అంతరంగం: కుటుంబ బలగం మ‌ృగ్యమవుతున్న కాలం..

by Ravi |   ( Updated:2023-04-02 19:30:43.0  )
అంతరంగం: కుటుంబ బలగం మ‌ృగ్యమవుతున్న కాలం..
X

ర్థికపరమైన అంతరాలు అహంకారాలు అసూయ ద్వేషాలు మనుషుల మధ్య పెరిగిపోతున్న కాలంలో జీవిస్తున్నాం. మానవ సంబంధాల విలువలు మృగ్యం అవుతున్న సందర్భంలో కుటుంబ సంబంధాల తీగలు పలచనవుతున్నాయి. కొన్ని కొన్ని వార్తలు చూస్తుంటే రక్త సంబంధీకుల మధ్యనే విద్వేషాలు పెరిగి నేర ప్రవృత్తి పెరిగిపోతున్నది. ఈ సంఘటనలు తీవ్రంగానే జరుగుతున్నాయి. మంచి చెడు చెప్పే వ్యక్తులూ మాయం అవుతున్నారు.

సినిమాల ప్రభావం...

సమాజంలో దిగజారుడు విలువలు ప్రపంచీకరణతో మొదలైనాయి. హింసకు పగలకు ప్రతీకారాలకు స్త్రీలను వంచించే సంస్కృతి, అత్యాచార ప్రవృత్తి ప్రధానంగా సినిమాలనుంచే మొదలయింది. సమాజం మీద సినిమా ప్రభావం చాలా ఉంటది. హింసాత్మక నేర సంఘటనల్లో వారిని తెల్సికుంటే సినిమాల ప్రభావం వల్లనే జరుగుతుందని తెలుస్తుంది. దీనికి తోడు నీతి నైతికత ప్రేమ మనుషుల పట్ల గౌరవం సమాజంలో వ్యక్తుల పట్ల మంచితనం నేర్పే వ్యవస్థలు లేవు. పాఠ్యపుస్తకాల్లోనూ ఇటువంటివి ఉండవు. పిల్లలు చదువుకునే ఉన్నత విద్యా వ్యవస్థలో అన్నీ మార్కులు, ర్యాంకులు సంపాదించడం లాంటి ఇంజనీరింగ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ శాస్త్రాలే ఎక్కువ ఉంటాయి. సామాజిక శాస్త్రాలు, చరిత్ర సంస్కృతికి సంబంధించిన చదువులున్న చదివే వాళ్ళు కరువయ్యారు. ఏదైనా ఉద్యోగాల కోసమే చదువులు కాబట్టి శాస్త్ర సాంకేతిక విద్యల వల్లనే జీవితాలు నిలబడుతున్నాయి.

సహజత్వం ఉట్టిపడేలా...

కుటుంబ బంధాల్లో దూరమవుతున్న అనుబంధాలకు ఒక్కసారిగా ఇటీవల వచ్చిన ‘బలగం’ సినిమా షాక్ ఇచ్చింది. సినిమా చూస్తున్నంతసేపూ ఊరు, కుటుంబం, తల్లి, తండ్రి గుర్తుకువచ్చి ప్రేక్షకులను పలు ఆలోచనలకు గురిచేస్తది. సినిమా సిన్మాలాగనే ఉంటుంది. కానీ చనిపోయిన తర్వాత పిట్టకు పెట్టుడు ఆ పదకొండు రోజుల వరకు ఉన్న సంఘటనలు ఉన్నది ఉన్నట్టు చూయించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సంస్కృతికి, భాషకు గౌరవం పెరిగింది. ఇది వరకు తెలంగాణ భాష ఎక్రిచ్చేట్టుగా పాత్రలకు వాడేవారు. అదీ కృతక తెలంగాణ భాషను పలికించేది. కానీ బలగం సినిమాలో మాత్రం సహజత్వం ఉట్టిపడింది. కొమురయ్య తాత పాత్ర అత్యంత సహజంగా ఉన్నది. బలగం సినిమా పాటలు అద్భుతంగా ఉన్నాయి. కాసర్ల శ్యాం కలం నుంచి తెలంగాణ తెలుగు భాష జాలువారింది. చివర క్లైమాక్స్‌లో పాడిన పాటకు కండ్లడ్ల నీళ్ళు తిరగని వారు లేరు. ఇప్పటికీ పల్లెల్లో చనిపోయిన శవయాత్ర ముందు ఆ వ్యక్తి చరిత్ర చెప్పుతూ తన పిల్లలను గుర్తుచేస్తూ అప్పటికప్పుడు కైగట్టే జానపద కళాకారులున్నరు.

ఒక నిండైన జీవితం ముగిసిన తర్వాత జరిగే అంతిమయాత్ర దశదిన కర్మల సన్నివేశాల్లో వేదన, ఆవేదన కన్పిస్తది. చావు తర్వాత పది రోజుల్ల తినుడు తాగుడు ఉన్నది కాని మరీ ఎక్కువ చూపించినట్టు అన్పించింది. పిట్టకు పెడితే అది తింటే చనిపోయిన వాల్లకు ముడుతుందా లేదా అనే విషయం పక్కనపెడితే నడుస్తున్న సంప్రదాయాన్ని ఉన్నదున్నట్టు తెరకెక్కించిన తీరు అభినందించదగ్గదే. ఇలాంటి తెలంగాణ పల్లె సొగసు కన్పించే సినిమాలు మరిన్ని రావాలి.

అన్నవరం దేవేందర్

94407 63479

Advertisement

Next Story

Most Viewed