- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సాంస్కృతిక యుగకర్త గద్దర్
‘గద్దర్...’ ఈ పేరు పీడిత ప్రజల పొలికేక, ప్రజల పాటకు ప్రతిరూపం జీవితాంతం ప్రజా ఉద్యమాల గీతం. ఆయన దేహం పాటల మయం. మాట్లాడితే సంగీత ప్రవహం. పాటలో ప్రపంచాన్ని జయించే శక్తిని ప్రపంచానికి పరిచయం చేశాడు. ప్రజలు మాట్లాడుకునే సులభ పదాలతోనే పాట కట్టగల మేటి తాను చెప్పదలచుకున్నది సూటిగా జనాలకు ఎక్కించి కార్యోన్ముఖులు చేసే ధీశాలి.
ఆయన పాట శాశ్వతం
ఇంతటి ప్రతిభావంతమైన కవి తెలుగు నేల మీద తప్ప ఇంకెక్కడైనా ఉన్నాడా అన్పిస్తది. తొలిదశలో తాను నమ్మిన నక్సలైట్ ఉద్యమం... దాన్నుంచి బయటకు వచ్చి అనంతర కాలంలో అన్ని సామాజిక అస్తిత్వ ఉద్యమాలకు గొంతయ్యిండు. తెలంగాణ ఉద్యమంలో ఆయన ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా’ పాట వినిపించని ఊరూ లేదు, పల్లె లేదు, గల్లీ లేదు ఈ పాట పెద్ద హైలెట్! అంతకు ముందు బండెనుక బండి కట్టి పదహారు బండ్లు కట్టి పాట ఎనభయ్యవ దశకంలో ఒక ఊపు ఊపింది. ‘ నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా పాట నుంచి వందల వేలాదిగా గద్దర్ రాసిన పాటలు జనం చెవుల్లో మారుమ్రోగాయి.
గద్దర్ ఇప్పుడు భౌతికంగా లేకపోవచ్చు కానీ ఆయన పాట శాశ్వతం. అన్నమయ్య త్యాగయ్య పాటలు ఎలా కలకాలం నిలిచాయో గద్దర్ సాహిత్యం కూడా అలాగే నిలిచే ఉంటుంది. గద్దర్ ఒంటిలో తూటాతో జీవించాడు. 1997లో గద్దర్‌పై కాల్పులు జరిగిన తర్వాత మరణశయ్య నుంచి పునర్జన్మ పొందినట్లయింది, గద్దర్ పాటకు ఫిదా కానివారు ఎవరూ లేరు. గద్దర్ అంటే ప్రజాయుద్ధనౌక. ఆయన రాజకీయాలను, సిద్దాంతాలను వ్యతిరేకించిన వాళ్లు సైతం ఆయనకు నివాళులు అర్పిస్తున్న కాలం.
సమాజం కోసం జీవితం ధారపోసి..
గద్దర్ గూర్చి ఎంత రాసినా తక్కువే. ఆయన తిరగని ఊరు లేదు. పల్లె లేదు ఉద్యమం లేదు. ఆయన ప్రజల గొంతుక. చివరాఖరు దశలో రాజ్యాంగమే ఈ దేశాన్ని, ఈ దేశ ప్రజల హక్కులను కాపాడే రక్షణ అని ప్రచారం చేసిండు. చాలామంది ఆయన పాటల వల్ల ప్రేరేపితమై ఎందరో అజ్ఞాతవాసం పోయి చనిపోయారు. ఈయనేమో అది కాదు అంటున్నాడు. నిజమే కావచ్చు కేవలం పాటల ప్రభావంతోటే లోపలికి పోవడం వేరు. ఆ ఉద్యమంతో ఆ సిద్ధాంతాలతో ఏకీకృత భావం వల్లనే అందులోకి పోతారు. అంతేకానీ కాలక్రమంలో సాయుధ పోరాట మార్గం ఈ దేశంలో సరియైంది కాదనిపించవచ్చు. ఏది ఏమైనా ఉద్యమం కోసం, పాట కోసం, సమాజం కోసం జీవితాన్ని ధారపోసిన గద్దర్ ఈ దేశ సాంస్కృతిక యుగకర్త. ప్రజల భాషలో ప్రజల జీవితాలను చిత్రించిన సృజనకారుడు. ప్రజాయుద్ధనౌక గద్దర్‌కు జోహార్లు.
అన్నవరం దేవేందర్
94407 63479