పుస్తక సమీక్ష: వాస్తవిక కవితా గవాక్షం

by Ravi |   ( Updated:2023-09-03 19:00:12.0  )
పుస్తక సమీక్ష: వాస్తవిక కవితా గవాక్షం
X

నిరంతర కవి అన్నవరం దేవేందర్‌ పన్నెండొవ కవితా సంపుటి 'గవాయి'. ఈ పుస్తకం కరీంనగర్‌ సాహితీగౌతమి వారి సినారె పురస్కారానికి ఇటీవల ఎంపికైంది. దాదాపు మూడు దశాబ్దాలుగా అన్నవరం కవితా సేద్యం చేస్తున్నారు. కాగా మూడేండ్ల కాలాని(2018-2022)కి చెందిన కల్లోలం-విస్ఫోటనాల ప్రతిఫలనంగా ఈ 'గవాయి' కవిత్వం పురుడు వోసుకుంది. ఈ పుస్తకాన్ని ప్రజాస్వామిక ఉద్యమాల ఆచరణవాది నరెడ్ల శ్రీనివాస్‌కు అన్నవరం అంకితమిచ్చారు.

దీనిలో కరోనా సృష్టించిన కల్లోలం తాలూకు దుఃఖం అక్షరాలై ప్రవహిస్తాయి. చీకట్లు ముసురుకున్న కాలానికి ఆత్మవిశ్వాసమిచ్చే అన్నవరం కవితాచికిత్స 'గవాయి'లో ప్రతిబింబిస్తుంది. ఉద్రేకాలు-ఉద్వేగాల్లోంచి ఉరకలెత్తే కవిత్వం రాసిన అన్నవరం అభివ్యక్తిలో - పరిణతిలో ఓ గుణాత్మక ప్రస్థానం ఈ సంపుటిలో ద్యోతకమవుతుంది. నిరాశల్ని-నిట్టూర్పుల్ని అధిగమించి తీరుతామన్న ఆత్మగౌరవం ప్రస్ఫుటించే భరోసా గీతాల మూలికగా 'గవాయి' కవిత్వం సాగిపోతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే తనకు తాను నిలదొక్కుకుంటూనే దుఃఖ పూరిత సమాజాన్ని స్వస్థతపరిచే అన్నవరం కవిత్వమే ఈ సంపుటి పద్యాల ప్రత్యేకత.

అక్షరాలను కవిత్వంగా పలికించి..

జీవితమిచ్చే ప్రతి అనుభవాన్ని కొత్తగా ఆస్వాదిస్తూనే దాన్ని తాజాగా పలవరించి, కలవరించి కవిత్వం చేయడం అన్నవరం ప్రత్యేకత. ఆనందాలను హర్షాతిరేకాల స్థాయికి తీసుకెళ్ళి జీవనోత్సవంగా ప్రతిష్టించడం అన్నవరం తాత్వికతగా కనిపిస్తుంది. వెతలను, యాతనలను స్పర్శిస్తూనే, దర్శిస్తూనే లోతుల్లోకి వెళ్ళి తడిమి ప్రశ్నల కొడవళ్ళను ఎత్తడం ఆయన అక్షరాలకు అలవోకగా తెలిసిన విద్య. అన్నవరం కలానికి పోయెట్రీ హాలిడేలుండవు. అట్లాగని స్టీరియోపోనిక్‌ శబ్దరాహిత్యమూ వుండదు. ఎప్పటికప్పుడు కొత్తగా సరికొత్తగా అక్షరాలను కవిత్వంగా పలికించే అభివ్యక్తి అన్నవరం కలానిది. తొట్రుపాటు - తడబాటు ఎరుగని సాధికారిక నడక అతని వాక్యానిది. గాయపడిన కాలానికి జీవన రహస్యాల్ని అత్యంత సరళంగా తన ఇంటి భాషలో విప్పి చెప్పి నిబ్బరాన్నిచ్చే ఇగురం ఈ కవిత్వం నిండా పరచుకుని వుంది. మెరుగైన సమాజాన్ని కలగంటూనే, మానవవాద ప్రాతిపదికన శాస్త్రీయ సునిశిత పరిశీలనలతో సామాజికుడుగా తన చూపుతో ప్రతి వస్తువునూ వైవిధ్యభరిత కవిత్వంగా రూపుకట్టించగల ప్రతిభాశాలి అన్నవరం. గవాయి రచనాకాలం... మూడేండ్లలో జరిగిన కరోనా మహమ్మారి విధ్వంసం, భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు, ఆర్టీసీ కార్మికుల సమ్మె, పౌరసత్వ చట్టాల సవరణలు - వివాదాలు - కవులపై సర్కారుల కన్నెర్రలు, కొత్త వ్యవసాయ చట్టాలు, మిన్నంటిన రైతుల ఆందోళనలు సహా వైయక్తిక అనుభూతులు, ప్రయాణాలు, పదవీ విరమణానంతర జీవితపు అనుభవాలు... మొదలైన అంశాలు వస్తువులుగా ఈ కవిత్వం గవాయిగా రూపుదాల్చింది.

వాస్తవికత విస్తుపోయే కవితలు రాస్తూ..

