- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గిరిజన సంస్కృతిని చూపే 'తూతకొమ్ము'
ఏ సమాజమైనా, సామాజికవర్గానికైనా ఆయువు వాటి సంస్కృతి సంప్రదాయాలు. వాటి పరిరక్షణే ఆయా జాతుల సజీవత్వానికి కారకాలుగా నిలుస్తాయి. ఆ పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిది. ముఖ్యంగా సృజనకారులైన రచయితలు కవులది. అందులో భాగంగానే ఈ మానుకోట (మహబూబాబాద్) కవి తన సామాజికవర్గ సంస్కృతి సంప్రదాయాలకు చెందిన అంశాలనే వస్తువులుగా చేసుకొని అడవినే అందమైన కవితగా అందించారు కవి పెనుక ప్రభాకర్.
అడవిని ముడిసరుకుగా ఎంచుకొని..
నిత్యం తాను చూస్తున్న తన జాతి నాగరికతకు సంబంధించిన ఆలోచనలు తనను చుట్టుముట్టగా, తనలో వెల్లివిరిసిన భావావేశపు చప్పుడే ఈ ‘తూతకొమ్ము’ కవితా సంపుటి. ఇప్పటివరకూ గిరిజన సంస్కృతికి చెందిన వార్తలు, వార్తా కథనాలు, వ్యాసాలు, కథలు, చదివాం. కానీ అచ్చంగా గిరిజన సంప్రదాయాల నేపథ్యంలో అరకొర కవితలు అక్కడక్కడ కనిపించి ఉండవచ్చు, కానీ ఇలా ఏకమొత్తంలో ‘నలభై కవితలు’ అడవి బిడ్డల కోసమే వెలువరించడం ఒక విశేషం.
కవి ప్రభాకర్ కవిత వయస్సు చిన్నది కావచ్చు గాక. కానీ దాని ఆలోచన లోతులు చాలా పెద్దవి. తనదైన జాతి సంస్కృతిపై పరాయికరణ, విదేశీతత్వం, చేస్తున్న దాడి ద్వారా కలిగే ఆవేదన ఈ కవిత్వం ఆవిర్భావానికి పెద్ద ప్రేరణ అనవచ్చు. గుండె లోతుల్లో ఎంత ఆవేదన వున్నా, దాన్నంతా పెదవి మీద పంటితో దాచేసి, ఎక్కడా ఇసుమంత పరుషపదజాలం లేకుండా, సహృదయ తీరులో తన ఆవేదనలను అక్షరీకరించారు ప్రభాకర్. ఈ కవితలు చదువుతుంటే ఓ ఐదుపదుల కాలం వెనుకకు వెళ్లి ఆనాటి అందాల సంస్కృతి కళ్లముందు అలా.. అలా కదలాడుతూ.. సాగరఘోష చేస్తుంది. ప్రభాకర్ ఎంచుకున్న తన కవితా సజ్జకు పూర్తి ముడిసరుకు అడవులే. అటవీ ఉత్పత్తుల్లో ఒకటైన ‘పారిటాకు’ గురించి చెబుతూ ‘బుక్కెడు బువ్వ కోసం.. ఆకులను ఆకులతోటి పీఠముడి వేసి, శరీరాన్ని సూదులతో గుచ్చుకొని, శరీరాన్ని ఇస్తారుగా మార్చుకుంది.... అని ఎంతో హృద్యంగా చెప్పారు. కవి ప్రతిభ ఇలాంటి కవితా లతల్లోనే దాగి వుంటుంది. అంతర్గతంగా త్యాగ గుణం గురించి వ్యక్తం అవుతుంది. ఈ గుణం ఒక్క పారిటాకులోనే కాదు, అడవి అంతటిది! అడవి బిడ్డలదీ! అందరికీ అవసరమైంది కూడా!
