సంస్కృతి కోల్పోతున్న పల్లెలు!

by Ravi |   ( Updated:2023-06-25 19:16:00.0  )
సంస్కృతి కోల్పోతున్న పల్లెలు!
X

కప్పటి పల్లెల సంస్కృతి ఇప్పుడు మారిపోతున్నది. ఊల్లల్ల ఎన్ని వైరుధ్యాలున్నా అందరం ఒక్కటేననే ప్రేమ భావన ఉండేది. కుల అంతరాలు ఉన్నా, రాజకీయ పార్టీల భేదాలున్నా శతృత్వ వైఖరి చాలా గ్రామాల్లో లేకుండా ఉండేది. నక్సలైట్ రాజకీయాల ప్రభావం వల్ల ప్రశ్నించడం అడగడం మర్లపడటం తెల్సింది. రాజకీయ చైతన్యం చదువుకు దూరమైన కుటుంబాలకు సైతం వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత బహుజన కులాల్లో రాజకీయ ఆసక్తి పెరిగింది. ఊర్లల్ల బీసీ కులాలకు సర్పంచ్, యంపిటీసి లాంటి స్థానిక సంస్థల పదవులతో ఒక రకమైన వివక్షకు దూరమైన వాతావరణం నెలకొంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ప్రభావం వల్ల సామూహిక అస్తిత్వం రాష్ట్ర కాంక్ష అందరిలో మొదలైంది. జానపద పాటలకు బలం పెరిగింది. అంతకుముందు నక్సలైట్ రాజకీయాల్లో వెల్లివిరిసిన పాట అణిచివేతకు గురై తెలంగాణ ఉద్యమంలో తెగదింపులు చేసికున్నది. పాతకాలపు కాంగ్రెస్ పార్టీ ఎట్లాగూ అన్ని గ్రామాల్లో పెత్తందార్ల చేతిలో అందరికీ అనుసంధానంగా ఉంది.

అవసరాల రీత్యా సంబంధాలు..

ఈ మూడు నాలుగు దశాబ్దాల తర్వాత, పల్లె ముఖచిత్రమే మారింది. ప్రపంచం కుగ్రామంగా మారి, గ్లోబలైజేషన్ ప్రభావం వల్ల పల్లె పట్నం ఒక్క తీరే అయ్యింది. నగరంలో దొరికే అన్ని వస్తువుల సేవలు పల్లెలో దొరుకుతున్నయి. రవాణా వ్యవస్థ, విద్యావ్యవస్థ, ఉపాధి రంగం కొత్త పుంతలు తొక్కినా, నిరుద్యోగం పెరిగింది. ముఖ్యంగా రాజకీయాలన్ని వ్యాపారమయం అయిపోయాయి. గతంలో ఉన్న సామాజిక విషయాల పట్ల అవగాహన చైతన్యం పేదల పట్ల సానుభూతి సమానత్వం పట్ల మనుషుల అవగాహన పెరిగింది. గతంలో ఒక రాజకీయ పార్టీకి ఆ సిద్ధాంతం నమ్ముకొని మాత్రమే అందులో కార్యకర్తలు చేరేవారు. ఉదాహరణకు కమ్యునిస్ట్ పార్టీ. భారతీయ జనతా పార్టీకి కూడా తన హిందుత్వ సిద్ధాంతం తనకు ఉండేది. కానీ ప్రస్తుత సందర్భంలో అధికార పార్టీతో అవసరాల రీత్యా సంబంధాలు కార్యాచరణ ఎక్కువ అయ్యాయి. పైన సుట్టు వైకుంఠం ఉన్నట్టు పవర్ చుట్టూ మనుషులు, యువతరం చేరుతున్నారు.

తాగుడొక సరదా నుంచి అవసరం

ఊర్లల్ల రాజకీయ పార్టీల ప్రతినిధులు, నియోజకవర్గ స్థాయిలో నిలబడే రాజకీయ నాయకులు తమ కార్యకర్తలను తమకే నిలుపుకోవాలంటే వాల్లకు తరచూ దావత్‌లు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామ స్థాయి కుల సంఘ నేతలు కొంచెం నోరున్న వాల్లను గ్రిప్‌లో పెట్టుకునేందుకు నెలకు ఒకసారి ఏదో వంకతో మందుతో అనుబంధం పెంచుకుంటున్నారు. ఇట్లా మందు ప్రభావం బాగా అయింది. ఏ రాజకీయ పార్టీ మీటింగ్ పెట్టినా, పైసలు, బిర్యాని, క్వార్టర్ సీసా కంపల్సరీ అయ్యింది. ఇదంతా నిర్వహించడం, కార్యకర్తలను కాపాడుకోవడం ఖర్చుతో కూడుకున్నదే, కానీ వీల్లంతా ఇంకో దిక్కు పుస్కి పోకుండా ఉండాలంటే ఈ అనుబంధం కొనసాగించవలసిందే. అందుకే ప్రాజెక్ట్‌ల ఎస్టిమేట్లు ప్రారంభం అయినప్పటినుంచి అనుహ్యంగా పెరుగుతుంటాయి. రాజకీయ పార్టీల నుంచి ఎన్నికైన ప్రతినిధులే సాధారణంగా మరొకరి పేరు మీద కాంట్రాక్ట్‌లు నిర్వహిస్తారు. అట్లాగే అంతటా భూములు ధరలు పెరిగి రియల్ ఎస్టేట్ పెద్ద లాభసాటి వ్యాపారం అయ్యింది. అందులోనూ పల్లెల నుంచి ఎదిగి వచ్చిన రాజకీయ పార్టీల ప్రతినిధులే ఉంటున్నారు.

మద్యపానం ఒకప్పుడు పల్లెల్లో తక్కువగా ఉండేది. సారా ఉండేది. కానీ దేశీయ పానీయమైన కల్లుకు ప్రాధాన్యం ఇచ్చేవాల్లు ఇప్పుడు విస్కీ, బ్రాందీ విపరీతంగా అమ్ముతున్నారు. ఎక్కడో మండల కేంద్రంలో వైన్ షాపులు ఉండి, బెల్ట్ షాపుల పేర మందు మాత్రం ఊరూరా చేరింది. సులువుగా డబ్బులు వస్తున్నాయి. దీంతో చదువు మధ్యలో ఆపేసినవారు డిగ్రీ, పీజీ పూర్తిగాకుండానే పల్లెలా ఉండే వాళ్లంతా ఆయా పార్టీలకు కార్యకర్తలుగా ఉంటూ ఇట్లా వ్యవహరిస్తున్నారు. భూముల పంచాయితీలు అయితే, అది తెగే దాకా ఊరంతా పండుగే అవుతుంది. ఇలా పల్లెలు సంస్కృతిని పూర్తిగా కోల్పోతున్నాయి.

అన్నవరం దేవేందర్

94407 63479

Advertisement

Next Story