రంగురంగుల సూర్యోదయాలు

by Ravi |   ( Updated:2024-05-13 00:30:27.0  )
రంగురంగుల సూర్యోదయాలు
X

తెలుగు సాహిత్యంలోనే కాదు. సమస్త భారత సాహిత్యంలోనూ ముక్తకం అనే కవితా ప్రక్రియకు ఉన్న ప్రాచుర్యం కానీ, ప్రజాదరణ కానీ మరే పక్రియకూ లేదనడం అతిశయోక్తి కాదని చెప్పాలి. కొత్తపాతల మేలుకలయికను ప్రబోధిస్తూ గురజాడ అప్పారావు వెలువరించినన ముత్యాల సరాలను ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. కొయ్యబొమ్మలె 'మెచ్చుకళ్ళకు కోమలుల సౌరెక్కునా అంటూ సాగిన ఈ గీతం ఆధునిక తెలుగు సాహిత్యంలో ముక్త కవిత్వానికి కొత్త చివురులు తొడిగిన కవిత. ఇక ఆయన రాసిన దేశభక్తి గీతం కానీ, పూర్ణమ్మ గేయం కానీ తెలుగు సాహిత్యాభిమానులు ఈరోజుకీ గుండెకు హత్తుకుని పాడుకునే గేయాలు.

ప్రాచీన భారతీయ సాహిత్యంలో రెండు వేల సంవత్సరాల క్రితం ప్రాకృత భాషలో వెలువడిన గాథాసప్తశతి నుంచి, వెయ్యేళ్ల తర్వాత క్షేమేంద్రుడు సంస్కృతంలో రాసిన గొప్ప గేయాలు కానీ ముక్తకాలే కదా.. శ్రీనాథుని చాటువులు, సుమతి శతక కర్త బద్దెన రాసిన నీతి పద్యాలు, అడిదం సూరకవి కవిత్వం కానీ ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇక తెలుగులో వేమన రాసిన ప్రపంచ ప్రఖ్యాతమైన విశ్వదాభిరామ వినురవేమ పద్యాలు, 20వ శతాబ్దం ప్రథమార్థంలో శ్రీశ్రీ రాసిన 'ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం' గేయం కానీ, 1970ల మొదట్లో శివసాగర్ రాసిన 'ఉరికంబం మీద నిలిచి ఊహాగానము చేసెద, నా ఊహల ఉయ్యాలలోన మరో జగతి వికసించును' అంటూ పాడిన ఉరిపాట కానీ ముక్త కవిత్వాన్ని శిఖర స్థాయిలో నిలిపాయి. సకల జనులు పాడుకునే జాతి గీతాలై వెలుగుతున్నాయవి. ముక్తకం అంటే ముక్తసరి అని, సంక్షిప్తత, క్లుప్తత అనే అర్థం ఉంది. అరబ్బీ భాషలో ముక్తసర్ అనే పదం టూకీగా, క్లుప్తంగా అనే అర్థమిస్తుంది. ఇది ఎలా ప్రవేశించిందో కానీ తెలుగులో దూరి ముక్తసరి అర్థంలో స్థిరపడిపోయింది.

ఏడు పదుల వయసులోనూ వరుసగా కవిత్వ సంపుటాలను ప్రచురిస్తూ వస్తున్న సీనియర్ కవి 'నిజం' శ్రీరామమూర్తి గారు. నలభై సంవత్సరాల పైబడిన పాత్రికేయ అనుభవం, 70 సంవత్సరాల జీవితం, అనేక పత్రికలలో అలంకరించిన సంపాదకీయ బాధ్యతలు.. అయినా కవిత్వాన్ని వదలని, రకరకాల ఒత్తిళ్లలోనూ కవిత్వం చావని అరుదైన కవి ఈయన. పచ్చి నిజాలను మాత్రమే చెబుతాను అని శపథం చేసేలా ఆయన ప్రతి పుస్తకంలో నిజాలను కొరడాగా చేసుకుని పాలకులపై, అస్తవ్యస్త వ్యవస్థపై చెళ్లుమని చరుస్తారు. తాజాగా ఆయన తీసుకొచ్చిన కవిత్వమే 'రంగురంగుల సూర్యోదయాలు' పుస్తకం. ముందుమాటలు మినహాయించగా మిగిలిన 109 పేజీల పొడవునా నాలుగు పాదాల ముక్తకాలను చిక్కగా పరిచేశారు. ధీరకవిత్వాన్ని, వెరపులేని వ్యక్తీకరణను కలంలో నింపుకున్నారు కనుకే నిజాన్ని నిక్కచ్చిగా ప్రకటించారు.

