- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సినీ గేయ సాహిత్య గిరి
ప్రౌఢ సమాసాలతో, శబ్దసౌందర్యానికి పెద్దపీట వేసి, పదలాలిత్యంతో పల్లవులల్లిన అభినవ శ్రీనాథుడు వేటూరి. శివ స్వరూపానికి వేటూరి ఇచ్చిన విశ్లేషణ మనం మరెక్కడా చూడం. ఆ సాహిత్య గిరి నుంచి ఉద్భవించిన అక్షర ఝరి పాటల గోదారే. అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం, పువ్వు నవ్వు పులకించే గాలిలో… నింగీ నేలా చుంబించే గాలిలో ఆనందాల సాగే విహారమే’’ పాటలో దేవకన్య ఇంద్రజ భూలోకంలో అడుగిడుతూ వినోదయాత్రకు వచ్చినట్లు వర్ణించిన వేటూరీ సాహో..
తెలుగు సినీకవులలో అత్యంత వేగంగా పాటలు రాసిన వారిలో ప్రథమ స్థానం వేటూరిదే. ప్రౌఢ సమాసాలతో, శబ్దసౌందర్యానికి పెద్దపీట వేసి, పదలాలిత్యంతో పల్లవులల్లిన అభినవ శ్రీనాథుడు వేటూరి. అన్ని రకాల పాటలు రాయగల సవ్యసాచి. శ్రీనాధుడు రచించిన ‘’వికటపాటల జటా మకుటికా భారంబు కరుకైన జుంజురు నెరులుగాక’’ అనే పద్యాన్ని స్పూర్తిగా తీసుకొని తనదైన శైలిలో వేటూరి ‘’నెలవంక తలపాగ నెమలి ఈకగ మారె… తలపైన గంగమ్మ తలపులోనికి జారె… నిప్పులుమిసే కన్ను నిదురోయి బొట్టాయె… బూదిపూతకు మారు పులితోలు వలువాయె… ఎరుక గలిగిన శివుడు ఎరుకగా మారగా … తల్లి పార్వతి మారె తాను ఎరుకతగా’’ అంటూ వాడుక భాషలో పాటను రాశారు. వేటూరికి తెలుగంటే మమకారం.
త్రికాలములు నీ నేత్రత్రయమై...
అయితే వేటూరి తన పాటల్లో సంస్కృత సమాసాలు కూడా వాడారు. అవి చాలా గంభీరంగా కూడా వుంటాయి. ‘సాగర సంగమం’లో ’’ఓం నమశ్శివాయ చంద్రకళాధర సహృదయా’’ పాటలో ‘’త్రికాలములు నీ నేత్రత్రయమై, చతుర్వేదములు ప్రాకారములై, గజముఖ షణ్ముఖ ప్రమాధాదులు నీ సంకల్పానికి ఋత్విజవరులై, అద్వైతమే నీ ఆదియోగమై, నీ లయలే ఈ కాలగమనమై, కైలాస గిరివాస నీగానమే జంత్ర గాత్రముల శృతి కలయా’’ అంటూ వర్ణించడం ఒక్క వేటూరికే చెల్లింది అనడంలో అతిశయోక్తి లేదు. శివ స్వరూపానికి వేటూరి ఇచ్చిన విశ్లేషణ మనం మరెక్కడా చూడం. సందర్భోచితంగా పాట రాయడం వేటూరి గొప్పతనానికి నిదర్శనం.
స్వరరాగ రసభావ తాళాన్వితం...
అలాగే ‘భైరవద్వీపం’ చిత్రంలో ‘’శ్రీతుంబుర నారద నాదామృతం, స్వరరాగ రసభావ తాళాన్వితం’’ పాటలో సింహభాగం సంస్కృత సమాసాలే!”. చిరంజీవి సినిమా ‘ఛాలెంజ్’లో సంస్కృత సమాసాలతో కూడిన ‘’ఇందువదన, కుందరదన, మందగమన, మధురవచన, గగన జఘన సొగసు లలనవే’’ పాటను రాశారు. నాయికను వర్ణిస్తూ చంద్రబింబం వంటి ముఖ వర్చస్సు, మల్లెపూల వంటి పల్వరస, సుతారపు నడక, మధురమైన భాష కలిగిన చిన్నదానా అంటూ వేటూరి తనదైన శైలిలో చమత్కరించారు. అలాగే ‘గీతాంజలి’ సినిమాలో ‘’ఆమనీ పాడవే హాయిగా, మూగవైపోకు ఈ వేళా’’ అనే పాటలో ‘’వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా, మనస్సులో నిరాశలే రచించెలే మరీచికా’’ అంటూ ఎండమావి నిరాశను రాసినట్లు పోలుస్తూ లోతైన భావాన్ని వ్యక్తీకరించారు. ఇక సమాసాలు పొసగని పదాలకు సమాసాన్ని కలుపుతూ దుష్ట సమాసాలను కూడా వేటూరి యదేచ్చగా వాడారు. నియమాలకు వ్యతిరేకంగా తెలుగు పదాలను సంస్కృత పదాలను కలిపేస్తూ పాటలు కూడా రాశారు.
