బయోపిక్ తీయదగ్గ పుస్తకం.. క్రీడాస్థలి

by Ravi |   ( Updated:2023-07-16 19:00:35.0  )
బయోపిక్ తీయదగ్గ పుస్తకం.. క్రీడాస్థలి
X

ది 2018 చివర్న ఓరోజు పొద్దున్నే 6.15 గంటలు. హైదరాబాద్.. శాప్, డిప్యూటీ డైరెక్టర్ కారంగుల మనోహర్ ఇల్లు. ఎవరో తలుపు తట్టారు. రైల్వే స్టేషన్‌కు వెళ్లేందుకు తయారైన మనోహర్ తలుపు తీసేపాటికి ఎదురుగా ఆరుగురు.. వచ్చిన వాళ్లు ఏసీబీ పోలీసులని గుర్తుపట్టడానికి ఎంతో సేపు పట్టలేదు. చకచకా సోదాలు, స్వాధీనాలు.. ఆరోపణ.. స్పోర్ట్స్ కోటాలో మెడికల్ సీట్ల వ్యవహారం. ఆటలు ఆడకుండానే ఆడినట్టు ఇమ్మని ప్రముఖుల పిల్లల పట్టు. కుదరన్నందుకు ఏసీబీకి ఫిర్యాదు. నిరూపించుకోలేక పోయిన ఫిర్యాదు దారులు. కడిగిన ముత్యంలా మనోహర్..

క్రీడా మైదానాల్లో జరిగే కుట్రలు, కుతంత్రాలకు ఇదో మచ్చుతునక మాత్రమే. మొన్నామధ్య క్రికెటర్ అంబటి రాయుడు తనని ఎవరెవరు ఎలా అణగదొక్కారో, జాతీయ జట్టుకు ఎంపిక కాకుండా తెర వెనుక ఎవరెన్ని కుట్రలు చేశారో పేర్లతో సహా బయటపెట్టాడు. ఈ మధ్య ఢిల్లీలో మహిళా రెజ్లర్లు కొందరు వీధుల్లోకొచ్చి మానప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని గొంతెత్తి అరిచి మరీ మొరపెట్టారు. అయినా వారిది అరణ్యరోదనే అయింది. ఇలా ఎన్నెన్నో పన్నాగాలుంటాయనేది.. ప్రముఖ క్రికెటర్ల పిల్లలు తప్పక క్రికెట్ జట్టుకు ఎంపికవుతారన్నది ఎంత నిజమో ఇదీ అంతే నిజం.

భావి తరాలకు స్ఫూర్తి నిచ్చే పుస్తకం!

ఇవన్నీ ఎలా ఉన్నా... రంగస్థలి, సభాస్థలితో ఉన్నంత బంధం మనకు క్రీడాస్థలితో లేదు. ఎవరన్నా ఆడితే చూసి సంబర పడడం తప్ప ఆడం. మన పిల్లలు ఆటల్లోకి పోతే పనికిమాలిన వాళ్లలా తయారవుతారని బెంగ పడే సాదాసీదా మధ్యతరగతి మనస్తత్వం మనది. అటువంటి జనాంతిక సూత్రీకరణలు తప్పని, ఆటల్లోనూ మేటి అనిపించుకోవడానికి ఛాన్స్ ఉందని, అందుకు ప్రణాళిక, పట్టుదల, చిత్తశుద్ధి అవసరమని నిరూపించిన వారూ లేకపోలేదు. అటువంటి వారిలో ఈ అథ్లెటిక్ కోచ్ కారంగుల మనోహర్ ఒకరు. నిజానికి ఈయనెవరో నాకు తెలియదు మాటల మధ్యలో మా మిత్రుడొకరు ఈయన గురించి చెబితే ఫోన్ చేశా. మీరెక్కడుంటారని అడిగి నా దగ్గరకు ఆయన రాసిన పుస్తకాన్ని తీసుకొచ్చారు.

మనకు స్వీయచరిత్రలు, జీవిత చరిత్రల పుస్తకాలు తెలుసు. అనుభవాలు, ఉత్తర ప్రత్యుత్తరాలు, మ్యూజింగ్స్ వంటివీ తెలుసు గాని క్రీడా ప్రముఖులు వారి జీవిత చరిత్రలను రాయడం అరుదుగా చూస్తుంటాం. ఒక రచయిత నిర్దిష్ట క్రీడా పుస్తకాన్ని ఎందుకు రాశారో తెలుసుకోవడం నా కిష్టం. వారి కథ చెప్పడానికి ప్రేరేపించిన అంశాలనేకం ఉంటాయి. లేదా మరెవరో స్ఫూర్తినిచ్చి ఉండవచ్చు లేదా ఇంకేదో కష్టమో, సుఖమో ఉండి ఉండవచ్చు. రచయితే చేసే ఓ మామూలు సూచన చాలా మంది పాఠకులను తలలు పట్టుకునేలా చేయవచ్చు. కలవరపర్చనూ వచ్చు. కదిలించనూ వచ్చు. అటువంటి పుస్తకమే మనోహర్ రాసిన ‘క్రీడాస్థలి- మైదానం లోపల-బయట’ పుస్తకం. క్రీడా రంగంపై వచ్చిన ఈ పుస్తకం భావితరాలకు స్ఫూర్తినిస్తుందని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు.

