దుబ్బాకకు మంత్రివర్గ విస్తరణకు లింక్?

by Anukaran |   ( Updated:2020-11-04 21:43:44.0  )
దుబ్బాకకు మంత్రివర్గ విస్తరణకు లింక్?
X

దిశ, తెలంగాణ బ్యూరో: దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితం రాష్ట్రంలో పెను రాజకీయ మార్పులకు శ్రీకారం చుట్టనుంది. అధికార పార్టీ గెలుపుతో సాధించే మెజారిటీకి అనుగుణంగా టీఆర్ఎస్‌లో భారీ మార్పులే చోటుచేసుకోనున్నాయి. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ కూడా జరిగే అవకాశం ఉంది. కనీసంగా ఐదారుగురు మంత్రులు కొత్తవారు వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. భారీ మెజారిటీతో గెలుపొందినట్లయితే రానున్న మూడేళ్ళ కాలాన్ని దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్ మరింత దూకుడు నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. ఒకవేళ ఆశించినదానికి భిన్నంగా ఫలితం వచ్చినట్లయితే ఆత్మరక్షణ చర్యలు ఉండే అవకాశం ఉంది. ఒకరిద్దరు మంత్రుల మార్పుకు మాత్రమే పరిమితమై ప్రధాన దృష్టిని జీహెచ్ఎంసీ ఎన్నికలపై పెట్టే అవకాశం ఉంది.

హరీశ్‌రావు మంత్రి పదవిని వదలుకుంటారా..?

దుబ్బాకలో గ్రౌండ్ చాలా క్లియర్‌గా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. గతంకంటే మెజారిటీ వస్తుందని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీలకు కనీసం డిపాజిట్‌లు కూడా రావని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు అనుగుణంగా ఓటమి ఎదురైనా లేక బొటాబొటి మెజారిటీతో గెలిచినా టీఆర్ఎస్ నష్ట నివారణ చర్యలు చేపట్టే అవకాశం ఉంది. దుబ్బాక ఎన్నిక బాధ్యతను పూర్తిగా హరీశ్‌రావు చేపట్టినందువల్ల ఓటమి ఎదురైతే ఆయనే స్వయంగా నైతిక బాధ్యత వహించే అవకాశం ఉందని, మంత్రిగా తనంతట తాను బాధ్యతల నుంచి తప్పుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అభిప్రాయపడ్డాయి. అలాంటి పరిస్థితుల్లో మంత్రివర్గంలో మార్పు కేవలం ఆ ఒక్కరికి లేదా మరొకరికి మాత్రమే వర్తించే అవకాశం ఉందని సమాచారం.

గెలిస్తే దూకుడు నిర్ణయాలు..

దుబ్బాకలో గెలుపు గురించి టీఆర్ఎస్‌ పార్టీ నేతలకు ఎలాంటి అనుమానం లేనప్పటికీ ఫలితాల అనంతరం పరిస్థితులను బట్టి దూకుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని, పనితీరు సరిగా లేని మంత్రులను క్యాబినెట్ నుంచి తొలగించి వారి స్థానంలో కొత్తవారికి చోటు కల్పించవచ్చన్న వార్తలు పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. గెలుపును పరిగణనలోకి తీసుకుని ఇకపైన ప్రజల మద్దతు ఉందనే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవచ్చని తెలిసింది. మంత్రివర్గ విస్తరణలో జిల్లాలతో పాటు సామాజిక సమీకరణాలను కూడా గమనంలో ఉంచుకుని కొత్తవారికి అవకాశం ఉంటుందని సమాచారం. దుబ్బాక ఫలితం తదనంతర పరిస్థితులు ఎలా ఉన్నా మంత్రివర్గంలోకి కవితను తీసుకోవడం ఖాయమనే సంకేతాలు ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.

ప్రతికూల ఫలితం వస్తే నష్టనివారణ చర్యలు..

దుబ్బాకలో ఆశించిన స్థాయిలో మెజారిటీ రాకపోయినట్లయితే దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. ప్రజల్లో ఆదరణ తగ్గుతుందన్న అంచనాతో పార్టీని మరింత చేరువ చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, గ్రామ స్థాయి నుంచి వివిధ సెక్షన్ల ప్రజలకు దగ్గరయ్యేందుకు అమలుచేయాల్సిన పథకాలు, నిరంతరం ప్రజల మధ్యన పార్టీ కార్యకలాపాలు జరిగేలా ప్రత్యేకంగా చేపట్టాల్సిన క్యాంపెయిన్ తదితరాలపై దృష్టి పెట్టడంపై నాయకత్వం ఆలోచించనున్నట్లు సమాచారం. ప్రజల్లో ఓటమి లేదా తక్కువ మెజారిటీ అనే అంశాలపై జరిగే చర్చను అప్రాధాన్యం చేసే తీరులో రాజకీయపరంగా కొత్త ప్రకటనలు, నిర్ణయాలతో ప్రధాన దృష్టి పడేలా వ్యవహరించే అవకాశం ఉందని సమాచారం.

Advertisement

Next Story