ముప్పై ఏళ్ల పిలుపు

by Ravi |   ( Updated:2023-08-27 19:00:57.0  )
ముప్పై ఏళ్ల పిలుపు
X

కూలి పనులకు వెళ్లి పాలివ్వడానికి

వచ్చిన అమ్మను చూసి

అమ్మ రొమ్ము కోసం కొంగు జుంగుకుంటూ

అమ్మ మెడలో పుస్తెలతాడు పట్టుకొని ఆడిన నాకు

పాలిస్తూ అమ్మ పాడిన పాటలోని రాగాలు

సాయంత్రం పాలతో పెరుగుతో

గోరుముద్దలు తినిపిస్తుంటే మారం జేసిన

నాకు అగో చందమామ వచ్చిండు

నీ బువ్వ మొత్తం చందమామ తింటాడు

అని అమ్మ చెప్పిన మాటలు

రా..రా.. చందమామ దా..దా.. తిని పోదురా

బువ్వ మావోడు తినడంటా అని అమ్మ అన్నప్పుడు

గుటుక్కున బువ్వ ముద్దులు తింటూ

ఆనందపడిన నా బాల్యం

పున్నమి రోజున నిండు చందమామను

చూసి నులక మంచాలపై పొర్లుతూ

మామ మామ చందమామ

నీ పిల్లను ఇస్తావా చందమామ

అంటూ పిలుచుకున్న పిలుపులు

ఆకాశంలో చందమామను చూసినప్పుడల్లా

చెట్టు కనిపించేది చెట్టు కింద

పేదరాశి పెద్దమ్మ కథలు చెప్పేది

బడిలో చందమామ రావే జాబిల్లి రావే

బండెక్కి రావే బంతిపూలు తేవే అని

పాటలు పాడుకున్న జ్ఞాపకాలు

ముప్పై ఏళ్ల పాటు సాగిన నా అనుభవాలు

నా బాల్య మధుర స్మృతుల మధ్యన

చందమామను పిలిచిన రోజులెన్నో

చందమామను ముద్దాడిన రోజులెన్నో

చందమామను కౌగిలించుకున్న రోజైతే ఈరోజే

అమ్మమ్మ చందమామను పిలిచింది

నాన్నమ్మ చందమామను పిలిచింది

అమ్మ కూడా చందమామను పిలిచింది

నేనూ చందమామను పిలిచాను

అంతరం ఎక్కువుంది

చందమామకు వినబడలేనట్లుంది

ఇస్రో రాయబారం నడిపింది

చంద్రయాన్-3 అంటూ

నేడు విశ్వవిజేతగా జాబిల్లిని చేరి

మా పిలుపులను వినిపించింది

నా ముప్పై ఏళ్ల పిలుపు

చందమామ విన్నందుకు

నాకిప్పుడు చందమామను

కౌగిలించుకున్నట్లుంది

నాకిప్పుడు చందమామను

ముద్దాడుతున్నట్లుంది

ఎజ్జు మల్లయ్య

తెలుగు లెక్చరర్

96528 71915

Advertisement

Next Story

Most Viewed