నాలుగు గోడలు కాదు నలుగురికి ఆదర్శం కావాలి..

by Hamsa |   ( Updated:2023-03-08 09:48:38.0  )
నాలుగు గోడలు కాదు నలుగురికి ఆదర్శం కావాలి..
X

దిశ, ఫీచర్స్: అమ్మాయి.. అక్కడే ఆగిపోతావా? బావిలో కప్పలా మిగిలిపోతావా? నచ్చినట్లుగా బతకడం, నలుగురితో నారాయణ అని సర్దుకుపోవడం.. ఆశయాల కోసం అడుగేయడం.. అవన్నీ నాకెందుకని వంటింటి మహారాణిగా ఫీల్ అవడం.. అంతా నీ చేతుల్లోనే. పతియే ప్రత్యక్షదైవమని నాలుగు గోడలకు పరిమితం అవుతావా? ప్రతీచోట నేనెందుకు ఉండకూడదని ముందడుగు వేస్తావా? చాయిస్ నీదే. ఈ జనరేషన్‌లో నువ్వు మారితేనే.. తర్వాత తరానికి మార్పును ఇవ్వగలవు. మగాడితో సమానమన్న ఆలోచన ఒక్కటే సరిపోదు.. ఆ సమానత్వాన్ని ఆలింగనం చేసుకునే ఆత్రం ఉండాలి. అది నీ నుంచే మొదలు కావాలి.

అమ్మాయి పెంపకం విషయంలో పట్టణం మారినా పల్లె అదే పాతకాలపు సంప్రదాయాలకు కట్టుబడి ఉంది. మహిళ పుట్టిందే మానవుడికి సేవ చేసేందుకు అన్న సిద్ధాంతాన్ని ఈ తరానికే కాదు తర్వాతి తరానికి కూడా నూరిపోస్తున్నట్లు అనిపిస్తుంది. అందుకే కొడుకు ఏది కోరుకున్నా క్షణాల్లో చేతిలో పెట్టే తల్లిదండ్రులు.. కూతురి జీవితాన్ని స్వతంత్రంగా నిలబెట్టే చదువును అందించేందుకు కూడా వెనుకాడుతున్నారు. చదువు ఎందుకులే.. జాబ్ ఉన్న అబ్బాయి చేతిలో పెడితే అమ్మాయి హ్యాపీగా ఉంటుందనే భ్రమలో బతుకుతున్నారు. స్టడీ కంప్లీట్ చేశాక పెళ్లి చేసుకుంటానని అమ్మాయి కాళ్లావేళ్ల పడినా.. కనికరం చూపట్లేదు. కావాలంటే పెళ్లయ్యాక స్టడీస్ కంటిన్యూ చేయమనే ఉచిత సలహాలిస్తున్నారు. కానీ వన్స్ మ్యారేజ్ అయిందంటే.. ఆమె జీవితం భర్త చేతిల్లోకి వెళ్లిపోతుంది. పిల్లలు పుట్టాక వారి ఆలనా పాలనలో నాలుగు గోడలకు పరిమితం అవుతుంది. బావిలో కప్పగా మారిపోతుంది. కానీ ఈ స్టేజ్‌లో ముందడుగు వేయాలనుకుంటే.. కోరుకున్న జీవితం మీ చేతుల్లోకి వచ్చిచేరుతుంది.

ఆమె ఏం కోరుకుంటుంది?

ఆమె ఏం కోరుకుంటుందనే ఆలోచన తండ్రి.. తల్లి.. తోబుట్టువు.. కట్టుకున్న భర్త.. ఏ ఒక్కరికీ లేదు. పుట్టిందా.. పెళ్లి చేశామా? అనే ఆలోచనకు బదులు.. ఆర్థికంగా చేయూతనివ్వండి. ఆమె జీవితం ఆమె చేతుల్లోనే ఉండేలా మద్దతివ్వండి. ఆటోమేటిక్‌గా గౌరవం, ఆర్థిక స్వాతంత్ర్యం అందుకునేందుకు సహాయంగా ఉండండి. అలాంటప్పుడే పెళ్లి తర్వాత కూడా భర్త తనతో సమానంగా ట్రీట్ చేస్తాడు. ఇంటి, వంట పనుల్లో సాయంగా ఉంటాడు. ప్రోత్సహించేందుకు ముందుంటాడు.