ప్రముఖ సాహితీ విమర్శకుడు డాక్టర్‌ సుంకిరెడ్డి నారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎంతో గమనార్హం. ‘అన్నవరం దేవేందర్‌ ఒక రాడార్‌, ఆ రేడియల్‌ నుంచి ఏదీ తప్పించుకోలేదు. రాకెట్‌ నుంచి వైరస్‌ దాకా! దేవేందర్‌ వెయ్యి కొండ్ల పాతాల జరిగె, జీవిత అగాథాల్లో దాగిన అన్నిటినీ పట్టుకొస్తుంది’ అని సుంకిరెడ్డి విశ్లేషించారు. దేవేందర్‌ వృత్తి కవి. కవిత్వమే ఆయన నిత్య పని. తాను నడిచివచ్చిన తొవ్వలోని ప్రతి మూల మలుపును ఒడుపుగా కవిత్వంగా రికార్డు చేయగలిగిన పోయెటిక్‌ హిస్టోరియన్‌. తన కాలపు చరిత్రకు నిశ్చేష్టుడైన సాక్షిగా అన్నవరం వుండదలచుకోలేదు. క్రియాశీలకమైన 'గవాయి'గా నిలవాలనుకుంటాడు. నిజానికి 'గవాయి' పేరును, అప్పటికే తమ పుస్తకాలకు జిలుకర శ్రీనివాస్‌, ఆవునూరి సమ్మయ్యలు వినియోగించారు. ఈ పదంపై కవికెందుకో తీరని మోహం. తన కవిత్వ పుస్తకానికీ 'గవాయి' పేరును ఎంచుకున్నాడు. ఈ సంపుటిలో 'గవాయి' శీర్షికన అత్యద్భుతమైన కవితనొకటి అన్నవరం రాశాడు.

'గాలి మొగులు నీళ్ళు నిప్పుల్లా../ ప్రకృతిలో ఆకృతులమై నేల మీద బతికినం/ పుట్టిన పుట్టుకనే బతుకును గవాయి’ అని నిర్హేతుకమైన అంశాలున్న పౌరసత్వ సవరణలను కవి ధిక్కరిస్తాడు. కవి తాత్విక పరిణతకు నిదర్శనం 'వడపోత' అనే కవిత.

'నేను ఒకే ఒక్క దేహాకృతిని కాదు/ పెనుగులాటలో తేలిన లొల్లి శబ్దాన్ని/ మర్లవడ్డప్పుడు లేచి నిలిచిన తలపువ్వును/ పారిన నెత్తురు అద్దుకున్న పతాకాన్ని/ నేను - ఒక నా స్వంతం కాదు/ త్యాగాల కాన్పుల నుంచి కెవ్వుమన్న శిశువును' అని 'నేను' అనే కవితలో సామూహికతే తన చిరునామాగా కవి ప్రకటిస్తాడు. కవి ప్రాపంచిక దృక్పథాన్ని పట్టిచ్చే కవిత 'అల్లిబిల్లి'. సమకాలీన రాజకీయాలపై వ్యంగ్యాస్త్రం గురిపెట్టి వదిలాడు కవి ఈ కవితలో ! 'పంచాంగం ప్రతి యేటా శ్రవణానందమే/ రాజ్యాంగం రాశి ఫలాలే అందని ద్రాక్షలు/ రాజ్యం సంస్కృతి పరస్పరం ఆవహించుకున్నాక/ నియంత్రిత ఆధ్యాత్మికతనే ఊరేగుతోంది/ప్రభుత్వ పెట్టుబడే కలిసి ప్రేమించుకున్నాక/ ప్రైవేటీకరణమే రాజ్య ప్రాయోజితం’ కవి కుండ బద్దలు కొడతాడు. వాస్తవికతను విస్తుపోయే కవిత్వంగా చేస్తాడు కవి. కరోనా కవితలు - వజ్రోత్సవాల కవిత - ఆర్టీసీ కార్మికుల సమ్మెపై రాసిన కవితలతో పాటు తాతగా కొత్త పాత్రలోకి మారాక మనుమరాలు - మనుమడు చూపిన సరికొత్త లోకాల్లో ఈ కవి ఉబ్బితబ్బిబై రాసిన కవితలున్నాయి ఈ సంపుటిలో. మనుమనితో తీయించుకున్న ఫోటో, సహచరితో సముద్రతీరంలో బంధించుకున్న ఛాయాచిత్రాలు సంపుటికి కొత్త శోభను జోడించాయి. అన్నింటికంటే మించి కరోనా కాలపు వాస్తవ ప్రపంచాన్నీ, గవాయి కవిత్వాన్నీ ప్రతిబింబించే అన్నవరం శ్రీనివాస్‌ ముఖచిత్రం ఈ పుస్తకానికి అదనపు విలువైన వనరు. 'గవాయి' వాస్తవ కవిత్వం పరంపరలో నిఖార్సయిన గీటురాయిగా మిగులుతుంది.

(గవాయికి సినారె పురస్కారం లభించింది)

- సి.వి.కుమార్‌

98499 02910

Advertisement

Next Story