గతం జ్ఞాపకం కాదు శ్రీరమణ నాలుగో ఎకరం...!

by Ravi |   ( Updated:2023-08-06 19:01:01.0  )
గతం జ్ఞాపకం కాదు శ్రీరమణ నాలుగో ఎకరం...!
X

''ఈ ప్లాస్టిక్ ప్రపంచంలో పేదరికం ఎంత అవమానకరమైన కఠోర వాస్తవమో సంపద కూడా అంతే వికారమయమైన నగ్నసత్యం....'' అన్నాడు చార్లి చాప్లిన్ తన ఆత్మకథలో

ఈ 'నాలుగో ఎకరం' కథ చదివితే ఎవరికైనా చాప్లిన్ అన్న మాటలు గుర్తు కొస్తాయ్! శ్రీరమణ ఈ కథను పద్దెనిమిదిసార్లు తిరగరాసుకుంటూ పోయారు. అచ్చులోకి వచ్చేనాటికి కథపట్ల తను ఎంత శాతం సంతృప్తి చెందారో కానీ, అసంతృప్తి ఇంకా తనను వెంటాడుతోందనిపిస్తుంది. ఈ కథా విస్తృతే అందుకు కారణం కూడానూ. ఈ కథ మొదటిసారిగా రచన రజతోత్సవ సంచికలో వచ్చింది. అటుపిమ్మట సెప్టెంబర్ 2019లో విశ్వనాథ సాహిత్య అకాడెమీ గుంటూరు వారి నుండి ప్రత్యేకంగా గిరిధర్ గౌడ్ గీసిన అందమైన అనేక రేఖా చిత్రాలతో పుస్తకం పాఠకుల చేతికి అందుబాటులో ఉంది. ఈ పుస్తకానికి మరో ప్రత్యేకత శ్రీరమణ రాసుకున్న ముందుమాట చివరి మాట కూడానూ!

తనలోని బుద్ధిజీవికి దర్శనమిచ్చి..

నాలుగో ఎకరం శ్రీరమణ చెప్పినట్లే ఒక పెద్ద కథ. లేదా సాహిత్య ప్రక్రియల పరిభాషలో నవలిక అని కూడా పిలుచుకోవచ్చును. ఈ కథను గురించి శ్రీరమణ 'కోటాకు' అనే ముందుమాటలో చాలా వివరాలు రాశారు. ఇది మూడు పొరలుగా అంటుకున్న కథ. గ్రామీణ జీవితం. మధ్యలో నగరీకరణ నడుమ నలిగిన పాత కొత్త తరాలు ఇందులో కనిపిస్తాయి. ఈ మూడు తరాల మధ్యన వచ్చిన అనేక మార్పులు వాటితో వారి మధ్య ఏర్పడే పొరపొచ్చాలు.. శ్రీరమణ కథగా చెప్పిన తీరు రచయితగా పడిన సంఘర్షణ లోతును మనకు తెలియజేస్తుంది. కథతో పాటు తాను రచయితగా తన దృక్పథాన్ని వెన్నెముకను చేస్తూ పూర్తి స్థాయిలో రమణ చెప్పాలనుకున్న వైపు కథను తీసుకెళ్లడంలో ఎంతో సమర్థుడైన రచయితగా మనకు కనిపిస్తారు.

అలాగే, చల్లచుక్కతో పాలు తోడుకోవడానికి. ఉప్పు కల్లుతో పాలు విరగడానికి తేడా తెలియని తరంతో రచయితగా సంభాషించే సన్నివేశాలను చాలా సున్నితంగానే చిత్రీకరించారు. తనలోని బుద్ధి జీవి ఆ సందర్భంలో మనకు దర్శనమిస్తాడు. రచయితగా శ్రీరమణ హైక్లాస్ తరగతి కాదు. తను పుట్టి పెరిగిందంతా పునాదిగా చూస్తే 'డి' క్లాసే! ఈ కథలోని కొన్ని సందర్భాలకూ, ముఖచిత్రానికి ప్రత్యేకంగా బొమ్మ గీయించుకోవటానికీ ''వర్ణయోగి''గా శ్రీరమణే అభివర్ణించిన గిరిధర్ గౌడ్‌ను వెంటపెట్టుకుని తిరిగిన తిరుగుళ్లు 'డి' క్లాస్ రచయితలు కూడా చేస్తారనుకోనూ! రచయిత, చిత్రకారుడు నిజానికి అవిభక్త కవలలు అని రుజువు చేసి చూపారు ఈ కథ సందర్భంలో!

గ్రామీణ పరిభాషకు జవసత్వాలు..

శ్రీరమణలో ఈ కథ సందర్భంగా అనేక చోట్ల వాడిన గ్రామీణ వ్యవసాయ పరిభాషకు తిరిగి జవసత్వాలు ఇచ్చారు. ఈ కథలో వచ్చిన అనేక పదాలు ప్రస్తుతం వాడుకలోనివి గుర్తించి వాటికన్నింటికీ సందర్భానుసారంగా ఫుట్ నోట్‌లు ఇచ్చారు. ఇదీ మరో ప్రత్యేకతే! అవి

కోటాకు, పులికాపు, ఏరువాక, తోడాలు, పడి, కాకి బొడ్డు, రాగుల మంచం, అర్రు, మంచె, గొరకొయ్యలు, వార్ని పీట, కొలగారాలు, తాటి కర్ర, దాణాలు, కర్పూరపు నులక, చుప్తాగా, నారసింహ పొద్దు. ఇలాగా కథలో ఎదురైన అనేక పదాలకు శ్రీరమణ ఇచ్చిన నోట్సును అర్థం చేసుకుంటే అటు కథ ఇటు శ్రీరమణలోని అధ్యయన స్వరూపం మన ముందుంటుంది. మనలో ఆయన పట్ల ప్రేమాభిమానాలు ద్విగుణీకృతం అవుతాయి.

