయాయి. సరి బేసి విధానంతో షాపులు తెరుస్తున్నాం. ఇన్ని రోజులుగా షాపులు మూసిఉండటంతో ఎలకల వల్ల చెప్పులు, దుస్తులు నాశనం అయ్యే ప్రమాదం ఉంది. ఇది మధ్యతరగతి వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడుతోంది. సమాజంలో ఉన్నత శ్రేణి, దిగువ శ్రేణి వాళ్లతో పోలిస్తే మధ్య తరగతి వారిపైనే లాక్‌డౌన్ ప్రభావం ఎక్కువగా పడింది. ప్రభుత్వం మధ్య తరగతి వ్యాపారులను ఆదుకునేందుకు చొరవ చూపాలి.

– హరిరామ్ చౌదరి, హనుమాన్ ఫుట్ వేర్స్ యజమాని

వ్యవసాయ పనులు పూర్తయ్యాయి

ఈ సీజన్‌కు సంబంధించిన వ్యవసాయ పనులు పూర్తికావడంతో మోటార్ల అమ్మకాలతో పాటు రిపేర్లు కూడా ఆశించిన స్థాయిలో లేవు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే రైతాంగం సంఖ్య కూడా తగ్గిపోయింది. ఇన్ని రోజులు పరిశ్రమలు కూడా మూతపడటంతో ఆ మోటార్లు వచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది. దీంతో షాపులో ఉన్న స్టాకును అమ్ముకోవడమే తప్ప మరో దారి లేదు.

– బైరి మల్లేశం, వినాయక ఇంజనీరింగ్ యజమాని

Tags: Lockdown effect, Textiles, Furniture shops, Agriculture motors

Advertisement

Next Story