ఏసీలో ఉండడం కాదు.. జర రోడ్డు మీదకి రండి సార్లు

by Shyam |   ( Updated:2021-09-22 01:39:34.0  )
railway station road
X

దిశ, స్టేషన్‌ఘన్ పూర్: మూడేళ్ల కింద చేపట్టిన గాంధీ చౌరస్తా – రైల్వే స్టేషన్ రోడ్డు విస్తరణ పనులు మూడు అడుగులు ముందుకు ఆరడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతున్నాయి. దీంతో అటు వాహనదారులు ఇటు వ్యాపారస్తులు గత మూడేళ్ల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నా.. పాలకులు మాత్రం స్పందించడం లేదని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. రోడ్డు విస్తరణతో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు ఆందోళనలు చేస్తే నిప్పుల మీద నీళ్లు చల్లినట్లు మంత్రి మొదలు సీఐ వరకూ హామీలిచ్చి మాట తప్పుతున్నారని మండిపడుతున్నారు. గాంధీ చౌరస్తా నుండి రైల్వే గేట్ వరకు వెళ్లాలంటే వాహనదారులు నరకం చూస్తున్నారు. ఇక రోడ్డుకు ఇరువైపులా ఉన్న వాణిజ్య వ్యాపార సంస్థల యజమానులు, వర్కర్లు కూడా దుమ్ము కారణంగా అనారోగ్యాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు స్పందించి నత్తనడకన సాగుతున్న రోడ్డు విస్తరణ పనులను వెంటనే పూర్తి చేయాలని వాహనదారులు, స్థానిక వ్యాపారస్తులు డిమాండ్ చేస్తున్నారు.

కమీషన్లు తప్ప సమస్యలు పట్టవా?

మూడేళ్ల కింద ప్రారంభించిన స్టేషన్ రోడ్డు నిర్మాణ పనులపై శ్రద్ధలేని పాలకులు కమీషన్లకు కక్కుర్తిపడ్డారు తప్ప సమస్యలను పట్టించుకోవడం లేదు. స్థానిక ఎమ్మెల్యే సహా జిల్లా మంత్రి ఈ రోడ్డు వెంట నెలకు పది సార్లు వెళ్తారు. కానీ, ఈ సమస్యను మాత్రం పట్టించుకోవడంలేదు. మంత్రిని, ఎమ్మెల్యేను అడ్డుకున్నా కూడా హామీలు ఇచ్చి మాట తప్పుతున్నారు. – జూలు కుంట్ల శిరీష్ రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు

అనారోగ్యం బారిన పడుతున్నాం

కంకర పోసి వదిలేయడంతో రోడ్డుపై వాహనాలు వెళ్తున్నప్పుడు దుమ్ము, ధూళి షాపులోకి వచ్చి చేరుతుంది. దీంతో మేం శ్వాసకోశ వ్యాధులతో అనారోగ్యం బారిన పడుతున్నాం. అసలే కరోనా, అందులో దుమ్ము ధూళి.. దీంతో మేం వ్యాపారాలు చేసుకోలేకపోతున్నాం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, నాయకులు స్పందించి రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలి. – భువన్, మెడికల్ షాపు నిర్వాహకుడు

ఏసీలో ఉండడం కాదు రోడ్డు మీదకి రండి

మంత్రి, ఎమ్మెల్యే, అధికారులు ఏసీ కార్లలో తిరుగడం కాదు రోడ్డు మీద కాసేపు నిలబడితే మా బాధ ఏంటో అర్థమవుతుంది. ధర్నా, రాస్తారోకో చేసినప్పుడల్లా వారం పది రోజుల్లో పూర్తి చేయిస్తామని హామీలు ఇస్తున్నారు తప్ప ఆ తర్వాత పట్టించుకోవడంలేదు. 24 గంటలు ఈ దుమ్ములో ఉండి అనారోగ్యాల బారిన పడి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నాం. అయినా మా సమస్యలను పాలకులు, అధికారులు పట్టించుకోవడంలేదు. – వెల్మజాల వెంకట్ రెడ్డి, కిరాణా వ్యాపారి

బండ్లు రిపేర్‌కు వస్తున్నాయి

గాంధీ చౌరస్తా నుండి రైల్వే గేట్ వరకు ఉన్న ఈ రోడ్డు గుంతల మయంగా మారింది. దీంతో ఈ రోడ్డు మీద వెళ్తున్న సమయంలో ప్రమాదాలు జరిగి నడుములు విరుగుతున్నాయి. అంతేకాదు మా వాహనాలు కూడా రిపేర్‌కు వస్తున్నాయి. ఈ గుంతలలో పడి చాలామందికి దెబ్బలు తగిలి ఆస్పత్రుల పాలయ్యారు.

Advertisement

Next Story