పోరు కితాబు జూన్ 2, 2014

by Ravi |   ( Updated:2023-06-04 19:00:50.0  )
పోరు కితాబు జూన్ 2, 2014
X

కథైనా, కవితైనా చదువరిని ఆకర్షించి, తనలోపలికి తీసుకుని వెళ్ళేది ముమ్మాటికీ శీర్షికనే. తేదీ, నెల, సంవత్సరం… ఇలా అంకెలతో అరుదుగా వచ్చే శీర్షికలు ఏదో ఓ చారిత్రక ప్రాధాన్యతనో, ప్రత్యేకతనో కలిగివుంటాయి. అలాంటిదే, కోడం పవన్ కుమార్ రచించిన కవితా సంపుటి జూన్ 2, 2014.

‘తారీఖులు, దస్తావేజులు/ఇవి కావోయ్ చరిత్రకర్థం’ అని బూజు పట్టిన చరితావలోకనంపై శ్రీశ్రీ హసించినా.. స్వరాష్ట్ర కాంక్షతో పోరు పిడికిళ్లయి కదంతొక్కిన నాలుగున్నర కోట్ల తెలంగాణ వాసుల సువర్ణ స్వప్నం సాకారమైన రోజది! శ్రీలు- రెండయినా, మరి మూడయి.. నొసలు చిట్లించినా, చరిత్రను తిరగరాసిన రోజది!! ఆ సందర్భాన్ని “తొలి, మలి ఉద్యమాలు కలుసుకున్న అర్ధరాత్రి/ మారిన తేదీ తెలంగాణను తెరపైకి తెచ్చింది” అంటూ ‘జూన్ 2, 2014’ కవితగా రికార్డు చేసి, ఈ కవి అక్షరంగా నిలిచిపోయాడు.

రెండే రెండు పాదపంక్తుల్లో..

సంకలనంలోని కవితలెన్నో ఉద్యమ కాలంలో ఉద్భవించినవే. సీనియర్ జర్నలిస్ట్‌గా పోరాటాన్ని చాలా దగ్గరగా చూసి, వార్తలు కట్టినవాడు.. పాత్రికేయుడుగా తన విధులకు పరిమితమైతే అంతటితో ఆగిపోయేవాడు. కానీ, తనలోని కవి ఉద్యమ పాదాలతో పదం కలపమని పోరుబెట్టినాడు. అలా అని, వొట్టి నినాద కవిత్వం కాదు. జీవిత సంఘర్షణను, అందులోని తాత్వికతను, ఒడిసిపట్టుకుని మనలోకి ఒంపుతాడు. “ఒక రాత్రి కరిగి కరిగి/ ఉదయాన/ టీ కప్పులో సూర్యుడై ఆవిషరించుకుంది” అని తన నిదురలేని రాత్రిని అక్షరం చేస్తాడు.

సమకాలీన సంఘటనలకు స్పందించే గుణం ఉన్న కవి ఎప్పటికీ వట్టిపోడన్నది నిజంచేస్తూ రైల్వే క్రాసింగ్ దాటుతుండగా, పొగబండి ఇనుప చక్రాల క్రింద పడి ఛిద్రమైన బడిబస్‌లోని పిల్లలను తలపోస్తూ ‘మాసాయిపేట మరణమృదంగం’ కవితలో “రైలు గేట్‌కు విచ్చుకున్న పువ్వులు” అని తల్లడిల్లుతాడు. ఇక్కడితో కవితను ముగించకుండా, మరో దుర్ఘటనతో ముడివేసి “బియాస్ నది వరదలా ముంచెత్తిన రైలు” అని పోలిక తేవడంలో కవి, జర్నలిస్ట్‌ల మేలు కలయిక కనిపిస్తుంది.

అలాగే, నాసిక్ నుంచి ముంబాయి వరకు కిసాన్ లాంగ్ మార్చ్ నిర్వహించినా, మహారాష్ట్ర రైతులకు సంఘీభావంగా రాసిన ‘మట్టిపాదాల మహాయాత్ర’ కవితలో “నిత్యం కన్నీటి వెతలతో సాగు చేయలేక/ అసెంబ్లీ ముందు గొంతు విప్పారు” అంటూ వారు నిరసన తెలపడానికి కఠోర పదమార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారో రెండే రెండు పాదపంక్తుల్లో గుండెని పిండేస్తాడు. బహుశా ఈ పోరాటమే పంజాబ్-హర్యానా రైతులకు స్ఫూర్తినిచ్చివుంటుంది. అయితే, విజయ బావుటాలు ఎగరేసిన ఈ పోరుబాటను, మిగతా బాధిత రాష్ట్ర రైతులు ఎందుకు ఎంచుకోలేకపోతున్నారో..? ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోవడం పెను విషాదం!

కవి ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ..

