అంతరంగం: మా బడి వజ్రోత్సవం

by Ravi |   ( Updated:2023-03-19 19:15:17.0  )
అంతరంగం: మా బడి వజ్రోత్సవం
X

పాఠశాలలో నేర్చుకున్న ప్రాథమిక పాఠాలే ప్రపంచాన్ని వీక్షించేందుకు కిటికీలు. తరగతి గదిలో నేర్చుకున్న అక్షరాలు వ్యాకరణాలు గుణింతాలు, శాస్త్రాలు అన్నీ శ్రద్ధగా నేర్చుకుంటేనే మానవ వికాసం. అక్షర జ్ఞానంతో పాటు సామాజిక చైతన్యం కుటుంబ సంస్కారం అన్నీ కలిపితేనే కొనసాగుతున్న జీవితం. బడులు ఏ ప్రాంతంలో ఏ కాలంలో ఎన్ని స్థాపించారు అనే దాన్ని బట్టే ఆ ప్రాంత సామాజిక చైతన్యం బేరీజు వేయవచ్చు.

ఆ స్కూల్ మొదటి బ్యాచ్

కరీంనగర్ జిల్లాలో 1945 ప్రాంతంలో వేళ్ళ మీద లెక్కపెట్టబడే బడులే ఉండేవి. అందులో హుస్నాబాద్‌లో 1947లో స్థాపించిన ప్రాథమిక పాఠశాల ఒకటి. ఇప్పుడది ఉన్నత పాఠశాలగా మారి ఈ నెల 20న 75 ఏళ్ళు వజ్రోత్సవ పండుగ జరుపుకుంటుంది. హుస్నాబాద్ గతంలో కరీంనగర్ జిల్లాలో ఉండేది ఇప్పుడది సిద్ధిపేట జిల్లాలో చేరింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది గానీ హైదరాబాద్ సంస్థానంలో పోరాటం కొనసాగుతున్న 1947లోనే హుస్నాబాద్ లో ప్రాథమిక పాఠశాల బి. లక్ష్మీకాంతారావు పూనికతో ఏర్పడింది. అనంతరం అది ఉన్నత పాఠశాలగా మారింది. 1958లో మొదటి హచ్.ఎస్.సి (11వ తరగతి) బ్యాచ్ వెలువడింది. అప్పుడు ఆ పాఠశాలకు రేకొండకు చెందిన పరాంకుశం మనోహర స్వామి ప్రధాన ఉపాధ్యాయులుగా ఉండేవారు. అంతకుముందు చంద్రయ్య సార్ పనిచేసేవారు. ఈ కాలంలోనే 1955లో హుస్నాబాద్‌కు డీవీఆర్ సారు వచ్చారు. డీవీఆర్ సార్ విద్యార్థి లోకంలో చాలా పాపులర్ పర్సన్. అనంతర కాలంలో హుస్నాబాద్ జూనియర్ కళాశాలలోనే 1989లో ఉద్యోగ విరమణ చేశారు. 1957లోనే హుస్నాబాద్ పాఠశాలలో సాంస్కృతిక క్రీడా వాతావరణం వెల్లివిరిసింది. విద్యార్థుల కోసం సైక్లో స్టైల్ పత్రిక ఒకటి నడిపేవారు. అందులో కథలు కవిత్వం వ్యాసాలు ప్రచురించారు. ప్రతి మొన్నటి వరకు మనోహర స్వామి గారి ఇంటిలో ఉండేది. అనంతర కాలంలో కొన్ని సంవత్సరాలు 'చంద్రిక 'అనే వార్షిక సాహిత్య సంచికలు వెలువడినాయి.1977 లో వెలువడిన 'చంద్రిక 'లో ఈ వ్యాసకర్త మొదటి గల్పిక అందులోనే అచ్చు అయ్యింది. అనంతరకాలంలోనూ కొన్నిసార్లు సాహిత్య సంచికలు వచ్చాయి. హుస్నాబాద్ పాఠశాల నుంచి 1980, 90 దశకాల్లో కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్ క్రీడలు జోరుగా ఆడేవారు. వాలీబాల్ క్రీడల్లో సర్దార్ షర్ఫుద్దీన్ ప్రావీణ్యులు. అనంతర కాలంలో ఆయన సర్పంచిగా పనిచేశారు. ఆయన ఆధ్వర్యంలో 1986 ప్రాంతంలో రాష్ట్ర స్థాయి వాలీబాల్ క్రీడలు జరిగాయి.

పాఠశాలకు మైదానం చాలా విస్తృతంగా ఉండేది. హాస్పిటల్ అవతల బైపాస్ రోడ్ వరకు స్కూల్ గ్రౌండ్ ఉండేది. అభివృద్ధి పేర భవనాల నిర్మాణాలు వెలిసి మైదానం తగ్గిపోయింది. హుస్నాబాద్ హై స్కూల్లో మొదటి బ్యాచ్ అంటే 1954-55 లో హెచ్ ఎస్ సి విద్యార్థులు 18 మంది మాత్రమే. అందులో పోతారం కె.రాములు సారు, పూదరి వెంకటరాజం పారిశ్రామికవేత్త , సత్యనారాయణ , మధుసుధన్ రెడ్డి, పి.రాజయ్య లు. కె. భద్రయ్య, అన్నవరం, దశరథం, కొండ్లే వెంకటయ్య లక్ష్మారెడ్డి, కనకయ్య, వెంకటనరసయ్యలు, శేషాద్రి తదితరులు స్వర్గస్తులయ్యారు.

గొప్ప వ్యక్తులను అందించిన పాఠశాల..

1977 ప్రాంతంలో పాఠశాలను మననం చేసుకుంటే ఒక పది ఇరవై సైకిళ్లు మాత్రమే బయట స్టాండ్‌లో ఉండేవి. అందరూ కాలినడకనే పోతారం, పొట్లపల్లి, ఉల్లంపల్లి, ఆరెపల్లి, తోటపల్లి, మిర్జాపూర్, కూచనపల్లి, గోవర్ధనగిరి గ్రామాల నుంచి విద్యార్థులు నడిచి వచ్చి చదువుకునే వాళ్ళు. ఎక్కడి వాళ్ళైనా నడకనే. శాసనసభ మాజీ స్పీకర్ మధుసూదనాచారి, కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ రిజిస్టర్ ఫ్రోపెసర్ లింగమూర్తి, ఉస్మానియా ప్రొఫెసర్లు జోగాచారి, అయిలేని విద్యాధర్ రెడ్డి, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ బెనర్జీలు ఈ పాఠశాల విద్యార్థులే. అట్లాగే ఉన్నత స్థాయి అధికార హోదాలో అడిషనల్ కలెక్టర్ గాజుల శ్యాం ప్రసాద్ లాల్, వాళ్ల నాన్న ప్రఖ్యాత నాట్యాచార్యులు రజని శ్రీ,, ఎక్సైజ్ అడిషనల్ సూపరిండెంట్ అయిలేని శ్రీనివాస్ రెడ్డి, సమాచార శాఖలో డిప్యూటీ డైరెక్టర్ కన్నోజు మనోహరాచారి, బ్యాంకు డిప్యూటీ మేనేజర్ రామక రాజన్న, వైద్యవృత్తిలో డాక్టర్ గంగం రాజా రెడ్డి, డాక్టర్ పంతం నారాయణలు, న్యాయవాద వృత్తిలో కన్నజు రామచంద్రం, కొత్తపల్లి దేవేందర్, రఘోత్తం రెడ్డి, ఒంటెల రత్నాకర్, సంజీవరెడ్డిలు ఈ పాఠశాల విద్యార్థులే. కొండ లక్ష్మణ్, మహమ్మద్ ఫజుల్ రెహమాన్, కరివేద మల్లారెడ్డి, అన్నవరం దేవేందర్‌లు ఈ ప్రాంతం నుంచి తొలితరం జర్నలిస్ట్‌లు ఈ బడి విద్యార్థులే. గడిపే మల్లేశం, తిప్పర్తి శ్రీనివాస్ కళారంగంలో ఎదిగారు. రాజకీయ నాయకులుగా కేడం లింగమూర్తి, ఆకుల వెంకన్న, బొలిశెట్టి శివయ్య, కొత్తపల్లి ఆశోక్‌లు ఈ పాఠశాలలో విద్యను ఆర్జించిన వాళ్ళు. దాదాపు అన్ని రంగాల్లో ఎందరో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. మరెందరో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా ఎదిగారు. ఉపాధ్యాయులుగానయితే వందలాది మంది ఉన్నారు. ఏ రంగాల్లో ఎంతమంది ఎదిగారనే జాబితా ఇప్పటికిప్పుడు నా దగ్గర లేదు గాని పాఠశాల సమాజానికి గొప్ప వ్యక్తులను, సామాజికవేత్తలను అందించింది.

ఒక పాఠశాల 75 వసంతాలు పూర్తిచేసుకుని ఒక పండుగలా సెలబ్రేట్ చేసికుంటున్న సందర్భం ఇది. ఈ బడి ఎందరినో తయారు చేసింది అందరూ కల్సుకుంటున్న సందర్భం ఇది.

అందరూ కలిసి అరేయ్ ఒరేయ్ అనుకున్న జ్ఞాపకాలు, కొట్టుకున్న తిట్టుకున్న మధురిమలు, పాఠశాల మైదానంలో ఆడిన పాత అడుగుజాడలు మళ్లీ మళ్లీ వెతుకుతున్న రోజు ఇది. విద్యాగంధానికి దూరమైన తెలంగాణలో 75 ఏళ్ల బడి పండుగ..

అన్నవరం దేవేందర్

9440763479

Advertisement

Next Story

Most Viewed