గద్దర్‌కు ఘనమైన అక్షర నివాళి.. సాంగ్ మార్చ్

by Ravi |   ( Updated:2023-10-23 01:00:29.0  )
గద్దర్‌కు ఘనమైన అక్షర నివాళి.. సాంగ్ మార్చ్
X

'బహుజన కెరటాలు' మాసపత్రిక తమ సెప్టెంబర్ 2023 సంచికను 'సాంగ్ మార్చ్' పేరుతో గద్దర్ ప్రత్యేక సంచికగా తెచ్చింది. ఈ ఆగస్టు ఆరున ఆకస్మికంగా సంభవించిన గద్దర్ మరణంతో దశాబ్దాలపాటు ఆయన మోగించిన గజ్జెల సవ్వడి, ధిక్కార గానం మూగపోయిన సంగతి జగద్విదితమే. లక్షలాది తెలుగువారి ప్రేమాభిమానాల్ని మూటగట్టుకున్న గద్దర్ నిష్క్రమణ మహా విషాదంగా మిగిలింది. ఈ సందర్భంగా పత్రికలు ఆయన స్మరణలో ఎన్నో వరుస వ్యాసాలను ప్రచురించాయి. ఊరూరా సంతాప సభలు జరిగాయి. ఆ విశేషాలను ప్రోది చేసిన రీతిలో ఈ సాంగ్ మార్చ్ సంచిక ఉంది. గద్దర్ జ్ఞాపకాల పేటికలా రూపొందిన ఈ పుస్తకంలో ఆయనకు చెందిన ఎన్నో విశేషాలున్నాయి. ఆయన ఆట - పాట, జీవితం, త్యాగం, బహుజన సిద్ధాంతం తదితర ప్రస్తావనలతో కూడిన ఎన్నో సంస్మరణ వ్యాసాలు, కవితలు, పాటలు, ఇంటర్వ్యూలు ఈ సంచికలో ఉన్నాయి. ఆయన స్థాయికి తగ్గ స్ఫూర్తి సంచికగా దీనిని తీర్చిదిద్దారు. కాగితపు ఇటుకలతో, అక్షరాల గదులుగా నిర్మించిన గద్దర్ మ్యూజియంగా ఈ పుస్తకాన్ని అభివర్ణించవచ్చు. గద్దర్‍‌ను ఇష్టపడేవారెవరైనా ఈ సంచికను గుండెలకద్దుకుంటారు. మోషే డయాన్ ముఖచిత్రం గద్దర్‌ని సజీవంగా చదువరి ముందు నిలుపుతుంది. లోపలి సమాచారమంతా గద్దర్ బతుకును బహు కోణాల్లో ఆవిష్కరిస్తుంది. ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి గద్దర్‌కు ఘనమైన అక్షర నివాళి సంచికను తెచ్చిన బహుజన కెరటాలు సంపాదక వర్గం, సిబ్బంది అభినందనీయులు.

ఈ సంచికలో వివిధ రచనలతో పాటు ఎన్నో అపురూప ఛాయా చిత్రాలు కూడా ఉన్నాయి. ఫొటోలు చూస్తుంటే గద్దర్ బొమ్మల ఆల్బమ్‌గా అనిపిస్తుంది. గద్దర్ తల్లితో దిగిన ఫోటో, పెళ్ళినాటి ఫొటో.. ఇలా ఎందరితోనో, ఎన్నో సందర్భాల్లో దిగినవి చక్కగా ముద్రించారు. గద్దర్‌తో సమీప సాంగత్యం, అనుబంధం ఉన్న ఎందరో ప్రముఖులు, రచయితలు, అభిమానులు తమ మాటల్లో ఆయనను గుర్తు చేసుకున్నారు. బి.ఎస్. రాములు, జి లక్ష్మి నర్సయ్య, కత్తి పద్మారావు, జిలుకర శ్రీనివాస్, బి నరసింగరావు, పి కేశవ్ కుమార్, కాశీం, టంకశాల అశోక్, జయధీర్ తిరుమలరావు, కె శ్రీనివాస్, పాణి, గోరటి వెంకన్న, ప్రసాదమూర్తి, తాడి ప్రకాష్, ఖాదర్ మొహియుద్దీన్, మల్లేపల్లి లక్ష్మయ్య, కాత్యాయని విద్మహే, అనిశెట్టి రజిత, విమలక్క, మాభూమి సంధ్య తదితరుల వ్యాసాలు, ఇంటర్వ్యూలు, సంపాదకీయాలు ఉన్నాయి. వీటితో పాటు గద్దర్ జ్ఞాపకాలతో రాసిన కవితలు, పాటలు మనసును కదిలిస్తాయి.

కీర్తిశేషులైన రచయితలు కె వి రమణారెడ్డి, చేకూరి రామారావు గద్దర్‌పై రాసిన వ్యాసాలను సేకరించి ఇందులో చేర్చడం ఓ విశేషం. ఏప్రిల్ 1997లో గద్దర్‌పై జరిగిన తుపాకీ కాల్పుల దాడిపై పలు రచనలు ఇందులో ఉన్నాయి. ఆనాడు ఆంధ్రజ్యోతిలో కలేకూరి ప్రసాద్ రాసిన వ్యాసం ఉంది. స్వయంగా గద్దర్ ఆ హత్యాప్రయత్నం నుంచి కోలుకున్న తరువాత 6-5-1997 నాడు పత్రికలకు విడుదల చేసిన ప్రకటన పూర్తి పాఠం చూడవచ్చు. గద్దర్ పాటలు కొన్ని, ఆయన పాడుతూ చేసిన ప్రసంగాలు కొన్ని కలిసి పుస్తకానికి జీవత్వాన్ని ఇచ్చాయి.

అవుట్ లుక్, ది పయినీర్, ది ట్రిబ్యూన్, డెక్కన్ క్రానికల్ లాంటి జాతీయ పత్రికల్లో ఢిల్లీ మరియు వివిధ యూనివర్సిటీలకు చెందిన రచయితలు ప్రొ. బ్రహ్మ ప్రకాష్, ప్రొ. జె. రవీంద్రనాథ్, ప్రొ. సరోజ్ గిరి, ప్రొ. కేశవ్ కుమార్, డా. కె వై రత్నం తదితరులు ఇంగ్లీష్‌లో రాసిన వ్యాసాలు చివరలో ఉన్నాయి. ప్రొ. కేశవ్ కుమార్ రాసిన 'గద్దర్ మహాకవి ఆఫ్ అవర్ టైమ్స్' అనే ఆంగ్ల పుస్తకానికి కలేకూరి ప్రసాద్ రాసిన ముందుమాట ఉంది. వారపత్రిక సైజులో 252 పేజీలతో గద్దర్ నిలువెత్తు నివాళిగా నిలిచే ఈ విశేష సంచికను ఎస్.ఆర్.పల్నాటి, 98499 44170 నెంబర్‌కు రూ.250 పంపి పొందవచ్చు.

-బి. నర్సన్

94401 28169

Advertisement

Next Story