- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అన్నదాతల జీవన చిత్రం మట్టి బండి
కవిత్వం జీవ కళ. జీవన స్పర్శ సోకనిదే అది రాణించదు. జీవితం కాచిన కవికే కవిత్వ కళను పుష్పింప జేయడం సాధ్యమవుతుంది. రైతుల వ్యధలను కాచి వడబోసిన కవి డా. నాగ భైరవ ఆదినారాయణ. ఆయన హృదయ స్పందన నుండి జాలువారిన మహత్తర దీర్ఘకావ్యమే ‘మట్టి బండి’. కవి తాను అనుభవించే అంతర్గత సంఘర్షణల్లోంచి, అనుభవాల్లోంచి రైతు బతుకు చిత్రాన్ని కవిత్వీకరించిన తీరు అద్భుతం, అమోఘం, అద్వితీయం.
‘ఆకలి యే కవిత్వం’గా భావించే ఆదినారాయణ కర్షక వ్యధల్ని ‘మట్టి బండి’ దీర్ఘ కవితలో ఏకరువు పెట్టారు. రైతు కవిత్వంపై ఎన్ని కావ్యాలు వచ్చినా స్వతహాగా రైతు అయిన ఆదినారాయణ రైతు వ్యధల్ని ఆర్తి, ఆర్ద్రతతో స్పృశించిన తీరు భిన్నమైనది. కవి తన కన్నీటి గాధలను అక్షరాలుగా పేర్చి అద్భుతంగా మలిచిన ‘మట్టి బండి’ కావ్యాన్ని రేఖామాత్రంగా స్పృశిద్ధాం!
రైతు ఆక్రందనను వివరించి
‘మూడు తరాలపాటు ముప్పూటలా/ బువ్వ పెట్టి బతికించిన పొలంతో/ బంధాలన్నింటినీ తెంపుకుంటూ అమ్మేశాను’ అంటూ కవి కావ్యారంభంలోనే రైతు ఆవేదనను ఆవిష్కరింపజేశాడు. చివరి వరకు ఆసరాగా ఉండాల్సిన పొలం అమ్మేయాల్సి రావడం రైతు గుండెను దహించి వేస్తుంది. పాఠకుల హృదయాలను పిండేస్తుంది. కావ్యానికి ఎత్తుగడే ముఖద్వారం వంటిది. ఈ కావ్యంలో ఎత్తుగడ నాటకీయంగా మొదలై పాఠకులను పరకాయ ప్రవేశం చేసేలా చేయడంలో కవి సఫలీకృతులైనారు. అలాగే బిడ్డల వంటి ఎడ్లను అమ్మేసేటప్పుడు రైతు పడే సంఘర్షణను వర్ణించిన తీరు ‘నభూతో న భవిష్యతి’ లా సాగింది. అంతేగాక ఎన్నోసార్లు తన కుటుంబాన్ని ఆదుకున్న బండిని అమ్మేస్తూ రైతు పడిన ఆవేదనను కవి ఆవిష్కరించిన తీరు అనన్య సామాన్యం. పొలం మీద అధికారం పోయినప్పుడు రైతు ఆక్రందనను వివరించిన తీరు అనిర్వచనీయం.
‘ధాన్యపు బస్తాలతో/ దండిగా ఉండే మెట్టు/ పొయ్యి మీద కెక్కని మట్టి చట్టిలా/ వట్టి పోతుంది కాబోలు’ పై పాదాలలో సిరిసంపదలతో తులతూగాల్సిన ఇళ్ళు ధాన్యం కరువై వట్టిపోతుంది కాబోలు అంటూ రైతు వాపోయిన తీరును 'కళ్ళకు కట్టినట్లు' చెప్పగలిగారు కవి. ఇలా చక్కని కావ్యాభివ్యక్తితో పాఠకులలో కుతూహలాన్ని రేకెత్తించారు. కవి ఉబ్బలి వాగు, పరమేశుని కుంట జ్ఞాపకాల ఊటలో పాఠకులను తడిపిన తీరు ముచ్చట గొలుపుతుంది. కాపు పడుచుల వయ్యారాలు, బుడ్డోళ్ల దర్పం, వరసైన వారి చిలిపి కవ్వింతలను హృద్యంగా చెక్కారు.
