- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బడుగు నేత లెన్స్ లోంచి దేశ చరిత్ర
‘కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు… మహాపురుషులౌతారు… తరతరాలకి తరగని వెలుగౌతారు… ఇలవేలుపులౌతారు.’ అని ఒక మహనీయుడు చెప్పిన మాటలు నాకు మాత్రం పుంజాల శివశంకర్ జీవిత చరిత్ర … 'అదొక్కటే ముగింపు' చదివినప్పుడు సంపూర్ణంగా అనిపించింది. మన భారత రాజ్యాంగంలో న్యాయవ్యవస్థ… రాజకీయ వ్యవస్థ రెండూ అరుదైనవే. ఈ రెండింటిలో అవకాశం వచ్చినవారి సంఖ్య చాలా తక్కువ. స్వాతంత్య్రం ఈ దేశానికి వచ్చినప్పటికీ నుంచి మనకి ఈ రెండు వ్యవస్థల్లో రాణించిన నాయకులు లేకపోలేదు. కానీ, ఎక్కువగా అగ్రవర్ణానికి చెందినవారే అధికంగా ఉన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మాదిరి ఎక్కడో ఒకరు ఒకటి అరా మనకి కనిపిస్తారు. అయితే, బీసీలకు చెందిన వారు మాత్రం ఇంకా అరుదు అంటే నమ్మాల్సిందే. కానీ, ఒక తెలుగు బిడ్డకు… తెలంగాణ బిడ్డకు అటువంటి అవకాశం లభించింది అంటే ఆశ్చర్యపోవాల్సిందే. కాదు… కాదు సంభ్రమాశ్చర్యానికి గురి కావాల్సిందే.
అటు న్యాయవ్యవస్థలో… ఇటు రాజకీయ వ్యవస్థలో ఎటువంటి గాడ్ ఫాదర్లు లేకపోయినా… కింది నుంచి ఎదిగిన నిఖార్సైన బీసీ బిడ్డ శివశంకర్. బాల్యంలో ఆయన అనుభవించిన దైన్యం… తన వర్గాలకు ఎంతో కొంత సాయం చేయాలని సంకల్పించి… కొండంత సాయం చేసి… గోరంత కూడా ప్రచారం చేసుకోలేని వ్యక్తాయన. బడుగు బలహీన వర్గాల ప్రాతినిధ్యం న్యాయ స్థానాలలో పెంపునకు పి. శివశంకర్ నాడు కేంద్ర న్యాయశాఖ మంత్రిగా తీసుకున్న నిర్ణయం ఇప్పటికీ శ్లాఘనీయం.., ఎంతో సాహసోపేతం. ఎమర్జెన్సీ తర్వాత అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తరపున వాదించి ఆమెపై వచ్చిన ఆరోపణలు బుట్టదాఖలు చేయించిన న్యాయ కోవిదుడు పుంజాల శివశంకర్. ఆమెపై నమోదైన కేసులన్నీ కొట్టి వేయించిన న్యాయ నిపుణుడు మన తెలుగు బిడ్డ అవడం… అందులోనూ ఒక బలహీన వర్గానికి చెందిన వ్యక్తి అవడం సంతోషం. తన జీవితాంత సామాజిక న్యాయ కోసం, పేదల అభ్యున్నతికి కృషిచేసిన శివశంకర్ ఆత్మకథ, ఎప్పుడూ బడుగు బలహీన వర్గాలకు స్థెర్యం… ఆత్మవిశ్వాసం కలిగిస్తున్నదని చెప్పి తీరాలి. న్యాయవ్యవస్థలో అయితే తక్కెడ తూకానికీ పెట్టలేని బలహీన స్థితిలోకి బీసీలను నెట్టేసిన తీరుపై ఆయన ఎంతగానో ఆవేదన చెందారు. దానిపై ఆయన చాలా పోరాటం చేశారు. కొంతమేర ఆయన శ్రమ, పోరాటం వల్ల బీసీలు న్యాయవ్యవస్థలో కొంతమేర అయినా రాణించగలుగుతున్నారు.
ఇందిరకు తెలుగు బిడ్డ సాయం
ఆయన పుస్తకం వెనకభాగంలో ఉన్న పదబంధాలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వాటిని ప్రతి ఒక్కరూ తెలుసుకుని తీరాలి. ‘1977లో అత్యయిక పరిస్థితి దేశంలో ఎత్తివేశాక జరిగిన ఎన్నికల్లో ప్రధాని ఇందిరా ఓడిపోయారు. అధికారంలోకి వచ్చిన జనతా పార్టీ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘన కేసులు పెట్టి వేధిస్తూ, ఇందిరను ప్రపంచం ముందు నేరస్థురాలిగా చిత్రించే ప్రయత్నం చేస్తే… ఆమె తనకి ముక్కుమొహం తెలియని తెలుగువాడైన ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్‌కి ఫోన్ చేసి, సాయం కావాలని కోరుతున్నా… చేస్తారా అంటూ అడగటం. తన క్లయింట్ చేసిందంతా రాజ్యాంగబద్ధమే అంటూ షా కమిషన్ ముందు ఈయన వాదనలు.’ నిజంగా గొప్ప విషయాలు తెలుసుకున్న. ఇందిరా గాంధీ గురించి చాలా అంశాలు ఈ పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ దేశానికి ప్రజాస్వామ్యంలో మహారాణిలాగా అధికారం చెలాయించిన ఇందిరాగాంధీ అంత సున్నితమైన మహిళా అన్నది సంపూర్ణంగా అర్థం అవుతుంది.
