మనసు పరిమళాలు... నానీల కమ్మలు

by Ravi |   ( Updated:2024-06-23 19:01:02.0  )
మనసు పరిమళాలు... నానీల కమ్మలు
X

తెలుగు సాహితీ ఉద్యానవనానికి ఆలస్యంగా వచ్చిన అసలైన పరిశోధక రచయిత చక్కని సృజనకారుడు డా. మడత భాస్కర్. విద్యార్థి దశ నుంచే తనలో గూడు కట్టుకున్న భావాలను తనలోనే పదిలం చేసుకొని ఉద్యోగ జీవితంలో అడుగిడాక తనలోని భావాల బాణాలను పుస్తకాల రూపంలో ఒక్కొక్కటిగా పాఠకులకు అందించే పనిలో పడ్డాడు, అందులో భాగంగా వెలువడిందే ఈ నానీల కమ్మలు, నానీల నాన్న డా ఎన్. గోపి గారి ఆశయ క్షేత్రానికి అందిన మరో నూతన మొలక ఇది.

అవ్వచేతి ముద్ద అసలైన రుచి

తెలుగు భాషా బోధకుడైన భాస్కర్‌లో, అతని రచనల్లోనూ పైకి కనిపించని హాస్యం గిలిగింతలు పెడుతుంది. ఆయన ప్రతి రచనలో అనుభవసారంతో పాటు సామాజిక స్పృహ, సాధించాల్సిన లక్ష్యాలు అందంగా ఆవిష్కరించబడతాయి. తన ఈ తొలి నానీల సంపుటిలో కూడా అదే పరిణతి అక్షరాక్షరాన కనిపిస్తుంది. అక్కడక్కడ అతడు చెప్పే వ్యక్తిగత అంశాల్లో కూడా తరచి చూస్తే వ్యవస్థాగతం కనిపిస్తుంది. పరాయితనంలోని ఆత్మీయత కన్నా సొంతదనంలోని అనురాగపు గొప్పతనం ఇష్టపడే ఈ కవి... పంచభక్ష్య పరమాన్నం నాకెందుకు అవ్వచేతి ముద్ద అసలైన రుచి అంటాడు. ఈయన ఆశించిన ఈ సొంతదనంలోని సౌఖ్యతను భాషకు, సంస్కృతికి, నివాసానికి విధిగా అందరం అన్వయించుకోవాలి.

నేర్పుతాం.. నేర్చుకుంటాం

అమ్మను జీవనదిగా తలిచే కవిలోని భావుకత, నమ్మకానికి చిరునామా దారుగా నాన్నను అభివర్ణించిన కవి వైనం, మనం ఇందులో దర్శించవచ్చు. ఇక కవిగారి స్వీయ వృత్తి అయిన తెలుగు బోధనకు సంబంధించిన నానీలు కూడా అందంగా, ఆవేశంగా, హాస్యంగా, ఆవిష్కరించబడి ఆలోచింపజేస్తాయి. పాఠం నేర్పుతున్నాం అనుకుంటాం నిజానికి పాఠం నేర్చుకుంటాం, అని కవి అనడంలో బోధకుడు నిత్య విద్యార్థిగా ఉండి నేర్చుకుంటూ నేర్పాలి అని ఆదర్శ సందేశం అందించారు, పాఠం చెప్పడం ముఖ్యం కాదు రుజువు చూపే నేర్పు కావాలి, అంటూ బోధనలోని ప్రామాణికతను గుర్తు చేశారు.

ఏ కాకిని చూసినా ఏకాకిలా లేదు

తనదైన తెలుగు భాషాభిమానాన్ని...తరగతి గదిలో మాస్టారు గొంతెత్తాడు... తెలుగు పద్యం పరవశిస్తోంది .. అంటూ ఎలుగెత్తి చాటాడు. అంతేగాక తెలుగు భాష చాలా గొప్పది. బడిలో మాత్రం ఆంగ్ల మాధ్యమం అంటూ నేటి తెలుగు భాష స్థితి పట్ల తన అసహనాన్ని వెల్లడించారు. మనుషుల్లో రోజురోజుకూ పెరిగిపోతున్న అనైక్యత గురించి ధర్మాగ్రహం వ్యక్తం చేస్తూ కాకులను చూసైనా బుద్ధి తెచ్చుకోవాలంటూ ఆధునిక మానవ సమాజాన్ని ఎద్దేవా చేశారు కవి, ఏ కాకిని చూసినా ఏకాకిలా లేదు ఒక్క మనిషి తప్ప అనే నానిలో మనిషితనాన్ని ఎంచక్కా చమత్కరించారు.

పల్లె సైట్ కొడితే....

పాశ్చాత్య సంస్కృతులు పట్టణాలకే పరిమితం అని సరిపెట్టుకున్నాం, కానీ ఇప్పుడు ఆ పాడు సంస్కృతి పల్లెలను ఆవహిస్తుంది అని కవి గారి ఆందోళన ఎంత చిలిపిగా చెప్పారో... ఈ నానీలో.. పట్నమే అనుకున్నా ఇప్పుడు పల్లెటూరు కూడా సైట్ కొడుతుంది,... ఇలా ప్రతి నానీ తన తన కొలతలతోనే నిగారించుకుని ఆలోచింపజేసే అందమైన అక్షరానుభూతులతో పొరలు పొరలుగా తెరలు కడతాయి, ఈ నానీల కమ్మలు. నానీల నాన్న డాక్టర్ గోపి గారు ఈ సంపుటికి అందించిన ఆప్త ధ్రువపత్రంలో చెప్పినట్టు భాస్కర్ నానీల్లో అతని సామాజిక వర్గం ధ్వనిస్తుంది, అందుకే వీటిని నానీల కమ్మలు అన్నారు, నిజంగా ఇవి నానీల తాళపత్రాలే..!!

నానీల కమ్మలు

పేజీలు 136, ధర రూ.150

ప్రతులకు

డా మడత భాస్కర్

8919328582


సమీక్షకుడు

డా. అమ్మిన శ్రీనివాసరాజు

77298 83223

Advertisement

Next Story

Most Viewed