NO కరెన్సీ.. చీటీ ఉంటే లిక్కర్ ఫ్రీ.. తెలంగాణలో ఎక్కడో తెలుసా.?

by Anukaran |   ( Updated:2021-09-16 23:45:33.0  )
NO కరెన్సీ.. చీటీ ఉంటే లిక్కర్ ఫ్రీ.. తెలంగాణలో ఎక్కడో తెలుసా.?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఓ మండల కేంద్రమది. అప్పుడే తమ ఊరికి చేరుకున్న సమీప బంధువును రిసీవ్ చేసుకునేందుకు బస్టాండ్ వద్ద వెయిట్ చేస్తున్నాడో వ్యక్తి. బస్సులోంచి అతను దిగగానే తన బైక్‌పై ఎక్కించుకుని రయ్ మంటూ బయలు దేరాడు. మధ్యలో వైన్ షాపు ముందు ఆ బైక్ ఆపి కిందకు దిగి తన బంధువును అక్కడే వెయిట్ చేయమన్నాడు. బ్రాందిషాపు కౌంటర్ వద్దకు వెళ్లిన ఆ వ్యక్తి తన వద్ద ఉన్న చీటిని కౌంటర్‌లో ఇచ్చాడు.

వెంటనే రెండు బాటిల్స్ అతనికి అప్పగించగానే బండి స్టార్ట్ చేసి ఇంటికి తీసుకెళ్లాడు. ఇదంతా ఓ మాయాజాలంలా కనిపిస్తున్న తీరు చూసిన ఆ బంధువు గందరగోళానికి గురయ్యాడు. కానీ అతన్ని ఏమీ అడగలేక పోయాడు. చివరకు సాయంత్రం దావత్‌లో కూర్చున్న తరువాత వైన్స్ షాపులో చీటి ఇచ్చుడేంది రెండు ఫుల్ బాటిల్స్ నీకు ఇచ్చుడేంది నువ్వేమన్న పార్ట్‌నర్‌షిప్ తీసుకున్నావా లేక దాదాగిరి చేస్తున్నావా అంటూ అడిగాడు. ఏ అదేం లేదే ఓట్ల పండగ షురూ అయింది కదా మనకు ఇక్కడ మందుతో జాతరే నడుస్తుందే అని చెప్పడంతో షాక్‌కు గురయ్యాడు అతని బంధువు. ఇది ఎక్కడో కాదు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా సాక్షాత్కరిస్తున్న చిత్రం.

ఓటర్లకు ఎర..

హుజురాబాద్ బై పోల్స్ సినారియోలో కనిపిస్తున్న చిత్ర విచిత్రాలు అన్నీ ఇన్ని కావనే చెప్పాలి. ఎన్నికల వాతావరణం నెలకొన్న హుజురాబాద్‌లో మందు ఫ్రీ సప్లై అన్న రీతిలో కొనసాగుతోంది. ఆ ప్రాంతంలో బంధువుల ఇళ్లకు వెళ్తే దూంధాంగా దావత్‌లు ఇస్తున్నారు. నియోజకవర్గంలోని లిక్కర్ షాపుల్లో నగదు కన్నా ఉచితంగా మద్యం ఇవ్వాలని రాసిచ్చే చీటీలే ఎక్కవగా ఉంటున్నాయట. ఏదైనా పార్టీ మీటింగ్ అయిందంటే చాలు ఆ రోజు మద్యం ఏరులై పారుతోందట. మద్యం ప్రియుల అవసరాలను ఆసరాగా తీసుకున్న పొలిటికల్ పార్టీ లీడర్లు వారికి ఎర వేసేందుకు ఈ ఎత్తుగడను ఎంచుకుని ముందుకు సాగుతున్నారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది.

కేడర్‌ను బట్టి లిక్కర్..

లిక్కర్ బాటిళ్లు ఫ్రీగా ఇచ్చేందుకు గ్రేడ్‌లుగా క్యాడర్‌ను విభజించుకున్నాయట పార్టీలు. రాయల్ స్టాగ్ నుండి బ్లాగ్ డాగ్, 100 పెప్పర్స్, టీచర్స్ బాటిల్స్ వారి వద్దకు వచ్చే కేడర్‌ను బట్టి చీటిలపై రాసివ్వగానే బ్రాంది షాపుల్లో ఉచిత సరఫరా స్కీం నడుస్తోందన్న చర్చలు సాగుతున్నాయి.

మండలానికో ఇంచార్జీ

పార్టీల సమీకరణాలు చేసేందుకు, ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రత్యేకంగా ఇంఛార్జీలను నియమించినట్టుగానే లిక్కర్ సరఫరా కోసం కూడా ప్రత్యేకంగా ఇంఛార్జీలను నియమించారని తెలుస్తోంది. చీటీలు రాసిచ్చేందుకు మాత్రమే ఈ ఇంఛార్జీలకు బాధ్యతలు అప్పగించారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Advertisement

Next Story