Women's issues : చెప్పుకోలేని బాధలు.. మహిళలు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలెన్నో..

by Javid Pasha |
Womens issues : చెప్పుకోలేని బాధలు.. మహిళలు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలెన్నో..
X

దిశ, ఫీచర్స్ : ఒకే దృశ్యం.. కానీ ఇద్దరు వ్యక్తులు చూసే దృష్టి వేరుగా ఉంటుంది. ఒకే సంఘటన.. కానీ ఇద్దరు వ్యక్తుల విశ్లేషణ డిఫరెంట్‌గా ఉంటుంది. ఒకే సమస్య.. కానీ స్త్రీ, పురుషుల విషయానికి వచ్చేసరికి భిన్నంగా చూస్తుందీ సమాజం. ఒకప్పటితో పోలిస్తే నేడు స్త్రీ, పురుషుల సమానత్వ భావనకు సంబంధించి సానుకూల మార్పులు చాలానే వచ్చాయి. మహిళలు అనేక రంగాల్లో దూసుకుపోతున్నారు. ఇష్టమైన కెరీర్‌లో ప్రవేశించడానికి, నచ్చిన విధంగా జీవించడానికి రాజ్యాంగపరమైన హక్కులను కూడా కలిగి ఉన్నారు. అయినప్పటికీ పురుషాధిక్య భావజాలమే ఏదో ఒక రూపంలో నేటికీ డామినేట్ చేస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు స్త్రీ వాదులు. ఇలాంటి పరిస్థితులే నేటికీ అమ్మాయిలు కొన్ని విషయాల్లో ఓపెన్‌గా మాట్లాడే పరిస్థితి లేదు. ముఖ్యంగా మెంటల్ హెల్త్ విషయంలో మహిళలు పూర్తి నిర్లక్ష్యానికి గురవుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

ఓపెన్‌గా మాట్లాడలేని పరిస్థితి

మహిళల రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే అంశాల్లో మెంటల్ హెల్త్ ఒకటి. ప్రస్తుతం కొన్ని విదేశాల్లో మాదిరి ఇండియాలో స్త్రీల మనోభావాలు, మనసులో మాటలు, మానసిక ఆరోగ్యం వంటి విషయాలు అంత ప్రయారిటీ గల అంశంగా పరగణించని వారే చాలా మంది ఉంటున్నారని నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. పురుషులు తమ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్‌ గురించి మాట్లాడినంతగా ఓపెన్‌గా స్త్రీలు మాట్లాడుకునే పరిస్థితి ఇప్పటికీ లేదు. ఎందుకంటే మహిళలు ఏది చెప్పినా తప్పుగా అర్థం చేసుకునేవారే ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా ప్రేమ, రుతుస్రావం, ఇష్టాయిష్టాలు, సెక్స్ వంటి విషయాలైతే అస్సలు అమ్మాయిలు బయటకు మాట్లాడకూడనివిగా భావిస్తుంటారు చాలా మంది. దీంతో ఇలాంటి అంశాల్లో సందేహాలు వచ్చినా, ఇబ్బందులు ఎదుర్కొంటున్నా బయటకు మాట్లాడితే ఇతరులు ఏమనుకుంటారోననే ఫీలింగ్ ఆధునిక మహిళలను పైతం వెంటాడుతోంది.

ఒత్తిడితో సతమతం

స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ, ఈటింగ్ డిజార్డర్ వంటివి ప్రపంచ వ్యాప్తంగా స్త్రీ, పురుషులందరూ ఎదుర్కొనే సమస్యలుగా ఉన్నాయి. కానీ వీటి గురించి పురుషులు బయటకు చెప్పుకోగలిగినంత ఈజీగా మహిళలు చెప్పుకోవడం లేదు. అలాగే అమ్మాయిలు, అబ్బాయిల ద్వారా వేధింపులు ఎదుర్కొంటున్నప్పటికీ ఆ విషయాన్ని చాలా వరకు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు, వర్క్ ప్లేస్‌లో కొలీగ్స్‌తో పంచుకోలేరు. అత్యంత సన్నిహితులతో కూడా వెంటనే చెప్పే ధైర్యం చేయనివారు చాలామంది ఉంటారు. ఏదైనా పెద్ద సమస్యగా మారుతుంది అనుకొని భయపడినప్పుడు మాత్రమే చెప్పగలుగుతున్నారు. కారణం.. పురుషాధిక్య భావజాలం. బయటకు చెప్తే చుట్టు పక్కల జనాలు, సమాజం తమను హేళన చేస్తుందని, అవమానాలు, అనుమానాలు వంటివి ఎదుర్కోవాల్సి వస్తుందనే భయం ఆధునిక మహిళలను కూడా ఎటూ తోచనివ్వట్లేదు.