కవితకు సమకాలీనత ఉంటే పది కాలాలపాటు ప్రజల హృదయాల్లో పదిలమౌతాయి అలాంటిదే ‘తుపాకీ గుళ్ళు’ కవిత. “అవి నిర్జీవమైనవే/ విడిగా ఉన్నప్పుడు/ తుపాకీలో దూరాయంటే/ రక్తం రుచి మరిగిన పులులే”. మతం రాజకీయం రెండూ ఏకమైతే సమాజంలో జరిగే నష్టం తీవ్రత ఎలా ఉంటుందో చెప్పకనే చెబుతాడు. వస్తువును అలవోకగా కవిత్వం చేయడం ఆశ్చర్యానందానికి గురిచేస్తుంది. ఇక్కడ, ఎంచుకున్న వస్తువు పాతదే.. మానవాళి ఉన్నంతకాలం తుపాకి అనివార్యంగా ఉండేదే! రక్షించేది, వేరొకరి హక్కుల్ని భక్షించేదీ ఒకటే. ఉపయోగించే సందర్భాన్ని, అది ఎవరి చేతుల్లో ఉంది అనే దాన్ని బట్టి దాని గుణం మారుతుంది.

ఉద్యమాల అడ్డా ధర్నాచౌక్‌ను తొలగించాలన్న తెలంగాణ ప్రభుత్వ అనాలోచిత ఆలోచనపై నిరసన పలికిన కవిత ‘ధ్వంసం కానున్న ధర్నాచౌక్’. “ఇప్పుడిక హక్కుల సాధనకు సచివాలయమే వేదిక/ సీఎం కార్యాలయం చుట్టూ డిమాండ్లు అల్లుకుపోవాలి/ నినాదాలను కార్పె‌ట్‌లా పరిచి ఆహ్వానం పలకాలి/ పిడికిళ్లన్నీ ఒక్కటై రాజముద్రగా మారాలి” అనడంతో కవి ప్రతిపక్ష పాత్ర తెలుస్తుంది. తెలంగాణ సాధన పోరాటంలో మమేకమై, కవితలల్లిన ఇతడేనా ధిక్కార స్వరాన్ని వినిపిస్తుంది! అని, ఒక క్షణం అచ్చెరువొందినా.. ''ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేర దాకా తరుముతాం.. ప్రాంతీయుడే ద్రోహం చేస్తే పాతరేస్తాం'' అన్న కాళోజీ బాటలో బావుటాయెత్తి నడుస్తున్నందుకు ఆనందం కలుగుతుంది.

‘కనబడుట లేదు’ ప్రకటనలు మనిషి సమూహంలోంచి తప్పిపోయినప్పుడు.. గోడలపై పోస్టర్లుగా, వార్తా పత్రికల్లో అడ్వర్టైజ్‌లుగా సాధారణంగా కనిపిస్తాయి. అది మామూలే! అయితే, ఈ కవితలో తప్పిపోయింది మనిషి కాదు. మనిషితనం లోపించిన సమాజం చేత, “కాంక్రీట్ జంగిల్‌లో/తప్పిపోయిన ఆప్తుడు” పచ్చని చెట్టును గురించిన కవితా ప్రకటన ఇది. అడవుల్ని అంతమొందించి, నదుల్ని మలినాలతో, సముద్రాల్ని ప్లాస్టిక్ వ్యర్థాలతో ముంచి, గుట్టల్ని భూమట్రం చేస్తూ, మనిషి మనుగడను ప్రశ్నార్థకం చేసుకుంటున్న మనం- ఎప్పటికన్నా మారుతామా? అనుమానమే!

'నిన్నర్థం చేసుకుంటున్నాను' కవిత, సంపుటి చివర్లో కూర్పు చేసినా- ఇది చదవడం పూర్తిచేశాకా, పఠిత మనోఫలకంపై ప్రథమ స్థానంలో నిలిచిపోతుంది. ఇక చివరకు, వైయుక్తికం నుంచి సామాజిక స్థాయికి పయనించే కవితా వైచిత్రి- విభ్రమకు గురిచేస్తుంది. ఇది ఎవరికి వారుగా చదువుతూ ‘అనుభవించాల్సిన భావచిత్రాల రుచి’ అని భావించి, కవితా పంక్తుల్ని ఒక్కటైనా ఇక్కడ రాయకుండానే ముగిస్తున్నాను.

కవి, రచయిత, వ్యాసకర్త, విలేకరి అయిన కోడం పవన్ కుమార్- అంతర్బహిర్ రంగాల్ని నిశితంగా పరిశీలించి, తనదైన శైలి సంతకం కలిగిన కవితలతో వెలువరించిన ద్వితీయ సంపుటి ఇది. వాడ్రేవు చినవీరభద్రుడు - గుంటూరు శేషేంద్ర శర్మ గార్ల ఉత్తరప్రత్యుత్తరాల్లో శేషేంద్ర గారు ఉల్లేఖించిన “అనుభవం రూపాంతరం చెంది అక్షరంగా మారాలి” మాట ఈ సంపుటికి పూర్తిగా వర్తిస్తుంది.

-పిన్నంశెట్టి కిషన్

9700230310

Advertisement

Next Story

Most Viewed