కవితలై పుష్పించిన బడి సోపతులు

by Ravi |   ( Updated:2023-04-23 19:00:51.0  )
కవితలై పుష్పించిన బడి సోపతులు
X

జీవితం సంక్లిష్టమైన చోట, వర్తమానం ఒంటరితనంతో గడిచే వేళ మనిషి గతంలోకి వెళ్ళడం, సామూహికతను వెతుక్కోవడం సహజం. ఆ వెతుకులాట బాల్యంలోకి, బడివద్దకు తీసుకెళ్ళడం అందరికి అనుభవమే. దాని ప్రతిఫలమే పూర్వవిద్యార్థుల సమ్మేళనం. అత్మీయ సమ్మేళనం మొదలైనవి. ఇవి ఆయా బ్యాచ్‌లకే పరిమితం. వీటి ఎక్స్‌టెన్షన్ ఉత్సవాలుగా ఉంటుంది. సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, డైమండ్ జూబ్లీ ఇలా పలురకాలు. ఇలాంటి వాటికి పరిధి పరమావధి ఉంటుంది. ఈ పరంపరలో భాగంగానే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(బాలుర) హుస్నాబాద్ వజ్రోత్సవం జరుపుకుంటున్నది. ఈ విషయం తెలియగానే ఆ ప్రాంత వాసిగా సంతోషం కలిగింది. వజ్రోత్సవం వారం పాటు సాగడం నిర్వాహకుల నిబద్ధతకు సాక్ష్యంగా నిలుస్తుంది. వారంలో ఒకరోజు కవి సమ్మేళనం. చదవబోయే కవితల్ని ముందుగానే ఆహ్వానించడం వల్ల వజ్రోత్సవ కవిత సంకలనం పురుడు పోసుకుంది. ప్రముఖ కవి అన్నవరం దేవేందర్ సంపాదకత్వంలో అందంగా ముస్తాబయింది. కొండా లక్ష్మణ్, జి.వి శ్యాంప్రసాద్ లాల్, మనీల, విధుమౌళి, శంకర్, వీరన్నయాదవ్, అన్నవరం శ్రీనివాస్‌ల సహ సంపాదకత్వం వల్ల సంకలన సారం ఇనుమడించింది.

ఇందులో ఒకరో ఇద్దరో తప్ప మిగతా వారంతా బడిచుట్టూ పెనవేసుకొని నిద్రించిన తమ జ్ఞాపకాలను తట్టిలేపి కవితల ద్వారా పంచుకున్నారు. సందర్భం అందుకు కారణమైంది. నాస్టాల్జియాలేని నరుడు లేడు. దాన్ని మరిచిపోలేని మనిషి ఉండడు. బడి-బాల్యం రెండూ కలగలిసిన జ్ఞాపకాలు చాలా వరకు మధురంగానే ఉంటాయి. అందుకే బడిని తలచుకోగానే ‘పానం పాలపిట్టయితది తనువు తంగేడు పువ్వయినది’ అని ఒక కవి ఇందులో రాశాడు. బడిలో పెట్టే పరీక్షల వల్ల విద్యార్థుల్లో పోటీ పెరిగి అవాంఛనీయ లక్షణాలు అలవడతాయని ఒకచోట గిజూబాయి అంటాడు. చాలావరకు అది నిజమే అయినా తరువాతి కాలాన అది మధురానుభూతిగా మిగులుతుంది. కింది కవితావాక్యాలు అందుకు నిదర్శనాలు ‘అప్పుడు చదువుల్లో, పాటల్లో పోటీపడ్డ స్నేహం, ఇప్పుడొక అందమైన బాల్యస్మృతి’