అడవి జీవనాడులవంటి ‘కాలిబాటలు’ గురించి కూడా కడు రమణీయంగా కవిత్వీకరించారు ప్రభాకర్. అదే కోవకు చెందిన ‘పాద ముద్రలు’ తీరు కూడా బహు బాగుంది. పసందు చేస్తుంది. అలనాటి సంస్కృతి చిహ్నాలను మెచ్చుకుంటున్న ఈ మానుకోట కవిపుంగవుడి ఆలోచనలు నేటితరం ఆధునికులకు ఆశ్చర్యం కలిగించవచ్చు. ఒకానొక సందర్భంలో ఇతడు తిరోగమన రూపంలో వెనుకకు నడుస్తున్నాడా? అనిపించవచ్చు, కానీ ఈ ప్రయత్నం తిరోగమనంలో నడిచే సంపూర్ణ పురోగమనమే! నేటి తరం యువతకు ఎంత మాత్రం పరిచయంలేని ‘ఉట్టి’ గురించిన కవిత ఎంతో హృద్యంగా సాగడమే కాదు. సమాజంలోని సంబంధ బాంధవ్యాల గురించి సహృదయతతో చెప్పింది. కొన్ని విషయాలు ‘వాళ్లు మాత్రమే చేయగలరు, చెప్పగలరు’ అన్నట్టు కొన్ని కవితలు ప్రభాకర్ మాత్రమే వ్రాయగలడు అన్న విధంగా వున్నాయి. ఇందులో దానికి ప్రధాన కారణం ఆయనకు తన జాతి సంస్కృతి సంప్రదాయాలపై గల ఆపేక్షతో పాటు నిత్య పరిశీలనాశక్తి. ‘తీగ పెరుగుతున్న కొద్ది మట్టిని తింటూ బలంగా బలిసింది, ఆయుర్వేద గుణాలొచ్చి పక్క చెట్లను కౌగిలించుకుంది.
అడవి బిడ్డల సంస్కృతి గురించి..
ఎన్నో రోగాలు ఎల్లేరు గడ్డకు గులామై, కుమిలి కుమిలి ఏడ్చినయి, బొడ్డు తెంచుకున్న మృత దేహాలే, కుండలో ఉడికి మందు గోలీలైనాయి.... అంటూ అడవిలో మాత్రమే లభ్యమయ్యే ‘ఎల్లేరుగడ్డ’ గురించి ఎంతో ఉపయోగమైన సమాచార యుక్తంగా అందించారు కవి. ఇంకా కొమ్మునృత్యం, డోలిజట్లు, ధింసా, గుస్సాడి నృత్యాలే కాదు, మాఘమాసం, తునికి ఆకు, ఇప్పపువ్వు, తునికి పండ్లు, దుంపిడిబంక, నెమలీక, చీపురు లాంటి సామాన్య వస్తువులను ఎంచుకొని అడవిబిడ్డలకు వాటితో గల అవినాభావ సంబంధం అలతి అలతి పదాలతో అందమైన కవితలను తీర్చిదిద్దడంలో ఈ మానుకోట గిరిజనకవి నూరుశాతం విజయం సాధించాడు అనడంలో అక్షరసత్యం నిండివుంది.
మాసిన రంగేసుకుని వంకర టింకరగా వీపుకు వేలాడుతూ.. సందర్భం వచ్చినప్పుడల్లా, సంగీత కూసాన్ని బయటకు తీసి, చిల్ల కొయ్యల పాన్పులపై సేద తీరింది... అంటూ ఆదివాసీల పాలిట చైతన్య శంకు, పవిత్ర నాద వాయిద్యమైన ‘తూతకొమ్ము’ గురించి అడవి బిడ్డల సంస్కృతి ఔన్నత్యం గురించి ఎంతో హృద్యంగా అక్షరాలంకరణ చేశాడు. ఆత్మీయ సంస్కృతి గురించి అందంగా చెబుతూనే ‘ఇంద్రవెల్లి’ విషాదాన్ని తగలబడే అడవిబిడ్డల ‘గడ్డి గుడిసెల’ గురించిన గుండె మంటల సెగను కూడా చూపించాడు. అంతేకాదు గోండుల అత్యున్నతి కోరిన హైమన్ డార్ఫ్ గురించిన కృతజ్ఞతా మరువలేదు. ప్రభాకర్ కవిత్వం ‘వర్ణన కన్నా వస్తువే మిన్న’ అన్న చందంగా సాగింది. అయినా బలవంతమైన పదాలు, అంటింపు వాక్యాల కూర్పులా మాత్రం అస్సలు లేదు. అద్భుతమైన ఆదివాసీ సంప్రదాయ వస్తు నిలయమైన ఈ ‘తూతకొమ్ము’ కవిత్వం ఆసాంతం చదివాక ఆహ్లాదకరమైన అడవి పయనం చేసిన మధురమైన అనుభూతి కలుగుతుంది. అందాల సంస్కృతిని కమనీయమైన కవన పేటికలో భద్రపర్చి, భావితరాల కోసం సిద్ధం చేసిన ఈ ‘వనకనకమణి’ అక్షర కృషిని మనసారా ఆస్వాదించాలి. అడవి అందాలను అనుభవించాలి అంటే! ఈ ‘తూతకొమ్ము’ కవిత్వాన్ని ప్రతి ఒక్కరు చదివి తీరాల్సిందే.
ప్రతులకు:
తూతకొమ్ము (కవిత్వం)
పేజీలు: 88, ధర: 130/-
పెనుక ప్రభాకర్, 94942 83038.
సమీక్షకుడు
డా. అమ్మిన శ్రీనివాసరాజు
77298 83223