మాటతో ఆటాడుకున్న చతురుడు
అడవిరాముడు చిత్రానికి సింగిల్ కార్డ్ పాటల రచయిత వేటూరి గారే. అందులో ‘’ఆరేసుకోబోయి పారేసుకున్నావు హరీ’’ అనే పాటను ఆ రోజుల్లో కోటి రూపాయల పాట అని చెప్పుకునేవారు. ‘ప్రేమించు-పెళ్ళాడు’ చిత్రంలో ‘’నిరంతరమూ వసంతములే, మందారముల మరందములే’’ అనే పాటలో ఋతువులు మారిపోతున్నా ప్రేమికులకు మాత్రం అన్ని రుతువులూ వసంత ఋతువులే అంటూ ఓ మంచి పాటను రాశారు. ఇలా వుంటాయి వేటూరి మధురిమలు. అలాగే ‘ఆఖరి పోరాటం’ చిత్రంలో ‘’ఆషాఢం ఉరుముతువుంటే, నీ మెరుపే చిదుముకున్నా… హేమంతం కరుగుతూ వుంటే, నీ అందం కడుగుతున్నా’’ అని కూడా ఋతువుల పనిపెట్టారు. ‘వేటగాడు’ లో వేటూరి మొత్తం 7 పాటలు రాశారు. ‘’ఆకు చాటు పిందె తడిసే, కొమ్మమాటు పువ్వు తడిసే ఇది వాన పాట కావడంతో చినుకు అనే పదంతో వేటూరి ఆడుకున్నారు. ‘’ముద్దిచ్చి ఓ చినుకు ముత్యమైపోతుంటే, చిగురాకు పాదాల సిరిమువ్వలౌతుంటే, ఓ చినుకు నిను తాకి తడియారిపోతుంటే, ఓ చినుకు నీ మెడలో నగలాగా నవుతుంటే, నీ మాట విని మబ్బు మెరిసి జడివాన కురిసిందని రాస్తూ… మరొక చరణంలో ‘మెరుపు’ అనే మాటతో ఆటాడుకున్న చతురుడు వేటూరి.
అందాలలో అహో మహోదయం
‘ముద్దమందారం’ లో ‘’ముద్దుకే ముద్దొచ్చే మందారం, మువ్వల్లే నవ్వింది సింగారం’’ పాటలో ‘మల్లెపువ్వా కాదు మరుల మారాణి, బంతిపూవా కాదు పసుపు పారాణి… పరువాల పరవళ్ళు పరికిణీ కుచ్చిళ్లు, కన్నెపిల్లా కాదు కలల కాణాచి’ అని రాసిన విధానం; ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమాలో దేవకన్య ఇంద్రజ భూలోకంలో అడుగిడుతూ భూలోకపు అందాలను వర్ణించే ‘’అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం, పువ్వు నవ్వు పులకించే గాలిలో… నింగీ నేలా చుంబించే గాలిలో ఆనందాల సాగే విహారమే’’ పాట వినోదయాత్రకు వచ్చినట్లు వర్ణించిన వేటూరీ సాహో... ‘ఇంటింటి రామాయణం’ సినిమాలో ‘’వీణ వేణువైన సరిగమ విన్నావా… తీగ రాగమైన మధురిమ కన్నావా, తనువు తహతహలాడాల, చెలరేగాల, చెలి ఊగాల ఉయ్యాల ఈవేళలో’’ కూడా ఒక అద్భుతమైన భావగీతం. వేటూరి రాసిన వేల పాటల్లో ఎన్నింటిని ఉదహరిచగలం! ఆ సాహిత్య గిరి నుంచి ఉద్భవించిన అక్షర ఝరి పాటల గోదారే.
(నేడు వేటూరి సుందరరామమూర్తి జయంతి)
-శ్రీధర్ వాడవల్లి
99898 55445