రాజకీయమే వ్యాపారం అయితే ఎట్లా!?

by Ravi |   ( Updated:2023-11-05 19:00:35.0  )
రాజకీయమే వ్యాపారం అయితే ఎట్లా!?
X

ఎల్లెడలా అవినీతి నీతి లాగే చలామణి అవుతుంది. అన్యాయం న్యాయం లాగే ఊరేగుతుంది. అధర్మం ధర్మం అయికూచున్నది. ఇప్పుడు సమాజం మొత్తంలోనూ విలువలు మారుతున్నవి. ప్రతి రంగంలోనూ దానికి సంబంధించిన నిపుణులు శాస్త్రవేత్తలు ఉంటరు. అందులో నిర్ణయం వాల్లదే అయి ఉండాలి. కానీ ప్రభుత్వ అధినేత చెప్పినట్టు నిర్మిస్తే కూలిపోతది. కండ్లముందే ఎన్నో ఉదాహరణలు కన్పిస్తున్నాయి. పైగా దీనికి మరొక భాష్యం చెప్పుతరు.

ప్రభుత్వ అధికారులు అలా ఉంటే..

ప్రభుత్వంలో అధినేతనే అధిపతి కావచ్చు కానీ ఆ రంగం విషయ పరిజ్ఞానంలో నిష్ణాతులు ఉంటారు కదా. ఎక్కడ ప్రాజెక్ట్ కట్టాలె ఎక్కడి నుండి ఎక్కడికి నీళ్లు రావాలి అనే ఆలోచన ఇవ్వచ్చు గానీ మరీ ఆయా రంగాలను శాసించే స్థాయిలో ఉంటే వాల్లదేం పోతది కట్టేస్తరు అనంతరం ప్రజల పైసలు గంగలో కలుస్తాయి. ప్రభుత్వ యంత్రాంగం కూడా అంతే! ప్రభుత్వం నిర్ణయాలు తీసికుంటే అధికారులు అమలు చేస్తారు. అది రివాజు. కానీ లబ్ధిదారుల ఎంపిక కూడా ప్రజాప్రతినిధులే చేస్తే యంత్రాంగం ఎందుకు. ఎన్నికైన ప్రజాప్రతినిధికి పార్టీ పక్షపాతం ఉండవచ్చు ఉండకపోవచ్చు గానీ అంతిమంగా ఆ స్కీంకు ఎవరిని ఎంపిక చేయాలి అనే నిబంధనలకు లోబడి పనిచేయాల్సింది ప్రభుత్వ ఉన్నత అధికారులు. దేశంలో ప్రతిష్టాత్మక అఖిల భారత సర్వీసుకు చెందిన అధికారులు కూడా ఇదే బాటలో పయనిస్తే ప్రజాస్వామ్యం ఎలా ఉంటుంది?

నిజానికి ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ అయినా నెగ్గితే వాల్లదే ప్రభుత్వం అవుతుంది. ఏ ప్రభుత్వాలైనా రాజ్యాంగబద్ధంగా పరిపాలించాలి. కానీ స్వతంత్ర నిర్ణయాలు తీసుకున్నా చట్టబద్ధంగానే ఉండాలి! కానీ ఈ రోజుల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం రాజుల కాలంలా ఏకఛత్రాధిపత్యం కింద ఏక వ్యక్తి ఏక పార్టీ కింద నడుస్తుంది. అధికారం ఎట్లా చెప్పితే అట్ల నడుచుకునే యంత్రాంగానికి తాత్కాలిక లాభాలు కోరుకున్నచోట పోస్టింగ్‌లు, ప్రమోషన్‌లు పొందవచ్చు కానీ రానూ రానూ మొత్తం సిస్టం దెబ్బతింటుంది. మొత్తం వ్యవస్థ పుచ్చిపోయిన తర్వాత ఇలా మేడిగడ్డ పర్రెలు లెక్క కన్పిస్తది. అవినీతి అక్రమ సంపాదనను అరికట్టడం దేశంలో ఎవరి తరం కాకపోవచ్చు. నైతిక విలువలు నీతి సూత్రాలు ధర్మం గూర్చి, దేశం గూర్చి నాలుగు మంచి ముచ్చట్లు చెప్పేవాల్లు కరువు అవుతున్నారు. ఒకవేళ చెప్పినా ఇవి చెప్పడానికి అన్నట్లు తయారు అవుతున్నయి.

ఓటరు అదే స్థితిలోకి..

ఇదివరకు ఏం లేనోళ్లు, ఇది వరకు సైకిల్ మోటార్ మీద తిరిగిటోల్లు, ఆదాయ మార్గాలు లేనివాళ్లు ఈ పదేండ్లల్ల చూస్తే వాళ్ల బతుకు చిత్రమే మారిపోతంది. వ్యాపారం చేసి లాభాలలో సంపాదించవచ్చు తప్పులేదు. ఏ వ్యాపారం లేక రాజకీయమే వ్యాపారం అయితే ఎట్లా. కమీషన్‌లు, కమీషన్‌లు అని ఆ పార్టీ వారిని ఈ పార్టీ వారు విమర్శించుకుంటుంటారు. ఏ ప్రాంతంలోనైనా భవనాలు, రోడ్లు, వంతెనలు ఇంకా ఏదైనా నిర్మాణం జరుగుతున్నదంటే అక్కడ ఇంజనీరింగ్ ఎస్టిమేట్స్ తయారు చేసేప్పుడే ఎవరి వాటా వారికి కలిపి వేస్తారు. ఇందులో ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ ప్రజా ప్రతినిధులు ఉంటారు. ఇదంతా అందరికీ తెల్సి బహిరంగంగానే జరుగుతుంది. అంటే దేశంలో అవినీతి ఎక్కడిదాకా పోయిదంటే ఇదొక పద్ధతి. ఇవ్వాల మేము ఇట్ల చేస్తే ఇదివరకు వాల్లు అట్ల చేశారు రేపూ ఉంటది అనే వాదన ఉంటుంది. డబ్బులెవరికి చేదు, లేకుంటే రాజకీయ పార్టీలు ఎట్ల నడుస్తాయి. కోట్లకి కోట్లు ఖర్చులు ఎలా చేస్తారు అని సులువుగా మాట్లాడుకునే దశ వచ్చింది. స్వాతంత్ర్యానంతరం అవినీతి... నీతిగా చలామణిలోకి వస్తున్న సందర్భంలో ఎన్నికల క్షేత్రంలో ఉన్నాం. ఇదంతా చూసి నాకేం తక్కువా అని ఓటరు కూడా లంచం లేనిదే ఓటు వేయని పరిస్థితి వచ్చింది. డబ్బులు మాకు రాలేదని పోయిన ఎన్నికల్లో ధర్నాలకు కూడా దిగారు. న్యాయం అన్యాయం తేడా లేని దుస్థితి దాపురించింది.

-అన్నవరం దేవేందర్

94407 63479

Advertisement

Next Story