అలాగే ‘జొన్న వేసిన రోజుల్లో/ లేత కంకులను తుండు గుడ్డలో చుట్టి/ కర్రతో కొట్టి/ఊచ బియ్యాన్ని/ఊదుకుంటూ ఆరగించే వాళ్ళం’ అంటూ జ్ఞాపకాల మధురానుభూతుల్ని చక్కటి వర్ణనలు, పోలికలతో శిల్పాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లగలిగారు. ఒకనాడు భారతదేశంలో రైతుకి దక్కిన గౌరవాన్ని చక్కటి ఉపమానాలతో శ్లాఘించారు.
ఉత్తమ కావ్య చిత్రంగా మలిచి..
‘నీరవ నిశ్శబ్దంగా ఉండే/ బంజరు భూములకు/ సప్తవర్ణాలను నైవేద్యంగా చేసి/హృద్యంగా మార్చగల సేద్యగాడు’ అంటూ బంజరు భూములను సైతం పంట భూములుగా మార్చి సేద్యం చేసిన రైతు విశిష్టతను కొనియాడాడు. కానీ ప్రస్తుతం వానలు చాటేయడంతో పంట పదును కాక మబ్బు చాటేసిన తీరును వివరించారు. ‘రైతు జాతకం ఏమిటో గాని/ సేద్యాన్ని వర్షిస్తున్నా/మోదానికి నోచుకోవడం లేదంటాడు’ రైతు ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని శ్రమిస్తున్నా ఆనందానికి నోచుకోవడం లేదని కుమిలిపోయారు. కావ్యంలో రైతుకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెద్దోడు ఉద్యోగం చేస్తున్నాడు. చిన్నోడు వ్యవసాయాన్ని నమ్ముకొని బ్రతుకీడుస్తున్నాడు. నాగలి పట్టి దున్నేవాడికి జీవితంలో పెండ్లి కూడా కష్టమే అంటూ వాపోయారు. ‘రైతు కుటుంబంలో పుట్టిన/యువతులు సైతం/ రైతుతో పెళ్లంటే పెదవి విరుస్తున్నారు’ అంటూ నేడు రైతు దయనీయమైన పరిస్థితిని వివరించాడు. ప్రపంచానికి అన్నం పెట్టిన రైతుకి బువ్వ దొరికే పరిస్థితి లేదు. వ్యవసాయం 'కష్టనష్టాల అంపశయ్య'గా మారడంతో వ్యవసాయాన్ని విడిచి పెడుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ఆకలి చావులు తప్పవేమో! అంటూ కవి హెచ్చరిస్తున్నారు.
‘హలో లక్ష్మణా/అంటూ అసువులు బాసే/ ఆకలి చావులు కనిపిస్తాయేమో/ ఏమో! ఏమో!’ అంటూ కావ్యాన్ని ముగించారు. సాధారణంగా కావ్యం చక్కటి సందేశంతో ముగుస్తుంది కానీ ఇక్కడ సందేహంతో ముగించారు. దీనిని పాఠకుల ఊహకు వదిలేసి ఉత్తమ కావ్య శిల్పంగా మలిచారు. కావ్యంలో అడుగడుగునా అభివ్యక్తితో నవీనత్వం, శబ్దపద సౌందర్యం, భావుకత, అలంకార శబ్ద సౌందర్యం పాఠకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. నాగలి, గొర్రు, కర్రు, తంపట్లు, జడ్డిగం లాంటి వ్యవసాయ పారిభాషిక పదాలు పలకరిస్తాయి. కూటికుండ, కూటి దుత్త, మట్టి చట్టి లాంటి పదబంధాలు కట్టిపడేస్తాయి. ‘మట్టి బండి’ దీర్ఘ కవిత ప్రతి ఒక్కరి ఇంటిలో తప్పక ఉండి చదివి తీరాల్సిన కావ్యమని విశ్వసిస్తున్నాను. నాగ భైరవ ఆదినారాయణ గారి ప్రతిభకు శిరస్సు వంచి నమస్సులు తెలియజేస్తున్నాను.
ప్రతులకు సంప్రదించండి
వెల: రూ.100/-
డా. నాగభైరవ ఆదినారాయణ
98497 99711
సమీక్షకులు
పిల్లి హజరత్తయ్య
ప్రకాశం జిల్లా
98486 06573
- Tags
- Matti Bandi