ఆలోచనల్లో పరిపక్వత రాకుంటే ఆగిపోవుడే!

by Ravi |   ( Updated:2023-09-24 19:15:53.0  )
ఆలోచనల్లో పరిపక్వత రాకుంటే ఆగిపోవుడే!
X

మనిషి పనులు చేయడంలో దృఢ సంకల్పం ఉండాలే గానీ, మారని దృఢ ధృక్పధం ఉంటే కష్టం. ఎందుకంటే సామాజిక అవగాహనతో ఆలోచనలను ఆధునీకరించుకోవాల్సి ఉంటది. వయసు పెరుగుతుంటే తన పదేళ్ళ కిందటి తన యవ్వన కాలం పద్ధతులు తరతరాలుగా వస్తున్న వ్యవహారాలు మారుతుంటే తానూ మారాలె. లేకుంటే తనకూ కష్టాలు తనతో ఉన్నవారికి నష్టాలు వస్తాయి.

ఆలోచనల్లో మార్పులను ఆమోదించాలి!

గ్లోబలైజేషన్ పరిణామాల వల్ల గడచిన ఇరవై ఏండ్లుగా జీవితంలో అన్ని పద్ధతులు మారాయి. మధ్యతరగతి వ్యవస్థ కూడా ఉన్నత వర్గంలోకి పోయింది. సంపన్నత అన్ని రంగాల్లో వచ్చి విద్య, సాంకేతిక వైద్యం, ఎంటర్‌టైన్‌మెంట్ ఉద్యోగాలు పాత పద్దతి నుంచి కొత్త పద్దతికి మారాయి. వాటన్నింటిని అందిపుచ్చుకుని మానవ సంబంధాల్లో ఆలోచనలోనూ పెనుమార్పులు వచ్చాయి. వాటినీ ఆమోదించాలి. కష్టపడి పైకి వచ్చి సంతానం, విద్యావంతులై ఉద్యోగులు అయిన తర్వాత కూడా ఆ పాత పద్ధతిలో పిసినారి పద్ధతులు పాటించేవాళ్ళు అక్కడక్కడ కన్పిస్తారు. ఉద్యోగం నుంచి రిటైర్ అయి జీవితం సెటిల్ అయిన వాళ్ళు తమ పెన్షన్ డబ్బులతో కొందరికి ఉపాధి కల్పించవచ్చు. ఉదాహరణకు ఇంట్లో పని మనుషులు, డ్రైవర్లు, వంట మనుషులను పెట్టుకోవచ్చు కానీ పెట్టుకోరు. పాత పద్దతులనే జీవిస్తరు. ఆ కాలంలో నడిచి స్కూల్‌కి వెళ్ళి లేదా? అప్పుడు ఏ ఊరికి వెళ్ళినా సైకిల్ మీద నడిచి వెళ్ళేవాల్లం.. ఇప్పుడు ఎందుకు పైసలు దండగ, ఖర్చు ఎందుకు అని పైసలు దాచడం, మిగిలిన పైసలు ఏం చేస్తవు అంటే దాసి పెట్టడమే.. కానీ వినియోగించడం లేదు. చాలా కుటుంబాల్లో ఇలాంటివి కన్పిస్తవి.

నిరంతరం నేర్చుకోవడమే జీవితం!

మరికొందరు వృద్ధులైన వారి ఆలోచనలు కూడా అట్లనే పాత పద్దతుల్లో పేరుకొని పోతాయి. ఇప్పుడు వస్తున్న బాల్యం, యువతరం, ఫాస్ట్ ఆలోచనతో వస్తున్నరు. చిన్న చిన్న పిల్లలే సెల్‌ఫోన్ మొత్తం ఆపరేట్ చేస్తున్నరు. రెండు మూడేండ్ల పిల్లగాండ్లు కూడా యూట్యూబ్ వీడియోగ్రఫీ మొత్తం చూస్తూ మారుస్తున్నరు. అట్లాగే వాళ్ళ ఆలోచనల పరుగు అలాగే ఉంది. వాళ్ళూ మనస్తత్వాలు గమనిస్తున్నారు. వాళ్ళకు కావాల్సినవి సాధించుకుంటున్నారు. వాల్లతో పోటిపడి పెద్దతరం అప్‌డేట్ కావాల్సిన అవసరం ఉంది. నా కాలంలో లేదు ఈ వాట్సప్, ఈ ఫేస్‌బుక్ లేదు అంటే వెనుకబడి పోయినట్లే ఆగిపోవుడే. కొందరు నేర్చుకోవడానికి కూడా ఇష్టపడరు. ప్రతిదానికి ఇతరుల మీద ఆధారపడటం పైగా నాకు పని చేస్తలేవు, చూస్తలేవు పిలవంగానే వస్తలేవు అనుకుంటూ గులుగుతారు. నిజానికి నిరంతరం నేర్చుకోవడమే జీవితం! ఎప్పుడు ఒక కొత్తపని నేర్చుకోవడం ఉంటేనే సరదా! పాత ఆలోచనలను ప్రోదిచేసి పదిలపరిచి అందులోనుంచి మంచిని ఎంచి మిగితాది కొనసాగిస్తుండాలి. ఆధునికతను, కొత్త సాంకేతికను మారుతున్న మనస్తత్వాలను పట్టుకోవాలి. పదిమంది మేలు చేసేట్లు, నాలుగు మొక్కలకు నీళ్ళు పోసేట్లు, నాలుగు పక్షులకు గింజలు వేసేట్లు, నలుగురితో కల్సి నవ్వుతూ జీవించడం నేటి రేపటి అవసరం.

అన్నవరం దేవేందర్

94407 63479

Advertisement

Next Story