- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మనుషుల స్వభావాల్ని చిత్రిక పట్టిన నవల
ఒకే ఒక్క వర్షం ఆకాశం నుండి భూమి మీదకు దిగ విడిచిన తెరలా ఆగకుండా కురిసి, తెరమీది పాత్రలని వాళ్ళ వేషాలని, తెర వెనుక వాళ్ల చేతల్ని చూపి, వర్షం వెలిసిన తర్వాత రంగులు తుడుచుకుపోయి, ఏది ముఖమో ఏది ముసుగో స్పష్టంగా చూపెట్టిన పుస్తకం "వాన". ఉన్నత కులం, తక్కువ కులం మధ్య అంతర్లీనంగా సాగుతున్న తెరను ఎత్తిచూపి, పేద, ధనిక అంతరాలు, సమాజపు అస్తవ్యస్తవతలను నగ్నంగా చూపించిన కన్నడ సుప్రసిద్ధ రచయిత "డాక్టర్ చిదానంద సాలి". ఈ నవలను తెలుగు పాఠక లోకానికి అందించిన వారు "రంగనాథ రామచంద్రరావు".
వర్ష విలయానికి దృశ్యమానం
2009లో కర్ణాటక ఉత్తర భాగంలో భారీ వర్షాలు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. ప్రకృతి సృష్టించిన ఈ విలయానికి అపారమైన నష్టం వాటిల్లింది. ఆ సందర్భంలో చూసిన వాస్తవ సంఘటనలను, మనుషుల స్వభావాలను ఈ నవలలో రచయిత దృశ్యమానం చేశారు. "ఊరు వదిలిన వాళ్లు రాను రానూ ఊరికి దూరమైపోతారు" అన్న తండ్రి మాటను లెక్క చేయక బతుకు తెరువు కోసం "తిమోతి" పట్నంలో స్థిరపడతాడు. నచ్చిన జర్నలిజం, ఇష్టమైన పెళ్లి చేసుకొని రాను రాను పెరిగిన ఉరినే మరిచిపోతాడు. మళ్లీ ఆ ఊరికి వెళ్లాలంటే ఆ ఊళ్లో ఎవరి పెళ్లయినా ఉండాలి లేదా ఎవరైనా చనిపోయి ఉండాలి.
వృత్తి నిబద్ధత మటుమాయం
"ఒకప్పటి ఆ బలమైన పేగు బంధంలో ఇప్పుడు ఒక సన్నని దారప్పోగు మాత్రమే మిగిలి ఉంది" అన్న వాస్తవికతకు లోనవుతాడు "తిమోతి". వృత్తిపట్ల నిబద్ధతగల తిమోతి ప్రజల హితం కోరే వార్తలు ప్రచురించాలని భావిస్తాడు కానీ యాజమాన్యం అందుకు అంగీకరించదు. తిమోతి ఎన్జీవో బృందంతో కలిసి వరద బాధితుల సహాయార్థం పనిచేయడానికి ఉపక్రమిస్తాడు. ప్రభుత్వ అనుకూల, ప్రజాహితానికి అనుకూల, తటస్థ అభిప్రాయాల పత్రికలు తెలియజేసే వార్తల వ్యత్యాసాలను ఎన్.జీ.వో. అబ్దుల్లాకు వివరిస్తాడు. ఈ క్రమంలో వారికి ఎంతోమంది సామాజిక బాధ్యత, సామాజిక శ్రద్ధ అనే పేరుతో కీర్తి కోసం పాకులాడే వ్యక్తులూ తారసపడతారు.
వరద బాధితుల చూపుల్లో దైన్యం
భారీ వర్షం కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పునరావాస శిబిరాల్లో పిల్లలు, వృద్ధులు, మహిళలు వారి చూపులలోని దైన్యత, తిండి కోసం, బట్ట కోసం యాచన కన్నీరు తెప్పిస్తుంది. వరద బాధితులకు విడుదల చేసే ఆర్థిక సహాయం అవినీతిపరుల పాలిట వరంగా మలుచుకునే తీరు వేదనకు గురి చేస్తుంది. నిజాయితీపరులే శాశ్వతంగా ప్రజల మనసుల్లో నిలిచినప్పటికీ, చివరికి వరద సహాయక చర్యల్లో పని చేసిన వారు కాకుండా, కాకా పట్టిన వారిని అందలమెక్కిస్తారు.
కన్నడ వార పత్రికలో సీరియల్‌గా ప్రచురితమైన ఈ నవల, బెంగుళూరు విశ్వవిద్యాలయం బీఏ ఐదవ సెమిస్టర్ విద్యార్థులకు పాఠ్యాంశంగా నిర్ణయించబడింది. మానవ సంవేదనకు అద్దం పట్టే ఈ నవల చదవాలంటే ఛాయా పబ్లికేషన్స్ వారిని సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9848023384.
పుస్తకం : వాన
పేజీలు : 106
వెల: రూ. 120
రచయిత : డాక్టర్ చిదానంద సాలి
అనువాదం : రంగనాథ రామచంద్రరావు
ప్రచురణ: ఛాయా పబ్లికేషన్స్
ప్రతులకు : 98480 23384
సమీక్షకురాలు
- లేదాళ్ళ జయ,
87901 82908