స్త్రీకి స్త్రీ శత్రువు?

పితృస్వామ్య సమాజం మహిమల్లో ఇదీ ఒకటి. పల్లెటూరిలో ఓ సగటు మహిళ కేవలం పొద్దున లేవాలి. పనులు చేసుకోవాలి. పిల్లలను బడికి పంపాలి. భర్తకు క్యారేజ్ ప్రిపేర్ చేయ్యాలనే ఆలోచనతోనే ఉంటుంది. ఆమెకు అది మాత్రమే తెలుసు. అలాంటి వారికి సిటీలో పుట్టిపెరిగిన అమ్మాయి.. మంచి జాబ్ చేసినా? కాస్త మోడ్రన్ డ్రెస్ సెన్స్ కలిగి ఉన్నా? కొంచెం చురుగ్గా ప్రవర్తించినా.. ఏ విషయంలో అయినా అబ్బాయిలకు సజెషన్స్ ఇవ్వడం లేదంటే అబ్బాయిలతో మాట్లాడినా.. అక్కడున్న నలుగురికి హాట్ హాట్ టాపిక్ అయిపోతుంది. ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది? ఇదంతా ఎందుకు జరుగుతుందంటే.. ఒకప్పటి నుంచి పాతుకుపోయిన ఆలోచనా ధోరణి. అమ్మాయి నలుగురిలో నోరు మెదపకూడదు.. అబ్బాయిలను కన్నెత్తి చూడకూడదు.. అనే మూసధోరణి. దీని నుంచి బయటపడాలంటే.. ముందు మార్పు మనలోనే మొదలుకావాలి. అమ్మాయిని అమ్మాయి సపోర్ట్ చేసుకునే పరిస్థితి వచ్చినప్పుడే.. మగాడితో సమానత్వాన్ని ఆలింగనం చేసుకునే రోజు వస్తుంది. అంతేకానీ అక్కడే కూర్చుని ముచ్చటిస్తే.. ప్రపంచానికి నీ స్థాయి, స్థానం ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నీ పద్ధతి మారితేనే.. తర్వాతి తరంలో మార్పు కనిపిస్తుంది.

నిశ్శబ్దం భయానికి ప్రతిబింబం

ఇక మన సమాజం చాలా విషయాలలో స్త్రీ పురుషులకు ద్వంద్వ ప్రమాణాలను కలిగి ఉంది. కోపం అనేది ఇందులో ఒకటి. వాయిస్ పెంచడం, పిడికిలి బిగించడం, ఉద్వేగభరితమైన ఆవేశాన్ని ప్రదర్శించడం పురుషుల శక్తివంతమైన లక్షణాలుగా పరిగణించబడతాయి. కానీ స్త్రీలు అలా చేస్తే బరితెగించిన వారిగా గుర్తించబడతారు. కానీ ఆగ్రహం వ్యక్తం చేయడం అనేది మానవ వ్యక్తీకరణ అయినప్పుడు.. మహిళ ఎందుకు కోపాన్ని ప్రదర్శించకూడదు? అడ్జస్ట్ కావడం, రాజీపడడం, క్షమించడం, మరచిపోవడం జీవితంలో భాగమైపోవాలా? మహిళ అంటే సున్నితంగా మాట్లాడాలి.. కేరింగ్‌గా ఉండాలి.. దయతో మెలగాలి.. అనేది ఎంత వరకు కరెక్ట్? పబ్లిక్‌లో హరాజ్మెంట్‌కు గురైనప్పుడు కూడా సైలెంట్‌గానే ఉండిపోవాలా? సోషల్ మీడియాలో వేధింపులు ఎదురైనప్పుడు అలాంటి ఎకౌంట్స్‌ను బ్లాక్ చేయాలే కానీ ఎటాక్ చేయకూడదా? ఈ నిశ్శబ్దం మనలో ఉన్న భయానికి ప్రతిబింబం కాదంటారా? మనం ఎదురుతిరిగితే ఎదుటివ్యక్తికి భయం కలగదంటారా? ఆలోచించి చూడండి. ఆచరణలో పెట్టండి.

ఇవి కూడా చదవండి : ఏ రుద్రాక్ష దేనికి సంకేతం..? అసలు రుద్రాక్షను ధరించవచ్చా..?

Advertisement

Next Story