కూల్చుటకు అభినందనలే కానీ..

by Ravi |   ( Updated:2024-09-22 19:00:51.0  )
కూల్చుటకు అభినందనలే కానీ..
X

హైదరాబాద్ నగరంలో చెరువుల్లో అక్రమంగా నిర్మించిన భవనాలు కూల్చుతున్న సందర్భానికి జేజేలు పలకవలసిందే. అయితే, అన్ని కోట్లు పెట్టి అంత ఎత్తు నిర్మాణాలు చేస్తుంటే అధికార యంత్రాంగం ఏం చేస్తున్నట్టు. ఆ నిర్మాణాలకు సంబంధిత వివిధ శాఖలు పర్మిషన్ ఎలా ఇచ్చాయి? ఇంత గుడ్డిగా ప్రభుత్వం నడుస్తుందా? చూసిచూడనట్లు పోతున్నారా? చట్టాలు, పద్ధతులు ఏమీ ఉండవా? ఏదో రాత్రికి రాత్రి పూర్తి అయిన భవనాలు కాదు కదా. సంవత్సరాల తరబడి నిర్మించిన ఆ అక్రమ నిర్మాణాలను చూసి చూడనట్టు ఎలా మిన్నకున్నారు? అసలు ఆ భవన నిర్మాణాలకు అనుమతి ఎలా దొరుకుతుంది? డబ్బులు పెడితే మాత్రం చెరువుల్లో కట్టుకోవచ్చా? చెరువులు, కుంటలు నిండిపోతే ఆ నీళ్లు ఎటు పోవాలి? ధన ప్రవాహం వారి జేబుల్లోకి వస్తే.. నీళ్ల ప్రవాహం ఎటు పోతది?

వాళ్లు చేయమంటే చేస్తారా..?

ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు లక్షలాది రూపాయల జీతం తీసుకుని చేయకూడని పని ఎలా చేస్తున్నారన్నదే ప్రశ్న. అక్కడ వాళ్ళు ఉన్నదే ఆ చెరువులను రక్షించడానికి. ఆ భూమిని రక్షించడానికి. ఆ అడవిని రక్షించడానికి. ఆ గాలిని రక్షించడానికి. కానీ కళ్లముందు పట్టపగలు నడి నగరంలో జరిగిందేమిటి? అక్రమ పద్ధతులు, అవినీతి వరదలు..

కారణభూతులను వదలితే ఎలా?

సరే కోట్లాది రూపాయలు పెట్టి అంతస్తుల మీద అంతస్తుల నుంచి నోట్ల కట్టల కోసం నిర్మించిన ఆ నిర్మాణాలను కూలుస్తున్నారు గానీ అందుకు కారణభూతులను వదలడం ఎలా? ముందు ఆ బుల్డోజర్ లాంటి భయం ప్రభుత్వ ఉన్నత ఉద్యోగుల మీద ఉండకూడదా? అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల మిన్నకున్నాం అంటారేమో..? వాళ్లు ఒత్తిడే చేస్తారు గాని ప్రొసీడింగ్స్ మీద సంతకం చేయరు కదా. వాళ్లు చేయమంటే చేసినామనడానికి అఖిల భారత సర్వీసుల ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత ఉద్యోగ సర్వీసులు ఎందుకు?

బుల్డోజర్లు, క్రేన్లు, ఉరికి ఉరికి కూలకొడుతున్న దృశ్యం బహు సుందరంగా అనిపిస్తుంది. ఇప్పటికైనా ఇప్పుడు ఏలుతున్న వారి ఈ మహత్తర నిర్ణయానికి జేజేలు పలకవలసిందే. సరిగ్గా అట్లనే దాని కారకులు అందరిపై పకడ్బందీ చర్యలు తీసుకుంటేనే భవిష్యత్త్ తరాలకు ఒక గొప్ప సంకేతం పోతుంది. ఈ నిర్మాణాల్లో సంపన్న వర్గాలు ఎంత నష్టపోయినా వాళ్లకు పెద్ద తేడా ఉండదు. కానీ అందులో కొనుక్కున్న ఎగువ మధ్యతరగతి వర్గాలకు పెద్ద ఇబ్బంది. ఆందోళనకరమైన అంశమే..!

-అన్నవరం దేవేందర్

94407 63479

Advertisement

Next Story

Most Viewed