దండం సారూ.. మాపై దయచూపండి

by Sampath |   ( Updated:2021-06-11 03:23:56.0  )
medchal
X

దిశ, కుత్బుల్లాపూర్ : దండాలు సారూ.. మాపై దయచూపండి అంటూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల గ్రామంలోని ప్రజలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యానికి తోడు పాలకుల పట్టింపులేనితనం మా పాలిట శాపంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు జీడిమెట్ల గ్రామంలోని హనుమాన్ వ్యాయామశాల రోడ్డుతో పాటు పక్క రోడ్డు బురదమయంగా మారింది. భూగర్భ డ్రైనేజీ పైప్ లైన్ ఉన్నప్పటికీ మ్యాన్ హోళ్లన్నీ లీకవడం ఒక కారణమైతే.. డ్రైనేజీ ఔట్ లెట్‌ను కొందరు మూసి వేయడం వల్లేనని పలువురు తెలుపుతున్నారు. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి వరద నీరంతా ఇండ్లలోకి చేరి జాగారం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతి వర్షాకాలం మా పరిస్థితి ఇలాగే ఉందని, మాకు పరిష్కారం చూపాలని దండాలు పెడుతూ వినూత్నంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. మురుగుతో దుర్గంధం వస్తుండడంతో అందరూ అనారోగ్యాలకు గురవుతున్నారు. గ్రేటర్‌లోని ప్రతి బస్తీలో సకల సౌకర్యాలు కల్పించామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వానికి మా సమస్యలు పట్టడంలేదనా అని ప్రశ్నించారు.

medchal

ప్రారంభించి ఆరు నెలలైనా…

ఇదే వీధుల్లోని ప్రజలను మరో సమస్య వేధిస్తోంది. గత ఆరు నెలల క్రితం సుమారు రూ.10 లక్షల నిధులు మంజూరవగా రోడ్డును వేసేందుకు అధికారులు ఉన్న రోడ్డునంతా తవ్వించారు. అయితే రోడ్డు చివరలో రోడ్డు స్థలం తమదేనంటూ కొందరు అడ్డుపడడంతో సీసీ రోడ్డు వేయడం నిలిపివేశారు. ఏమైనా పరిష్కారం చూపకుండా అధికారులు నాన్చుడు ధోరణి అవలంభిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సమస్యను వివరించినా ప్రయోజనం లేదు

మా ఇంటి సమీపంలోని రోడ్డును నెలల క్రితం ప్రారంభించి వదిలేశారు. రోడ్డు వేయడం నిలిపిన అధికారులను కలిసి సమస్యను పరిష్కరించాలని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనంలేదు. గతంలో ఉన్న మట్టి రోడ్ అయినా కాస్త బాగుండేది. ఇప్పడు అధికారుల తీరును చూస్తే కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా మారింది.

medchal
వెంకట్, స్థానికుడు

మురుగు సమస్య పరిష్కరించండి సారూ…

వానొచ్చిందంటే చాలు మా రోడ్డంతా బురదగా మారుతోంది. డ్రైనేజీ ఔట్ లెట్ లేక డ్రైనేజీ లీకవుతూ వరద నీటితో మా ఇంటిలోకి రావడం వల్ల దుర్వాసన వస్తుంది. రాత్రి నుంచి ఇప్పటి వరకు అన్నం కూడా సరిగా తినలేదు. మనసున్న అధికారులెవరైనా ఉంటే మా సమస్యను పరిష్కరిస్తారని కోరుకుంటున్నా.

medchal

జగదాంభ, స్థానికురాలు

Advertisement

Next Story