ఈ కథ ద్వారా, శ్రీరమణ గ్రామీణ పదసంపద వైపు చూపిన మార్గంలో ఎన్నో మైలురాళ్లు కనిపిస్తాయి. 1957లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ చేసిన పనులలో ఎంతో విలువైనది మాండలిక-వృత్తుల పదకోశ సంపదను సంపుటీకరించటం, అందులో వ్యవసాయ వృత్తి పదకోశం ప్రధానమైనది. చేనేత, మత్స్యకార, కుమ్మరి, కమ్మరి, వాస్తు ఇలా వచ్చిన పదకోశాలన్నింటిలోనూ ఒకనాటి మన గ్రామీణ కుల వృత్తులు, ఆయా ప్రాంతాల వారి జీవనశైలి. భాష, సంస్కృతీ సంప్రదాయాలు అన్నీ నిక్షిప్తం చేశారు. వీటికి ప్రధాన బాధ్యులుగా ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారు ముందుండి నడిపారు.

ఈ కథలో మాధవ స్వామి చేసిన పనే ఆనాడు సాహిత్య అకాడెమీ మరిన్ని చేతులతో అనేక గ్రామాలనుతిరిగి వేలాదిమంది రైతులను కలిసి మాట్లాడింది. తెలుగు దేశమంతటా ఆ బృందం కలియ తిరిగింది. శ్రీరమణ కథను అందులోని రైతాంగ జీవన పరిభాషను సందర్భోచితంగా చదువుతున్నప్పుడు ఇలా ఆ భాషకున్న చరిత్రను అందులో వారి ప్రత్యేకతను అర్థం చేయించుతుంది.

అత్యద్భుతమైన కథ

నిజానికి నాలుగో ఎకరాన్ని ఈ కథలో శ్రీరమణ ప్రవేశపెట్టింది అరవై ఒకటో పేజీలో మాత్రమే! మరి అరవై పేజీలు ఏం నింపాడు! అని ప్రశ్నించుకుంటే, పెదకాపు సంసారాన్నీ, ఆలయ పూజారి కృష్ణ స్వామి కుటుంబంతో అనుబంధాలను, వీరి పిల్లల మధ్యన రెండో తరంగా ఏర్పడిన వేగవంతమైన మార్పులను, మూడోతరం అయిన వీరి సంతానం దగ్గరకు వచ్చేసరికి, పెదకాపు కూతురుకిచ్చిన మూడెకరాలు, దానిని కౌలుకు తానే చేస్తూ,ఏటేటా వ్యవసాయంలో వచ్చిన నష్టాలకు జమకింద ఏడోఏటా కూతురికి ఇస్తానన్న నాలుగో ఎకరం నేల. అదీ కార్పొరేట్ విద్యాసంస్థల రంగ ప్రవేశంతో పెద్దకాపు కొడుకైన సాంబశివుడు తన భూమి మొత్తంగా ఉన్న పన్నెండెకరాలు అమ్మకాలు, కొనుగోళ్ల దగ్గర కూతురు వాటా కింద జమచేసిన నాలుగో ఎకరం తాలూకు డబ్బు మానవసంబంధాల్లో మొత్తం తెచ్చిన మార్పులన్నింటినీ చాలా దగ్గరగా కథ చుట్టూ చిక్కని కథనంతో నడుస్తుంది.

నడమంత్రపు సిరి ఆడించిన ఆటలకు అక్షరరూపం ఇవ్వడంలో శ్రీరమణ చాలా సార్లు కథను తిరగరాయడంతో ఈ కథ మొత్తంగా చూస్తే, చాలా అందంగా కనిపించే, అతి సున్నితమైన బీభత్సరస ప్రధానమైన కథ. శ్రీరమణ గారు వెళ్లిపోతూ పోతూ మనకు అందించిన అత్యద్భుతమైన కథ. కథ ఎక్కడా ఇబ్బందిగా నడవడం కానీ, అర్థం కాని వాక్యాలు కానీ, వ్యర్థ అనిపించే సన్నివేశాలు కానీ ఎక్కడా కనిపించవు. అంటే తను ఈ కథను అంతగా ఎడిట్ చేసి మనముందుంచారు. శ్రీరమణ రచనలన్నింటికీ ప్రత్యేకతలున్నట్లే, ఈ 'నాలుగో ఎకరం'లో కూడా చాలా ప్రత్యేకతలున్నాయి. అందులో ముఖ్యంగా భాషకు శైలికి కట్టుబడి చేసిన కొద్ది పరిచయం ఇది. శ్రీరమణ లాంటి మంచి కథకుడు మన బాపట్ల వాసి కావడం గర్వంగా ఉన్నా ఆయన మృతి చాలా బాధిస్తుంది. వారి స్మృతికి నివాళిగా నమస్కరిద్దాం.

ప్రతులకు

సాహితి ప్రచురణలు,

33-22-2, చంద్రం బిల్డింగ్స్

సి.ఆర్.రోడ్, చుట్టుగుంట

విజయవాడ -4

ఫోన్ నెంబర్:0866-2436642/43

సమీక్షకులు

సజ్జా వెంకటేశ్వర్లు

99511 69967

Advertisement

Next Story