మమ్మల్ని వదిలి వెళ్లొద్దు సార్!!

by Ravi |   ( Updated:2024-07-01 01:30:29.0  )
మమ్మల్ని వదిలి వెళ్లొద్దు సార్!!
X

మమ్మల్ని మా బడిని వదిలి వెళ్లొద్దు సార్

మీకు పుణ్యముంటది

ప్లీజ్ సార్ మమ్మల్ని అర్థం చేసుకోండి..

మేము బువ్వ తినేటప్పుడు మా కంచంల

మీ పేర్లను దిద్దుకుంటాం సార్

అరిగిపోయిన పెన్సిల్ ముక్కతో

మీ బొమ్మను పుస్తకాల అట్టమీద దిద్దుకున్నాం.

కలబంద పొదలమాటున గొర్రెలుగాసే నన్ను

బడిలో చేర్చింది మీరే కదా సార్

పత్తిపూల నడుమ వాడిపోయే నా జీవితాన్ని

వెన్నెలోలే వెల్గించింది మీరే కదా సార్.

గొడ్డలిపట్టి మొద్దులు నరికిన

మా చేతులతో అక్షరాలు‌ దిద్దిస్తిరి

మట్టి తట్టలు మోసిన మా నెత్తులమీద

పుస్తకాల సూర్యులను పొడిపిస్తిరి.

సదువంటే తెలియని మా కుటుంబాలలో

సదువుకే వన్నెదెస్తిరి

గుడిసె వాట్లకు కొడవండ్లు వేలాడటం చూసిన

మా కండ్లకు కలాలను మొలిపిస్తిరి.

తరగతి గదిలో మీ పాఠాలు

మాకు బత్కుదీపాలైనయి

మధ్యమధ్యలో మీరు పలికే పద్యాలు

మా చెవులలో మారుమోగుతున్నాయి

మీరు లేని తరగతి గది

బంగారం లేని గనిలా మారింది సార్.

మీరు కొట్టినా తిట్టినా పుస్తకాలను

ముఖానికి అడ్డుపెట్టుకుని నవ్వుకున్నాం

తరగతిలో మొదటి ర్యాంకుకు

మీరిచ్చిన చాక్లెట్ పంచిన తియ్యదనం

నా నాలుకమీద అట్లనే ఉంది.

నల్ల బల్లమీద మీరు గీసిన

అక్షాంశాల రేఖాంశాల గీతలు

చెరపబుద్ది కావట్లేదు

లఘువు గురువుల గుర్తులు

రేఖాంశాల చిత్రాలు

మైటోకాండ్రియా, పరమాణు నిర్మాణం బొమ్మలు

మా మనసు మీద ముద్రించుకున్నాం సర్.

ఏ బడికి వెళ్లిన మా బడికి

అప్పుడప్పుడు వస్తు ఉండండీ సార్

మీరు యాడ కనబడినా

రెండు చేతులెత్తి నమస్కారం పెడతుంటాం

నొచ్చుకోకుండా ఓ చిరునవ్వు

చిందించడం మర్చిపోకండి సార్.

(ఈ మధ్య టీచర్ల బదిలీల వలన సంవత్సరాల తరబడి పిల్లల మదిలో చెరగని ముద్ర వేసుకొన్న కొంతమంది టీచర్లను పిల్లలు అడ్డుకున్న దృశ్యం చూసి రాసుకున్న కవిత్వం)

- అవనిశ్రీ

99854 19424

Advertisement

Next Story

Most Viewed