కోటరీపై అతిగా ఆధారపడితే...!
అలహాబాద్ హైకోర్టు ఇందిరా గాంధీని ఒక ఎన్నికల కేసులో అనర్హురాలుగా గుర్తిస్తే… ఈ దేశంలో ఎమర్జెన్సీ మాత్రం సొల్యూషన్ అంటూ బెంగాల్ కు చెందిన ఒక నాయకుడు ఇచ్చిన సలహాను పాటించి… ఈ దేశంలో అత్యయిక పరిస్థితిని విధిస్తుంది ఇందిరా గాంధీ. కానీ, ఆ సమయంలో ఆమె అది కాకుండా ఇంకో విధమైన ఎత్తుగడ వేసి… ఆ ఇబ్బంది నుంచి బయటపడొచ్చు అన్నది తర్వాత చాలా విశ్లేషణల్లో తేలిన విషయం. అయితే, ఇందిరా గాంధీ… తను నమ్మిన వాళ్లపై ఎంతలా ఆధారపడుతుందో ఈ పరిణామం మనకు స్పష్టపరుస్తుంది. ఇక కాంగ్రెస్ హయాంలో మనకు ముఖ్యమంత్రులను మార్చే ప్రక్రియ మీద సాధారణంగా ఏహ్యభావం కలుగుతుంది. కానీ, ఏదైనా ఒక రాజకీయ పరిణామం ఒక రాష్ట్రంలో జరిగితే… అది ఢిల్లీలో ఉన్న అధిష్టానంకు ఎలా వెళుతుంది… దాని స్వరూపం ఎలా మారుతుంది… దాని తీరుతెన్నులు మొత్తం ఈ పుస్తకం ద్వారా మనకు తెలుస్తాయి. అయితే, ఆ విషయం పట్ల అధిష్టానం స్పందించే తీరు… మొత్తంగా ఆ విషయాన్ని అధిష్టానం చూసే తీరు మీద మనకి ఒక అవగాహన తీరుతాయి. ఈ పుస్తకంలో శివశంకర్ చాలా అంశాలు మనకి ఉదహరించి చెప్పారు. అయితే, ఇందిరాగాంధీ చనిపోవడం శివశంకర్ జీవితంలో పెద్ద కుదుపు. ఆమె మరింత కాలం బతికి ఉంటే… శివశంకర్ రాజకీయ జీవితం చాలా అద్భుతంగా ఉండేది.
పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా బీసీల రిజర్వేషన్ల సాధన, కులగణన కోసం ఉద్యమించే సమయంలో రైల్వేస్టేషన్లలో చేతిపనులు చేసి చదువుకుని దేశ రాజకీయ చిత్రపటంలో పాలక రంగంలో కీలక స్థానానికి ఎదిగిన శివశంకర్ తన ఆత్మకథలో ‘అదొక్కటే ముగింపు’ అన్న సారాంశాన్ని ఈ దేశ యువత, ముఖ్యంగా నిమ్నవర్గాలకు చెందిన యువతరం తమ మెదళ్ళకెక్కించుకోవాలి. రాం మనోహర్ లోహియా, సోషలిస్టు ఉద్యమాల నుంచి యూపీ, బిహార్, తమిళనాడులలో ఏ విధంగా బలహీనవర్గాల నుంచి ముఖ్యమంత్రులయ్యారో, విశ్వవిద్యాలయాల ప్రాంగణాల నుంచి పల్లె రచ్చబండల దాకా చర్చల కుంపట్లు రాజేసి చెప్పే బాధ్యతను యువతరం భుజస్కంధాలపై వేసుకోవాలి.
నవతరానికి పోరాటం ప్రారంభం
ఛీత్కారాలు, సత్కారాలు, ఆవేదనలు నిండిన కెరీర్లో పడుతూ… లేస్తూ కూడా బలహీనవర్గాలకు రాజ్యాంగపరంగా న్యాయం జరిగి తీరాలని తపించి పోరాడిన అడ్వకేట్ పుంజాల శివశంకర్ నుంచి ఈ దేశ న్యాయ శాఖ మంత్రి వరకు ఆయన ప్రయాణం. ఒక బలహీనవర్గాల నాయకుడి లెన్స్ నుండి ఈ దేశ చరిత్ర చూస్తే ఏ విధంగా ఉంటుందో మనకు పూర్తిగా అవగతం అవుతుంది. ఆయన ఆశయాల కోసం పోరాడటమే మనం ఆయనకిచ్చే నిజమైన …. నికార్సైన నివాళి. ఇక చివరగా, ఈ దేశం రాజ్యాంగబద్ధంగా... ప్రజాస్వామ్యయుతంగా నడవాలని కోరుకునే ఎవరైనా చదివి తీరాల్సిన పుస్తకం... ఆయన రాసిన ఆత్మకథ 'అదొక్కటే ముగింపు'. వాస్తవానికి ఇది ముగింపు కాదు... మన నవతరానికి ఇదొక పోరాట ప్రారంభం… ఆరంభం కూడా!
ప్రతులకు:
ఎమెస్కో బుక్స్ ప్రైవేట్ లిమిటెడ్
దోమలగూడ, హైదరాబాద్
పేజీలు: 480
వెల: 300
సమీక్షకులు
సాగర్ బాబు వనపర్తి,
91000 04402