ఓ సాదా సీదా కుటుంబంలో పుట్టిన ఆయన తల్లిదండ్రుల వెన్నుదన్నుతో ఆటలాడి.. గురువు ప్రోత్సాహంతో.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం వరకు రాష్ట్ర, జాతీయ, ఒలింపిక్ స్థాయిల్లో అథ్లెటిక్ అసోసియేషన్లకు గట్టి పునాది వేసి.. బోలెడంత మంది శిష్యగణాన్ని పెంచుకున్నారు. ఉన్నదున్నట్టు చెప్పడం, నీతి నిజాయితీతో బతికేందుకు ప్రయత్నించడం ఆయన అలవాటు. నిజాయితీతో బతకడం ఎంత కష్టమో, అంత మూల్యం చెల్లించాల్సిన విషయమూనూ. నిజాయితీ గిట్టని వారి కుట్రలకు గురయ్యాడు. అవినీతికి నో అన్నందుకు ఏసీబీ కోర్టు మెట్లు ఎక్కాడు. స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ ఉద్యోగ చివరాంకంలో విచారణలు, దర్యాప్తులు ఎదుర్కొన్నా, కడిగిన ముత్యంలా బయటపడ్డారు.

ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని..

మనోహర్ సుదీర్ఘ క్రీడా జీవితానుభవమే ఈ క్రీడాస్థలి. ఎన్నో ఇక్కట్లు మరెన్నో అనుభవాలు, మంచీ చెడులు. జీవితమంటేనే ఇవన్నీ కదా.. ఇలా అన్నింటినీ రికార్డ్ చేసి భావి క్రీడాకారులకు అందించారు. క్రమశిక్షణ, పట్టుదల ఉంటే అందరూ మహాను భావులవుతారో లేదో తెలియదు గాని ఈయన మాత్రం సాధించారు. 1980ల నుంచి 2021 వరకు 40 ఏళ్ల కాలం క్రీడా ప్రాంగణాల్లో జరిగిన అనేక ఆటుపోట్లు, కుట్రలు, కుతంత్రాలు, క్రీడా పరిణామాలు తెలిసిన వాళ్లలో ఈయనొకరు. ఈ పుస్తకం చదివిన వారికి రచయితకు ఉర్దూ గజల్స్‌పై పట్టుందన్న విషయం అర్థమవుతుంది. కష్ట సుఖాలన్నింటా ఆయన ఉర్దూ గజల్స్‌నే కోట్ చేస్తూ వచ్చారు. పట్టుమని నలుగురు మంచి మనుషుల్ని సంపాదించుకోవడమే కష్టమైన ఈ రోజుల్లో ఈయన ఏకంగా పాతిక ముప్పై మంది ఉత్తమోత్తమ శిష్యుల్ని సాధించుకున్నారు. "లంబే, చౌడే యాదే ఫల్ బన్కే గుజర్ గయా" అనే తత్వాన్ని బాగా వంటబట్టించుకున్న ఈయన తన 58 ఏళ్ల జీవిత జ్ఞాపకాలను గుదిగుచ్చారు. ఒక్కసారి చదవడం మొదలు పెడితే చివరి దాకా ఆపబుద్ధి కాదు.

నిజానికి ఇలాంటి పుస్తకాలను అమెరికా, యూరోప్ లాంటి దేశాల్లోనైతే ఏ డాక్యుమెంటరీలు గానో బయోపిక్స్ మాదిరో తెరకెక్కిస్తుంటారు. ఎందుకో గాని మనకెందుకో ఈ సంస్కృతి ఇంకా బాగా అబ్బలేదు. అలా ఎవరైనా అడుగున పడిన ఆణిముత్యాలను తెరకెక్కించదలచుకుంటే ఈ క్రీడాస్థలి బాగా పనికొస్తుంది. ఇది నవచేతన, విశాలాంధ్ర బుక్ హౌస్‌లలో లభిస్తుంది. వెల రూ. 150/- రచయితనూ సంప్రదించవచ్చు. ఫోన్ నెంబర్ 9491058772.

అమరయ్య ఆకుల

9347921291

Advertisement

Next Story