అంతరంగం: ఎన్నికల పండగలో.. కనిపించే చిత్రాలు!

by Ravi |   ( Updated:2023-08-20 19:30:42.0  )
అంతరంగం: ఎన్నికల పండగలో.. కనిపించే చిత్రాలు!
X

న్నికల కాలం దగ్గరికి వస్తుంది అంటే అన్నీ చిత్ర చిత్రమైన సన్నివేశాలు చూస్తం. ఐదేండ్లకు ఓ సారి ఓటర్లతోని అక్కెర. అటు తర్వాత ఇష్టారీతిగా వ్యవహారం నడిపించుకోవచ్చు. ముందుగాల టిక్కెట్ల లొల్లి. టికెట్ రావాలంటే పాత పేరు మంచిగుండాలే, పైసలు కట్టలకు కట్టలు ఉండాలి. కులం బలం దండిగా ఉండాలి. ఇవన్నీ ఉన్నా టిక్కెట్లు ఇచ్చేటాయనకు నంగి నంగి లొంగి లొంగి కనపడాలె. తెలివి తేటలు కూడా ఎక్కువ ఉండొద్దు. ఉన్నా ఉన్నట్టు కనపడద్దు. అక్కడ ఖర్చులు ఎల్లదియ్యాలె. అదే నియోజకవర్గంలో ఇట్లనే కనీసం ఐదారుగురు అన్నా ఉంటరు. వాల్లతో పోటీ పడాలె. ఎవలెవలు చెడ్డవాల్లో ఏమేం చేసిండ్రో ప్రచారంల పెట్టాలె. తాను మంచివాన్ని అని చెలాయించుకోవాలె. ఇవన్నీ పూర్తి చేసినంక కల్సివస్తే టికెట్ దొరుకది. టికెట్ దొరికినంక సగం గెలిసినట్టె సంబరం అయితది. మల్ల వాళ్లు వీల్ల అదే పార్టీల పోటికి వస్తరు నామినేషన్‌లు ఏస్తరు ఇండిపెండెంట్‌లు సుత నామినేషన్‌లు వేస్తరు. వీల్లందరితోని విత్ డ్రా చేయించేందుకు బుజ్జగించాలి. ఎట్లయితే ఊకుంటడో తెల్సికొని నామినేషన్ బందు పెట్టియ్యాలె. ఇదొక పెద్ద తతంగం. మరి ప్రజాసేవ చేయాలంటే ఇవన్ని చేయించాలి. నిజానికి ఇదొక వ్యాపారం మందు పెట్టుబడి పెట్టుడు గెలిచిన తర్వాత రకరకాల మార్గాల ద్వారా ఆమ్దానీ వస్తది సంపాదించుకునుడు.

ఎన్నికల రెండు నెలలు పండగే..

పూర్వం ఏమోకానీ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలవాలంటే కోట్లల్ల పైసలు ఉండాలి. మల్ల వాటిని మంచినీళ్ళ లెక్క ఖర్చు పెట్టాలి. ఈ కాలంలనైతే అందరు దావత్‌లు, పైసలు అడుగుతున్న రానున్న ఎన్నికల్లో ‘మందు’ భీభత్సమైన వర్షం లెక్క కురువవచ్చు. ప్రతిరోజు కార్యకర్తలు, చోటా మోటా లీడర్లు గ్రామస్థాయి, మండలస్థాయి అందరికీ రెండు నెలలు తాగినంత ద్రవపదార్థం. అది లేకుంటే ఎల్లనే ఎల్లది. ఫంక్షన్ హాల్లు, లాడ్జింగ్‌లు గుత్తకు తీసికొని మీటింగ్‌లు రోజు చికెన్, మటన్ భోజనాలు నడుస్తుండేట్లు ఏర్పాటు చేయాలి. ఇప్పుడు జమాన ఇట్ల తయారైంది. ఇప్పటిదాకా పదవిలో ఉన్న వాళ్ళకు ఈ వ్యవహారం జర సులువుగానే ఉంటది. పైసల ప్రవాహంలో కూడా తేడా రాకపోవచ్చు. ఎందుకంటే బొక్కసం

నిండే ఉంటది. ఒకప్పుడు ప్రజాప్రతినిధి అంటే సామన్యుల లాగా బస్సుల్లో, ఆటోల్లో ప్రయాణం చేసే వాల్లు ఇప్పుడు అట్లాకాదు అదొక అట్టహాసం గన్‌మెన్‌లు, కార్యకర్తలు, అభిమానులు వెంట నడవంగ ప్రయాణాలు సమావేశాలు ఉంటాయి. కొత్తగా అదే స్థానానికి పోటి పడే వ్యక్తి కూడా పోటిదారుని అంతే అన్నిట్లో సమకూర్చుకోవాలి. సేమ్ అట్లనే అనేకన్నా ఇంకా రెండు ఆకులు ఎక్కువనే చదివించేట్టు ఉంటేనే గెలుస్తాడు. లేకపోతే తట్టుకుంట లేడు, ఆయన ఎక్కడ, ఈయన ఎక్కడ అనే ప్రచారం చలామణిలోకి వస్తది. ఇట్లా పేరు వచ్చిందంటే ఇంకేముంది అంతే సంగతులు.

గెలిచాక.. అన్ని పెరుగుతయి!

కొత్తగా నిజమైన ప్రజాసేవ చెయ్యాలని అనుకొని ఎవరైనా వస్తే ఈ ఆధునిక ఎన్నికల మేనేజ్‌మెంట్ మెకానిజం తెల్వక అక్కన్నే నిలిచిపోవచ్చు. తిమ్మిని బమ్మి చేయాలి. ఐరిని బైరి చేయాలి, నమ్మించాలి, ఓటర్ల దగ్గర కులం కార్డ్ ప్రయోగించాలి. మతం కార్డు ప్రయోగించాలి. ఏదైతే అదే అన్నీ నేనే అనాలి అప్పుడే గెలిచే గుర్రం లేకుంటే అంతే సంగతులు. ఊర్లు, వాడలు, కుల సంఘాలు తిరిగే అప్పుడు వాగ్దానాలు చేసుడు అవసరమైతే చిన్న చిన్నవి సామూహికంగా తీర్చుడు అన్ని చేస్తేనే ప్రజలకు ప్రతినిధి ఇవన్నీ చేసి విజయం సాధించినంక ఇగ వ్యవహారం మస్తు కాస్ట్లీ అయిపోతది. ఇగ అటు తర్వాత ఆ నియోజకవర్గంలో కట్టే భవనాల ఎస్టిమేట్లు, రోడ్ల నిర్మాణ ఎస్టిమేట్లు, ప్రాజెక్ట్‌ల ఎస్టిమేట్లు నలభై యాభై శాతం అమాంతం పెరిగిపోతయి. రాజకీయ నాయకుని వృత్తి బంగారి కత్తి మీద సాము చేసినట్టే ఉంటది. గెలిచిన తర్వాత తన పార్టీ అధికారంలో ఉందా మంచిదే! లేకుంటే ఏ పార్టీ పవర్‌లోకి వస్తుంటే వాల్లే అమాంతం తనకు తాను అమ్ముకోవచ్చు అదొక ఏర్పాటు కూడా ఉంటది. రానున్న రోజుల్లో ఈ చిత్రాలన్నీ మనకు కన్పిస్తాయి.

అన్నవరం దేవేందర్

94407 63479

Advertisement

Next Story