ఇదొక కరువు ప్రాంతం కల్లోల భరితం. ఇక్కడి నేలల్లో చైతన్యం, తిరుగుబాటు, విప్లవం ముప్పేట అల్లుకొని ఎదిగి పూసింది. అదొక ఎడతెగని హుస్నాబాధ. అలాంటి చోట పిల్లలను విద్యార్థులుగా మార్చి, అభివృద్ధి పధంలో విడిచింది ఈ బడి. అందుకే చాలా కవితల్లో ఆనాటి గురువుల స్మరణ కనబడుతుంది. పనిలోపనిగా కొంతమంది ఇక్కడి ఎల్లమ్మ చెరువును, బొడ్డుమల్లె చెట్టును యాది చేసుకున్నరు. ఇలాంటప్పుడే ఒంటరితనం సామూహికతో లయిస్తుంది. ఒక తాదాత్మ్యత అంకురిస్తుంది. అలాంటి స్థితి నుంచే 'ఊరంతా దీవెనై ఆప్యాయంగా అలల ఊపులో వెన్ను నిమిరినట్లయింది' అనే కవితా వాక్యం పుట్టుకొచ్చింది. వర్షాకాలంలో బడికి ఆపద్దర్మ సెలవులు ఉండేవి. వర్షపు నీళ్ళల్లో ఆడుకున్న ఆటలు సంకలనంలో ఉన్నాయి. వాన బెదిరిస్తే వరుకులో దాక్కున్న వైనం కూడా కనిపిస్తుంది. ఆనాటి సార్లు నేర్పిన క్రమశిక్షణను కొందరు గుర్తుకుతెస్తే, వారు విధించిన శిక్షలను సైతం తలపోసినవారున్నారు.

నేను బడికి వచ్చేవారిలో షష్ఠిపూర్తి జరుపుకున్న పిల్లలు, యవ్వనోత్సాహం నింపుకున్న మధ్య వయస్కులు ఉన్నారు. వారిలో తాటిమట్ట మీద కూర్చొని పొలం గట్టుమీద ఆడిన ఆట ఇచ్చిన కిక్కు ఇప్పుడు లేదెందుకు అని వాపోయేవారు. జీవితమనే గురువు నేర్పిన గుణపాఠపు పాఠ్యంశంను అని ప్రకటించేవారు. వయిలు, పెన్నులు, అంగీలాగుడు అవసరాలు తీర్చే ఆదివారము నాకు ఆటవిడుపు కాకపాయె అని గతం గుర్తుకు తెచ్చుకునే వారున్నారు. సరదాలు, కొండెమాటలు, నిర్వేదాలు, విమర్శలు చెలాయించే వారందరికీ నేడు బడి ఒక రంగస్థలం. చిన్ననాటి నుండి నేటివరకు వ్యక్తి వెనుక దన్నుగా నిలిచిన బడి ఒక పూర్వస్థలి. సంకలనంలో ఉపాధ్యాయ కవులున్నారు. వారి జీవితం మొత్తం బడితో ముడిపడి ఉంది. బడిలో వచ్చే మార్పులకు సాక్షులు వారు.

'మేము సెలవుల్లో ఆడిన మైదానం ఎక్కడ అని అడిగితే ఆడేవాడు లేక మేడలైనాయని బదులిచ్చాయి' అనే కవితా వాక్యం భౌతిక మార్పును సూచిస్తుంది. బడికి సంబంధించిన గుణాత్మకతమైన మార్పును అత్యంత హృద్యంగా చెప్పిన కవిత, ఒళ్ళు గుగుర్పాటుకు గురిచేస్తుంది. అదే కవిత్వపటుత్వం.

పరిమళాలు వెదజల్లాల్సిన పూదోటలో ఏదో గంజాయి వాసన ప్రమాదం పొంచి ఉంది. మానవులు తయారవ్వాల్సిన ఫ్యాక్టరీలో ఎందుకో మారణాయుధాలు తయారవుతున్నాయి. కరోనానంతర పాఠశాల చాలా మార్పులకు గురైంది. పలకా, బలపం పట్టాల్సిన చేతులు చరవాణిని చేతపట్టి మిగతావాటిని తిరస్కరిస్తున్నాయి. పరాయితనమేదో ప్రవేశించి గురుశిష్యుల మధ్య బంధాన్ని తుంచివేస్తుంది. అందుకే మంచుకొండలా చల్లగా ఉండాల్సిన మనిషితనం/ ఎందుకనో లావాలా జ్వలిస్తుంది. అంది కవయిత్రి.

ఈ బడి చల్లిన విత్తులు వటవృక్షాలయి ఎందరికో నీడనిస్తున్నాయి. నేడు ఆ మహావృక్షాలు తిరిగి తమ బడివైపు మరలినాయి. తన సంతోషాన్ని తెలుపుతూ బడి వసంతగీతం పాడుతుంది. విందాం, పాడుదాం, ఆనందిద్దాం.

డా. బి.వి.ఎన్ స్వామి

92478 17732

Advertisement

Next Story

Most Viewed