సమీక్ష: సిద్ధాంతం మీద నిలిచిన కవిత్వం

by Ravi |   ( Updated:2022-09-11 19:15:47.0  )
సమీక్ష: సిద్ధాంతం మీద నిలిచిన కవిత్వం
X

వన వనంలో కొన్ని పుస్తకాల పువ్వులు పరిమళాలను వెదజల్లటం చూస్తుంటాం. పది మంది చదివి ప్రశంసల జల్లు కురిపించటమే ఫలించటం. ఫలశ్రుతి లేని జీవితం ఎందుకు? ఒక్క క్షణంలో జన్మిస్తూ ఒక్క క్షణంలో మరణిస్తూ, జనన మరణాల వలయం కొనసాగుతూనే వుంటుంది కదా! మనిషి బతికున్నంత కాలం ఏ సిద్ధాంతాల మీద నిలబడ్డాడన్నది ప్రధాన అంశం. నీటి పారుదల శాఖలో పదవీ విరమణ చేసిన రచయిత కపిల రాంకుమార్ అక్షరంలా ప్రవహించటం వృత్తి, ప్రవృత్తి కలిసొచ్చిన అంశమే.

ఏడు పదులు దాటినా సాహిత్య, కళా రంగాలలో దీటుగా ప్రవహించటం గొప్ప విషయమే. కమ్యూనిస్ట్ భావజాలంతో బోడెపూడి విజ్ఞాన కేంద్రం గ్రంథాలయంలో పది సంవత్సరాలు గ్రంథపాలకుడిగా విధులు నిర్వర్తించటం ఆయన అబిరుచికి అద్దం పట్టేదే. తెలుగు రాష్ట్రాలకు రచయిత కపిల రాంకుమార్ చిరపరిచితులే.

ఇటీవల ఖమ్మంలో 'కలం కలకలం' కవితా సంపుటి, 'నగారా' గీతాల సంపుటి పరిచయాలు 'ఉరుములు మెరుపులు' కవిత్వం పుస్తక అవిష్కరణ సభ వర్షపు జల్లులోనూ కోలాహలంగా జరిగింది. ఈ మూడు పుస్తకాల గురించి ముచ్చటగా మూడు మాటలు చెప్పుకోవాలి. ఆ మూడు పువ్వుల సుగంధాన్ని, ఆరు కాయల తియ్యందనాన్ని కొతైనా ఆస్వాధించాలి. ప్రముఖ కవి కీ.శే. రావెళ్ల వెంకటరామారావు ముందుమాటతో వెలువరించిన "కలం కలకలం' కవితా సంపుటిలో 63 కవితలు అచ్చు వేసారు. ఇన్నాళ్లీ గొంతుక ఎక్కడ దాక్కుంది? అని రావెళ్ల ప్రశ్నించారు కూడా. గొప్ప విషయమేమిటంటే మహాకవి దేవులపల్లి కృష్టశాస్త్రి లాంటివారు ఆయనకు అక్షరాభ్యాసం చేయించారు.

'సంస్కృతిని వెతుకుతాను' అనే కవితతో ప్రారంభించిన సంపుటి 'ప్రజాస్వరం' కవితతో ముగుస్తుంది. కవితలన్నింటిలోనూ ఆయన ఆదర్శాన్ని తనదైన శైలిలో స్పృశించారు. 'భయపడేది చావుకు కాదు' అనే కవితలో 'సగం కాలిన కాయంతో / శ్రమ కాల్సిన గాయంతో / సమస్యల కాలంలో / సమకాలీన గేయంతో / నేను కన్‌ఫ్యూజ్ అవుతున్నాను / అందుకే కంజ్యూమ్మ్ అవుతున్నాను / అయినా లక్ష్యాన్ని ఎజ్యూమ్మ్ చేస్తా / విప్లవాన్ని రెజ్యూమ్మ్ చేస్తా' అంటారాయన. ప్రాస పదాలతో పాటు భావాన్ని గొప్పగా ప్రజంట్ చేశారు. 'గొంతు కలుపు' కవితలో 'ఇక్కడ ఇప్పుడు అంకురాలకు అమ్మదనం అద్దె ఇల్లు అవుతోంది' అంటూ సరోగసి విధానానికి అద్దం పట్టారు. ఈ సంపుటిలో ఇలా ఎన్నో కవితలు మనల్ని హత్తుకుంటాయి.

ఇక నగారా గీతాల సంపుటిలో 31 గీతాలను పొందుపరిచారు. ప్రముఖ కవి సీతారాం, అద్దేపల్లి రామ్మోహనరావు, పొత్తూరి వెంకట సుబ్బారావు, సుధామ ముందుమాట రాసారు. మతము, జపము, తపము కంటే కూడు గుడ్డ కూటి కోసం ఎల్ల వేళలా సమరశీలత పెంచుకొనుటే భారతీయత' అని నగారా మోగించారు. ఇంకా 'ముదనష్టపు బుద్ధులు మార్చగాను పాడెద-ముదము కూర్చ వారిని లాలించి చూచెద ' అంటూ వంగ్యాస్త్రాల్ని సంధించారు. అమ్మలేని లోకమెందుకు? వెర్రితలల జ్ఞానమెందుకు? అని ఆలోచనాత్మక భావాన్ని సమాజంపై గీతాలుగా వొదిలారు. ప్రతీ గీతం సామాజిక స్పృహ మనలో పల్లవిస్తుంది.

ఇక 'ఉరుములు-మెరుపులు' సంకలనం కలగూరగంప కవిత్వం అని కవే ప్రకటించుకున్నారు. ఇందులో లిమరిక్కులు, టుమ్రీలు, రన్నింగ్ కామెంటరీ, మినీలు, నానోలు ఇలా అన్ని ప్రక్రియలు కవి 'కపిల' అక్షర ప్రయోగంలో రూపుదిద్దుకున్నాయి. ఈ పుస్తకానికి ప్రముఖ కవి, విమర్శకులు ప్రసేన్ చక్కని ముందుమాట మనకు పుస్తకంపై అవగాహన కలిగిస్తుంది.

కవి వస్తువు శిల్పం, భావ వ్యక్తీకరణ మనకు భిన్నంగా కనిపిస్తాయి. చమత్కృతులు చాలా వున్నాయి. 'పరువును పరువున / పరువులో /కలపకు / పాపకైనా-కను / పాపకైనా / ప్రాపకమున్నంత వరకే, ధనమైనా ఇంధనమైనా ధగ్థం కానంతవరకే' ఇలా అంత్యాను ప్రాసలు వాడటంలో చాలా నైపుణ్యం ప్రదర్శిస్తారు. 'గొడుగు అభయం / పడగ భయం' అంటూ టుమ్రీలు మన నెత్తిన మొట్టికాయలు వేస్తాయి. ఏదేమైనా 'మూడు పువ్వులు ఆరు కాయలుగా' కపిల బాబాయ్ కవిత్వం సాగిందనటంలో సందేహం లేదు.


ప్రతులకు:

కపిల రాంకుమార్

11-9-219/ఏ

బురాన్ పురం

ఖమ్మం-507001

98495 35033

కలం కలకలం : పేజీలు 152, ధర రూ.140

నగారా: 60 పేజీలు, ధర రూ. 75

ఉరుములు మెరుపులు: పేజీలు 44, ధర రూ. 50

Also Read : అంతరంగం: అర్థం పర్థం వదిలిన నామం


సమీక్షకులు

డా. కటుకోఝ్వల రమేశ్

99490 83327

Advertisement

Next Story

Most Viewed