- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమీక్ష:దారి చూపే వెలుగు దివ్వెలు
ప్రకాశం జిల్లా ఉలవపాడు గ్రామానికి చెందిన చెందిన కవి పిల్లి హజరతయ్య ప్రస్తుతం సింగరాయకొండలో ఉంటున్నారు. జిల్లాపరిషత్ పాఠశాల'పాకాల'లో వ్యాయామ ఉపాధ్యాయుడు, తెలుగు, ఇంగ్లిషులో పీజీ చేశారు. బీపీఈడీ తర్వాత పీహెచ్‌డీ చేస్తున్నారు. చాలాకాలం క్రితం నుంచి కవిత్వం రాస్తున్నారు. రచనలు చేస్తున్నారు. ఇప్పుడు 'వెలుగు దివ్వెలు' పేరు తొలి కవితా సంపుటిని వెలువరించారు. మొత్తం 100 కవితలున్నాయి. కవి, ఉపాధ్యాయుడు కాబట్టి సామాజిక అవగాహన, లోకరీతి, లోకనీతి తెలిసినవాడు. ఆయన కవిత్వంలో కూడా ఇవన్నీ కనబడతాయి.
'కాలము ఒక తీరుగా వుండక / జీవన విధానాన్ని మారుస్తుంది / నేనిలాగే ఉంటాను అంటే / దుష్ఫలితాన్నిస్తుంది' 'ఎవరికి వారే యమునా తీరే / అన్నట్లు వుండే బంధువులు /చేరువైనా ఫలితం గుండు సున్నేగా' 'బలవంతుడిని నేనేనని / జబ్బలు చరుచుకున్న / ఎందరో మహానుభావులు /కాలగర్భంలో కలిసిపోయారు' 'కులమతాల కుమ్ములాటలు / నాగరికతపై తీరని మోజులు / కొండను తలపిస్తున్న పాపాలు / సుస్తీ చేసిన ఆరోగ్యాలు / కోల్పోతున్న మానవ సంబంధాలు'
ఈ సంపుటిలో అన్ని కవితలు దాదాపు ఇలాగే ఉంటాయి. ఆహా, అనిపించే మెరుపులేం కనబడవు. అంతా వాచ్యంగా, వచనంలా సాగుతుంది. 'వికసించే పుష్పం నేర్పుతుంది / తనలా అందంగా జీవించమని / రాలిపోయే ఆకు చెబుతుంది /జీవితం శాశ్వతం కాదని /ప్రవహించే నది తెలుపుతుంది /అవరోధాల్ని దాటి ముందుకు వెళ్లమని' నిజానికి కవితా పాదాలను విడగొట్టి చూస్తే సూక్తి ముక్తావళిని తలపిస్తాయి. ఈ కవి మానవతావాది. సంపుటిలోని నూరు కవితలు కూడా ఇంచుమించుగా ఇదే తీరులో ఉంటాయి. వీలుంటే ఒకసారి చదవొచ్చు. శ్రీశ్రీ కళావేదిక ఈ సంపుటిని ప్రచురించింది.
ప్రతులకు:
పిల్లి హజరతయ్య
7-128ఎ, సింగరాయకొండ, ప్రకాశం జిల్లా
ఆంధ్రప్రదేశ్-523101, 98486 06573
పేజీలు 128 : వెల రూ.150
సమీక్షకులు:
ఎం. రజాహుస్సేన్
9063167117
- Tags
- Book Review