18 పర్వత మార్గాలను దాటి ఉమ్లింగ్‌లా చేరిన ఉమెన్ రైడర్!

by Disha News Desk |
18 పర్వత మార్గాలను దాటి ఉమ్లింగ్‌లా చేరిన ఉమెన్ రైడర్!
X

దిశ, ఫీచర్స్ : నేటికీ భారతదేశం ఒక మహిళ మోటార్‌సైకిల్‌ డ్రైవ్ చేయడాన్ని వింతగానే చూస్తోంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఓ మహిళ మోటారు సైకిలిస్ట్ కనిపించడం అరుదు అనే చెప్పాలి. అయితే చరిత్రను తిరగరాస్తూ కొత్త బాటలు వేస్తున్న కొందరు మహిళలు ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు కంచన్ ఉగుర్సంది (30). జార్ఖండ్‌లోని సరైకేలాలోని ఆదివాసీ కమ్యూనిటీకి చెందిన కంచన్ తన అభిరుచిని నెరవేర్చుకునేందుకు ఉత్తర భారతదేశమంతటా అనేక సోలో మోటార్‌సైకిల్ యాత్రలను పూర్తి చేయడం విశేషం.

జూన్ 2021లో, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) సాయంతో.. లడఖ్‌లోని 19,300 అడుగుల ఎత్తులో ఉన్న ఉమ్లింగ్‌లా పాస్‌కు సోలో మోటార్‌సైకిల్ యాత్రకు వెళ్ళిన మొదటి వ్యక్తి ఉగుర్సంది. ఈ ప్రయాణాన్ని చేపట్టిన మొదటి మహిళా బైకర్, ఆమె ఢిల్లీ నుంచి మనాలి, లేహ్ మీదుగా ఉమ్లింగ్ లా వరకు 3,187కిమీ దూరం ప్రయాణించి, హిమాలయ శ్రేణిలో 18 ప్రమాదకరమైన పర్వత మార్గాలను దాటింది. అక్కడి వాతావరణం, మంచుతో కప్పబడిన పర్వతాలు, ఎత్తైన భూభాగం కారణంగా ఇది చాలా కష్టమైన రైడ్, కాగా అంత ఎత్తులో, ముఖ్యంగా పర్వత మార్గాలపై స్వారీ చేస్తున్నప్పుడు ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. అయితే BRO ఆమెకు వైద్య బృందాన్ని, ఆక్సిజన్ సిలిండర్లను అందించడంతో ఈ అడ్వెంచర్ రైడ్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసింది.


'నేను పేద గిరిజన కుటుంబం నుంచి వచ్చాను, అక్కడ అబ్బాయిలకు ఉన్నంత స్వేచ్ఛ అమ్మాయిలకు లేదు. బైక్ రైడ్ అంటే అది ఊహకు కూడా దూరమే, కానీ చిన్నప్పటి నుంచి మోటార్ సైకిల్ అంటే మక్కువ ఎక్కువ. కానీ నా అభిరుచిని ఎవరూ పట్టించుకోలేదు. బైక్ నడిపేందుకు మా కుటుంబం కూడా అడ్డు చెప్పింది. కానీ నా కలకు నేనే ప్రాణం పోసుకున్నా. నా సోదరుడు బైక్ నడపగలిగినప్పుడు, నేను ఎందుకు చేయలేను? ఆ ఆలోచనతోనే ఢిల్లీకి వచ్చాక మొదటి జీతంతో బైక్ కొని, రైడ్ చేయడం నేర్చుకున్నాను. ఆనాటి నుంచి వెనుతిరిగి చూడలేదు. ఎన్నో ఆఫ్‌రోడ్ 'ట్రిప్స్ సోలోగా పూర్తిచేశాను. కొన్నిసార్లు, రోడ్లు లేవు, రాళ్ల మీదుగా, నదుల మీదుగా ప్రయాణించాను. ఇక నా బైక్‌ను ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన మోటరబుల్ రోడ్ ఉమ్లింగ్ లాలో పార్క్ చేసే వరకు ఆగలేదు. ఆడపిల్లకు కుటుంబం నుంచి కానీ, సమాజం నుంచి కానీ మద్దతు లభించకపోవడం అన్యాయం. అబ్బాయిలు చేస్తున్నప్పుడు మనం చేయలేమా? మనల్ని మనం నిరూపించుకోవాలి. మోటార్‌సైక్లింగ్ లింగ-ఆధిపత్య క్రీడ కాకూడదు. ఈ యాత్రతో చాలా మంది అమ్మాయిలు ఎట్టకేలకు అడ్వెంచర్ మోటార్‌సైక్లింగ్ రంగంలో చేరతారని నేను నమ్ముతున్నాను' అని కంచన్ ఉగుర్సంది చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story