హార్మోన్లలో మార్పులు

ప్రస్తుతం మహిళలు ఎదుర్కొనే సాధారణ రుగ్మతలకు హార్మోన్లలో మార్పులు కూడా కారణం అవుతున్నాయి. పెరినాటల్ డిప్రెషన్, పెరి-మెనోపాసల్ డిప్రెషన్, ప్రీ మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ (పీఎంఎస్) వంటివి కూడా అందులో భాగమే. ఇవి స్త్రీలలో శారీరక, మానసిక సమస్యలకు, మార్పులకు ఇవి కారణం అవుతుంటాయి. యంగ్ ఏజ్ మూడ్ స్వింగ్స్, పీరియడ్స్, ఫీలింగ్స్, మ్యారేజ్, ప్రెగ్నెన్సీ, ప్రసవం వంటి అంశాల్లో హార్మోన్లు కీ రోల్ పోషిస్తాయి. అలాగే రుతుక్రమం ఆగిపోయే ముందు, ఆగిపోయిన తర్వాత కూడా మహిళల్లో మెంటల్ డిజార్డర్లు పెరుగుతుంటాయి. ఇవన్నీ మానసిక అల్లకల్లోలానికి దారితీస్తుంటాయి. అనుభవించే మహిళలకు, వైద్య నిపుణులకు అర్థం అవుతుంటాయే తప్ప.. ఇతర వ్యక్తులు ఈ పరిస్థితులను అర్థం చేసుకోవడం చాలా అరుదు. అందుకే కొన్ని విషయాలను మహిళలు బయటకు మాట్లాడలేకపోతుంటారు.

సంబంధాలు - సవాళ్లు

సమాజంలో, రిలేషన్‌షిప్‌లో ఎదురయ్యే సవాళ్లు, సమస్యలు, మానసిక సంఘర్షణలకు దారితీసే అవకాశం పురుషులతో పోలిస్తే మహిళల్లోనే అధికంగా ఉంటున్నాయి. పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, పిల్లలను కనడం, పెంచడం, ఫ్యామిలీని చూసుకోవడం వంటివి కొన్నిసార్లు మానసిక, శారీరక సమస్యలకు దారితీస్తున్నాయి. పైగా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభించకపోవడం, చివరికి సాటి మహిళలు, ఫ్రెండ్స్ ద్వారా కూడా ఎమోషనల్ సపోర్ట్‌లేక పోవడం వంటి కారణాలతో లోన్లీనెస్‌ను ఎదుర్కొంటున్న మహిళలు చాలామందే ఉంటున్నారు. అయినా బయటకు చెప్పుకోలేకపోతున్నారని నిపుణులు పేర్కొంటున్నారు.

వేధింపులు, ఆర్థిక పరిస్థితులు

మహిళలను మానసికంగా కృంగదీసే ప్రధాన సమస్యల్లో ఇంటా బయటా సమస్యలు, లైంగి వేధింపులు కూడా ఉంటున్నాయి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సూటిపోటి మాటలను చాలామంది ఎదుర్కొంటున్నప్పటికీ బయటకు చెప్పుకోలేకపోతారని, తగిన సపోర్ట్ రాకపోగా మహిళలనే బాధితులుగా చేసే పరిస్థితుల కారణంగా ఇలా జరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఇవేకాకుండా కొన్నిసార్లు మానసిక ఆందోళనలు స్త్రీలలో పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ వంటి రుగ్మతలకు దారితీస్తున్నాయి. డిప్రెషన్‌లో కూరుకుపోయి ఏదైనా తప్పుగా మాట్లాడినా, తప్పుగా ప్రవర్తించిన కూడా అమ్మాయిలను అర్థం చేసుకునే పరిస్థితి చాలా అరుదు. పైగా వారిపై చెడ్డవారు అనే ముద్ర వేయడం పరిపాటిగా మారిపోయింది.

పరిష్కారం ఏమిటి?

మహిళలు నేడు మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఎదుర్కొంటున్నప్పటికీ, వాటిని ఎదుర్కోవడానికి అవసరమైన సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందడం లేదని స్త్రీ వాదులు పేర్కొంటున్నారు. మానసిక కల్లోలాన్ని అసలు ఆరోగ్య సమస్యగా పరిగణించకపోవడం, మూఢ నమ్మకాలు, పురుషాధిక్య భావజాలం, మహిళలపట్ల చులకన భావం వంటివి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో స్త్రీలలో మానసిక సమస్యలకు దారితీస్తు్న్నాయి. కాబట్టి వీటిని అర్థం చేసుకోవడంలో, ఎదుర్కోవడంలో స్త్రీలకు సహకారం అందాల్సిన అవసరం ఉంది. అలాగే కుటుంబంలో, సమాజంలో మహిళల మానసిక ఆరోగ్యంపట్ల సపోర్టివ్ సిస్టం బిల్డ్ చేయడం, ట్రీట్మెంట్ పొందడంలో సహకరించడం, సమస్య నుంచి బయటపడే వరకు మద్దతుగా నిలువడం వంటివి పరిష్కార అంశాలుగా నిపుణులు పేర్కొంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed