జానపద నవలా సామ్రాట్

by Ravi |   ( Updated:2023-10-29 19:30:44.0  )
జానపద నవలా సామ్రాట్
X

దాసరి సుబ్రహ్మణ్యం అనే పేరు ప్రపంచానికి 2010 జనవరి‌కి ముందు ఏ కొద్దిమందికో తప్ప ఎక్కువమందికి తెలియదు. ఆయన మరణించిన తరువాత ఇంటర్నెట్ పుణ్యమా అని ఆయన గురించి తెలిసిన మిత్రులు సామాజిక మాధ్యమాల ద్వారా దాసరి సుబ్రహ్మణ్యం అంటే ఎవరో చర్చ మొదలైంది. ఆయన మరణానంతరం మేము బాల సాహిత్య పరిషత్ తరపున సంస్మరణ సభ ఏర్పాటు చేసి ఆ సభలో ఆయన గొప్పతనాన్ని మరుగునపడి ఉన్న మాణిక్యం వంటి ఆయన ప్రతిభ విశేషాలను ప్రపంచానికి తెలియజేయాలని 2010 మేలో రచన సంచికని దాసరి సుబ్రహ్మణ్యం ప్రత్యేక సంచికగా తీసుకురావడం జరిగింది. ఆ సంచికలో ఆయన గురించిన సమగ్ర విశేషాలను తెలియజేసే వ్యాసాలున్నాయి. అంతే కాకుండా చందమామ ఉన్నతికి బాగా దోహదపడి చందమామ చరిత్రలో మైలురాళ్లుగా నిలిచిన 12 అద్భుతమైనటువంటి జానపద సీరియల్స్‌ని ఒక్కొక్క రచయిత చేత విశ్లేషించి ఆ విశ్లేషణ వ్యాసాలను అందులో పొందుపరచడం జరిగింది. ఆ సంచిక ద్వారా దాసరి సుబ్రహ్మణ్యం గురించి ఇంకా ఎక్కువ మందికి తెలిసింది. అయితే 2011 జనవరి ‘రచన’ సంచికలో దాసరి సుబ్రహ్మణ్యం గురించి నేను రాసిన ‘ఈయన సామాన్యుడు కాదు’ అనే వ్యాసం ద్వారా ఆయన విశ్వరూపం ప్రపంచానికి తెలిసింది.

తరాలను మురిపించిన సీరియల్స్

1954 నుండి చందమామలో వస్తున్న అద్భుత జానపద సీరియల్స్ రెండు మూడు తరాల వారిని మురిపించాయి. వయోభేదం లేకుండా అందరినీ ఆకట్టుకొని మంత్ర నగరి సరిహద్దుల్లోకి కొనిపోయి, అపూర్వ అలౌకిక లోకాల్లో విహరింపజేసేవి. ఆ జానపద సీరియల్స్‌ను చదివి ఆ జ్ఞాపకాలను పదిలంగా దాచుకొనే వారేగానీ విస్మరించిన వారు దాదాపుగా అరుదు. ఆ సీరియల్స్ లోని బొమ్మలను, కథను, కథా గమనాన్ని, సంఘటనలనూ, చిత్ర విచిత్రమైన పాత్రల పేర్లు, మంచి వుత్కంఠ రేపుతూ సీరియల్‌ని ముగించే విధానం వీటన్నిటి ఆస్వాదిస్తూ ఆనందించారు తప్ప వాటిని ఎవరు రాశారు అనే ఆలోచన జోలికి ఎవరూ వెళ్ళలేదు. అంతగా ఎవరికైనా అనుమానం వస్తే ఆ సీరియల్ కింద చందమామ అని ఉంటుంది కాబట్టి, చందమామలో పని చేసే ఎవరో ఒకరు రాసి ఉంటారు అని అనుకుంటారు. సుబ్రహ్మణ్యం గారూ కూడా ఎవరితో సంబంధం లేకుండా తన పాటికి తాను నిశ్శబ్దంగా రాసుకుంటూ వెళ్ళిపోయాడు. 54 సంవత్సరాల పాటు చందమామలో ఉద్యోగం, ఇలా ఒకే సంస్థలో ఉద్యోగం బహుశా ఇది ప్రపంచ రికార్డు కావచ్చు, గిన్నిస్ బుక్ లోకి ఎక్కించవచ్చు.

'తోకచుక్క' సీరియల్ ప్రభంజనం

1922 అక్టోబర్ 25న తెనాలి ప్రాంతంలో జన్మించిన దాసరి సుబ్రహ్మణ్యం 3వ తరగతితోనే చదువు ముగించి కమ్యూనిస్టు ఉద్యమాల్లో పాల్గొని జైలు పాలయ్యారు. తర్వాత జీవిక కోసం నిజామాబాద్ బోధన్, మహారాష్ట్ర జాల్నా వంటి చోట్ల పనులు చేశారు. తెలుగు పత్రికలో ప్రూఫ్ రీడర్ వంటి పనులు చేశారు. అభిసారిక పత్రికలో పనిచేశారు. దాని మూసివేత తర్వాత ఈదర లక్ష్మీనారాయణ గారి సిఫార్సుతో చందమామలో చేరడానికి మద్రాసు రైలెక్కారు. చందమామలో విచిత్ర కవలలు వంటి విశిష్ట విచిత్ర జానపద సీరియల్ రచయిత రాజారావు మరణించడంతో, అలాంటి ధారావాహికను రాయడానికి చందమామ సంపాదక వర్గంలో అందరివేళ్ళు సుబ్రహ్మణ్యం గారిని చూపించాయి. ఆయన ఉద్యోగంలో చేరింది మొదలు ఏదో చందమామలో ప్రచురణార్థం వచ్చేటువంటి కథల్ని చందమామ శైలిలో తనదైన మెరుపుతో తిరిగి రాయడమే తప్ప అసలు బాలసాహిత్యం రాసే అలవాటు గానీ అందులో ప్రవేశం కానీ, ఆ ప్రక్రియ గురించిన అవగాహన కానీ ఆయనకు లేదు. కానీ చక్రపాణి ఆదేశించిన తర్వాత తప్పలేదు.

తోకచుక్క అంటే జనాల్లో ఉన్న మూఢనమ్మకాన్ని పోగొట్టే ఒక సీరియల్ రాయమని మాత్రమే చక్రపాణి సూచన. ఆ సూచన అనుసరించి చందమామ ఆస్థాన చిత్రకారుడు కొన్ని బొమ్మలు వేశారు. ఆ బొమ్మలతో తోకచుక్క సీరియల్ వస్తోందని ప్రకటన కూడా వెలువడింది. సుబ్రహ్మణ్యం ఆ బొమ్మల్ని ఆలంబన చేసుకుని మొదటి నెల మ్యాటర్ ఇచ్చారు. తోకచుక్క చందమామ చరిత్రలో ఒక ప్రభంజనం. చందమామలో మొట్టమొదటి రంగుల బొమ్మల సీరియల్ చందమామ సర్కులేషన్ ప్రారంభంలోనే రెండు రెట్లు పెంచినటువంటి అత్యంత ప్రభావితమైనటువంటి జానపద సీరియల్. దానికి సిక్వెల్ గా 'మకర దేవత' వచ్చింది సుబ్రహ్మణ్యం వెనక్కు చూసుకోలేదు వరుసగా 'ముగ్గురు మాంత్రికులు', 'కంచుకోట', 'జ్వాలా ద్వీపం', 'రాకాసిలోయ' వంటి సీరియల్స్ రాస్తూ పోయారు. ఎందుకో గాని సుబ్రమణ్యం సీరియల్స్‌కు బ్రేక్ వేసి, ‘దుర్గేశ నందిని’, ‘నవాబు నందిని’ అనే రెండు బెంగాలీ నవలల్ని కుటుంబరావు గారిచేత అనువాదం చేయించి సీరియల్‌గా వేశారు. చందమామ సర్కులేషన్‌లో ఒక కుదుపు దీంతో ఉలిక్కిపడిన చందమామ యాజమాన్యం తిరిగి మళ్లీ సుబ్రహ్మణ్యంని ఆశ్రయించక తప్పలేదు. ఆ తరువాత వచ్చిన 'పాతాళదుర్గం', అనంతరం వచ్చిన 'శిధిలాలయం', 'రాతి రథం', 'యక్ష పర్వతం' చందమామ అభిమానులను ఆనందపరిచాయి.

విలక్షణ రచనా శైలి

సుబ్రహ్మణ్యం గారు సీరియల్ ఎన్ని నెలలు వస్తుందో అవుట్ లైన్ అనుకొని ఎలాంటి ప్రణాళిక లేకుండా రాసేవారు. ఏ నెల మేటర్ ఆ నెలలోనే రాసేవారు. చందమామ సీరియల్ రేపు కంపోజింగ్‌కు వెళ్ళాలి అనంగా ఆ కంపోజిటర్ వచ్చి సుబ్రహ్మణ్యం గారికి ఒకరోజు ముందు గుర్తు చేస్తాడు. ఆ రోజు రాత్రి కూర్చొని ఆ నెల సీరియల్ భాగం రాసేస్తారు. అయితే, అలా ఏ నెలకానెల రాసినప్పటికీ, కథ ఎక్కడా లింక్ తెగినట్టు లేకపోవడం సుబ్రహ్మణ్యం శైలి ప్రత్యేకత. అయితే ప్రతి నెల సీరియల్ ముగించేటప్పుడు ఒక చక్కటి అనూహ్యమైన సస్పెన్స్ తో సీరియల్ను ముగించడం, చదవడం మొదలు పెట్టిన వాళ్ళు సీరియల్ చివరి దాకా చదివించేలా చేయడం అనేది ఆయన రచనా విలక్షణ పద్ధతి. సీరియల్ ఏ నెలకానెల రాసినప్పటికీ, ఒక సీరియల్ లోని ప్రాంతాల పేర్లు, పాత్రల పేర్లు మరో సీరియల్ లో రిపీట్ అయ్యేవికావు. ఈ అంశంపై రచన శాయి, రచన మే 2010 సంచికలో ‘చిత్రం భళారే విచిత్రం ఆ పేర్లన్నీ చిత్రాతి విచిత్రాలే’ అనే వ్యాసం రాశారు. సుబ్రహ్మణ్యం జ్వాలాద్వీపం సీరియల్ లో అవతార్ సినిమాలోని ఎగిరే పక్షులను ఆనాడే సృష్టించాడు. 'మాయా సరోవరం'లో మనుషులను తినే చెట్లు ఉన్నాయని రాసినా, నిజంగా అవి ఆఫ్రికా అడవుల్లో ఉన్న మాట నిజం. ఇలా ప్రతి కోణంలోనూ విలక్షణ ప్రదర్శించేవి సుబ్రహ్మణ్యంగారి సీరియల్స్. గట్టిగా గాలి వీస్తే కొట్టుకుపోయేలా జెండా కర్రలా బక్కగా ఉండే ఒక సాధారణ మనిషిలా కనపడే ఒక అసాధారణ మనిషి దాసరి సుబ్రహ్మణ్యం.

డా. దాసరి వెంకటరమణ

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత

90005 72573

Advertisement

Next Story