కవిత్వంలో సంపూర్ణత సాధించినవారే అన్ని రంగుల్నీ, దర్శించగలరు, ప్రదర్శించగలరు. అందుకే జీవితాన్ని సప్తవర్ణాల రంజితంగా అనుభూతి చెందే తన కవిత్వం రంగురంగుల సూర్యోదయాలయింది. అయిదు దశాబ్దాలుగా కవిత్వాన్ని శ్వాసగా చేసుకున్న ఈ కవి గతాన్ని, వర్తమానాన్ని ఆకళింపు చేసుకున్న పరిణితితో సమాజ దశను, దానిలో మార్పులను ఒడిసిపట్టుకున్నారు కాబట్టే ఇప్పటికీ చిక్కటి కవిత్వాన్ని తన కలం నుంచి ప్రసరింపజేస్తూనే ఉన్నారు. సమాజంతో పాటు మారుతున్న ఆయన అనుభవమే ఇప్పుడు సరికొత్త సూర్యోదయమైంది. మచ్చుకు కొన్ని కవితాపాదాలు చూద్దాం..

కాలితో కావ్యం' రాయగల కార్మికులు/ బొగ్గులై కాదు నిప్పులూ కాగలరు?/ చరిత్రకు రెక్కలు తొడగ్గలరు

కుక్క కరిస్తే/ మందు ఉంటుంది/ మతం కరిస్తే/ ఉండదు

పూలమీద గాలి/ పుటం పెట్టినా పరిమళిస్తుంది/ పోరు గాయాలు/ నేలకు వీర లేపనం చేస్తాయి.

రెండు పూల మధ్య ఖాళీని/ పరిమళం పూరిస్తుంది/ ఇద్దరు మనుషుల మధ్య/ బంధాన్ని మతం నరుకుతుంది

కవిగా జీవిస్తూ,/ కవిత్వంగా మరణించకూడదు,/ శ్వాసించని అక్షరం/ శవవాసన వేస్తుంది.

కంప్యూటర్‌తో ఏమైనా చేసుకోవచ్చు,/ పంచభక్ష్య పరమాన్నాలూ/ సృష్టించుకోవచ్చు/ అమ్మరుచి ఆనవాళ్లుండవు

స్త్రీపై యాజమాన్య తంత్రంతో/ రాముడిని కాపలా పెట్టారు/ ఆమె గతి మారాలంటే/ వాచ్ మేన్‌ని తొలగించాలి

రంగురంగుల సూర్యోదయాలు పుస్తకం 500 చిన్న కవితల హారం. ముక్తకాలు, స్వతంత్ర అస్తిత్వాన్ని ప్రదర్శించే చతుష్పాదులు, అక్కడక్కడ కనిపించే అయిదు పాదాల కవితలు... వేటికవే విడిగా ఉంటూ ఒక్క పద్యం ముగియగానే చదువరికి ఆ.... అనే ఆశ్చర్యం చాలా చోట్ల కలుగుతుంది. 2003 ప్రారంభంలో బూడిద చెట్ల పూలు కవితా సంపుటితో వచ్చి సీరియస్ ఫామ్‌లో కవిత్వాన్ని పండించిన నిజం శ్రీరామమూర్తి గారు 2024 లో చిన్న కవితలతో, ఇంకా చెప్పాలంటే ముక్తకంతో పరిణితిని ప్రదర్శించారు. అన్ని కవితా పాదాలు ఒకే వరవడితో, చిక్కదనంతో ఉన్నాయని చెప్పలేం కానీ ఆయన కలం జాలువార్చిన వ్యంగ్యం, చెణుకు, వ్యక్తీకరణ తీవ్రత ఎవరినైనా కట్టిపడేస్తాయి. సమాజంలోని

అసమానత్వాన్ని, అన్యాయాలను, పాలకుల దౌష్ట్యాన్ని ఒక్క సిద్ధాంత పదబంధం కూడా లేకుండా సూటిగా కవిత్వ ప్రేమికుల గుండెలను తాకి ఆలోచింపజేసే డిక్షన్ ఆయన సొంతం చేసుకున్నారు. నిజాన్ని నిర్భయంగా, నిక్కచ్చిగా, రాజీలేని చందాన వ్యక్తీకరించే సాహస కవిత్వాన్ని చూడాలంటే 'నిజం' రాసిన తాజా పుస్తకం రంగురంగుల సూర్యోదయాలు చదవాల్సింది. చదివి ఆస్వాదించాల్సిందే...

పుస్తకం: రంగురంగుల సూర్యోదయాలు

కవి: నిజం

పేజీలు: 140

వెల: రూ. 125

ప్రతులకు 98483 51806


సమీక్ష

రాజశేఖర రాజు

73964 94557

Advertisement

Next Story

Most Viewed