రైతులకు స్థానికుల వార్నింగ్..

by Shamantha N |   ( Updated:2021-01-28 05:15:46.0  )
రైతులకు స్థానికుల వార్నింగ్..
X

దిశ, వెబ్‌డెస్క్ : గణతంత్ర వేడుకల సందర్భంగా రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ విధ్వంసానికి దారితీసిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత కిసాన్ సంఘాల్లో చీలికలు రావడంతో ఇప్పటికే రెండు సంఘాలు బయటకు వచ్చి తమ వైఖరిని ప్రకటించాయి. మిగతా రైతు సంఘాల కమిటీలు మాత్రం కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేసేంతవరకు తమ పోరాటం నడుస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే గురువారం ఢిల్లీలోని సింఘు సరిహద్దు వద్ద మరోసారి ఉద్రిక్తత నెలకొంది. కేంద్రం తీరుకు నిరసనగా కొందరు రైతులు రహదారిని ఆక్రమించి బైఠాయించారు.

దీంతో చుట్టుపక్కల స్థానికులు మాత్రం వెంటనే రైతులు ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవాలని గొడవకు దిగారు. రిపబ్లిక్ డే రోజున జరిగిన విధ్వంసక ఘటనల్లో సంఘ విద్రోహ శక్తులు చొరబడ్డాయని ఢిల్లీ పోలీసులు గుర్తించారు. మరోసారి రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపే క్రమంలో మళ్లీ ఏదైనా విధ్వంసం చోటుచేసుకునే అవకాశం లేకపోలేదంటూ స్థానికులు రైతులతో వాగ్వావాదానికి దిగారు. మొన్నటివరకు తాము కూడా రైతులకు అండగానే ఉంటూ వచ్చామని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రోడ్డును ఆక్రమించి నిరసనే తెలపేందుకు తాము అంగీకరించబోమని వారు హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed