- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Where is love : ప్రేమా.. ఏది నీ చిరునామా?

దిశ, ఫీచర్స్ : ప్రేమ.. ఎలా పుడుతుందో కానీ.. ఒకరినొకరు విడిచి ఉండలేనంత అనుబంధం పెనవేసుకుపోతుంది. అందుకే అంటారు అదో అనిర్వచనీయ ఆనందమని.. మాటల్లో వర్ణించలేని భావోద్వేగమని.. అసలు ప్రేమంటే ఏమిటి?.. రెండు హృదయాల కలయిక అని కొందరంటే.. మనసులు కలిసిన ఇద్దరు వ్యక్తుల కలవరింత అని మరికొందరు చమత్కరిస్తుంటారు. ప్రేమను త్యాగంతో కొందరు పోలిస్తే.. ప్రేమను భోగంతో మరికొందరు పోలుస్తుంటారు. ఎవరెన్ని చెప్పినా ప్రేమ మనుషులను కలిపి ఉంచే అద్భుతమైన అనుబంధాల వారధి అని మాత్రం అందరూ అంగీకరిస్తుంటారు.
అది మాత్రమే కాదు..
ప్రేమంటే అమ్మాయి.. అబ్బాయి మధ్య ఉండేది మాత్రమే కాదు, అమ్మానాన్నలపై ప్రేమ, అక్కా చెల్లెళ్లపై ప్రేమ, అన్నదమ్ముల మధ్య ప్రేమ.. ఇలా మనుషులు, మానవ సంబంధాలను కలిపే వంతెనగానూ అది ఉంటుంది. అయితే ప్రేమికుల మధ్య లేదా భార్యా భర్తల మధ్య ప్రేమ మరో కోణంలో ప్రత్యేకతను కలిగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పరిచయమనే మొగ్గ తొడిగి, స్నేహమనే పువ్వు పూసి.. కొన్నిసార్లు అది.. కొందరి విషయంలో ప్రేమ పరిమళమై వెదజల్లుతుంది.
ప్రేమ.. సందర్భం
ప్రేమంటే.. మనసులో కలిగే భావనలు ఎలా ఉన్నా.. సైంటిఫిక్ కోణంలో, సామాజిక కోణంలో ఆలోచించే తీరు కొంచెం వేరుగానే ఉంటుందని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రేమ అనే శబ్దం వినబడితే చాలు.. ఠక్కున అందరికీ వెంటనే ఫిబ్రవరి 14 లేదా వాలెంటైన్స్ డేనే గుర్తుకొస్తుంది. అది ప్రేమికులకు పండుగ రోజని, ప్రేమను వ్యక్తం చేయడానికి మరో మంచి సందర్భమని చెబుతుంటారు. గులాబీలతో, గ్రీటింగులతో, అందమైన కొటేషన్లతో, మెసేజ్‌లతో బహుమతులతో తమ తమ ప్రేమను వ్యక్త పరుస్తుంటారు. ప్రేమికులకిది భావోద్వేగ సందర్భం. ఇష్టమైన వ్యక్తి అంగీకరిస్తుందో లేదోననే టెన్షన్ కొందరిని వెంటాడుతుంటే.. అప్పటికే పీకల్లోతు ప్రేమలో మునిగిన వ్యక్తులు ఆ రోజును ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో ప్లాన్ చేస్తుంటారు.
సెంటిమెంట్.. వ్యాపారం
ప్రేమంటే.. సెంటిమెంట్ కూడా.. ఖర్చు చేయడానికి వెనుకాడరు కొందరు. రోజ్ డే నుంచి లవర్స్ డే వరకు గులాబీలు, చాక్లెట్లు, ఖరీదైన గిఫ్టులు, అందమైన జ్యువెల్లరీ ఇలా కంటికి నచ్చింది. మనసు మెచ్చింది కొనేస్తుంటారు. లవ్ సెంటిమెంట్‌తో కొనసాగే కొనుగోళ్లతో ప్రతీ ఏటా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతోందని నిపుణులు అంటున్నారు. మనుషులను, మనసులను, మార్కెట్‌ను ఇంతలా వశపరుచుకున్న ఈ ప్రేమ అసలు ఎందుకు పుడుతుంది? మనిషి శరీరంలోని ఏ భాగంలో అది ఉంటుంది? అని ఎప్పుడైనా ఆలోచించారా? కానీ పరిశోధకులు ఆ పనిచేశారు. న్యూ యార్క్‌లోని ఆల్బర్ట్ ఐన్ స్టీన్ మెడికల్ కాలేజ్‌కి చెందిన రీసెర్చర్స్ రొమాంటిక్ లవ్ అనే ఫీలింగ్ అసలు మనిషి శరీరంలో ఎక్కడ పుడుతుందో పరిశోధనలు నిర్వహించారు.
ప్రేమ.. పరిశోధనలు
ప్రధాన పరిశోధకుడు బినాక అస్విడో తన బృందంతో కలిసి ప్రేమలో ఉన్న కొందరు వ్యక్తులను ఎంచుకొని, వారికి అసలు విషయం తెలియకుండానే కొన్ని పరిశీలనలు జరిపారు. ప్రియుడు లేదా ప్రియురాలి ఫొటోను చూపించినప్పుడు ఒక వ్యక్తి మెదడులోని భాగాల్లో రియాక్షన్ భిన్నంగా ఉంటున్నట్లు గుర్తించారు. బ్రెయిన్‌లోని వెంట్రల్ టెగ్మెంటల్ ఏరియా (వీటీఏ), న్యూక్లియస్ అకమ్బన్స్, వెంట్రల్ పల్లీడియం, రఫే న్యూక్లియర్ ప్రాంతాలు ఇష్టమైన లేదా ప్రేమించిన వ్యక్తిని చూడగానే వేగంగా ఉత్తేజితం అవుతున్నట్లు ఎఫ్. మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్ ద్వారా తెలుసుకున్నారు.
మెదడు కీ రోల్ ..
కాగా బ్రెయిన్‌లోని వెంట్రల్ టెగ్మెంటల్ ఏరియా రివార్డ్ సిస్టంలో ముఖ్యమైన ప్రాంతం. కొత్తగా ప్రేమలో పడినప్పుడు ఇది తరచూ అధికంగా ఉత్తేజితం అవుతుందని పరిశోధకులు అంటున్నారు. ఇక వెంట్రల్ పల్లీడియం, రఫే న్యూక్లియస్ ఏరియాలు మనుషుల మధ్య 20 ఏండ్ల తర్వాత కూడా ఒకరిపట్ల ఒకరికి ప్రేమ ఉండటానికి కీలకపాత్ర పోషిస్తాయని, మనుషుల మధ్య శాశ్వత ప్రేమ బంధానికి ఇవి ముఖ్యమని కనుగొన్నారు. వెంట్రల్ పల్లీడియం అటాచ్‌మెంట్ అనే మెదడులోని భాగం హార్మోన్లను విడుదల చేయడం ద్వారా బంధం బలపడేలా ప్రేరేపిస్తుంది. ఇక దీర్ఘకాలిక ప్రేమికుల్లో రఫే న్యూక్లియస్ అనే బ్రెయిన్ ఏరియా సెరోనిన్ హార్మోన్‌ను రిలీజ్ చేసి సంబంధాన్ని కొనసాగించేలా చేస్తుంది. ఇలాంటి పరిస్థితులే ప్రేమికులు ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితులకు కారణం అవుతాయి. న్యూరో సైన్స్ ప్రకారం కూడా మెదడులోని హిప్పో క్యాంపస్, మీడియల్ ఇన్సుల, యాంటీ రియర్ సింగ్లేట్ వంటి భాగాలు రివార్డు సిస్టంలో కీ రోల్ పోషించి ప్రేమ భావనలు డెవలప్ కావడంలో సహాయపడతాయని పరిశోధనలో తేలింది.
ఏదో తెలియని ఫీలింగ్..
ప్రేమంటే ఒక విధమైన మధురానుభూతి అని, ఏదో తెలియని ఫీలింగ్ అని కూడా అంటుంటారు. హార్వర్డ్ మెడికల్ కాలేజ్ సైంటిస్టుల ప్రకారం.. అది శరీరంలో విడుదలయ్యే హార్మోన్ల ప్రభావం వల్ల ఏర్పడుతుంది. ఒక వ్యక్తిపట్ల ఆకర్షితులవడంలో ఇవి కీ రోల్ పోషిస్తాయి. ఇష్టమైన వ్యక్తిని చూడగానే మెదడులో ఫినెల్ తలామిన్ అనే రసాయనం (హార్మోన్) విడుదల అవుతుందని, దీనివల్ల అరచేతుల్లో చెమటలు పట్టడం, మోకాళ్లలో వణుకు, మాటల్లో తడబాటు వంటివి సంభవిస్తుంటాయని పరిశోధకులు అంటున్నారు. అందుకే ప్రేమ తొలినాళ్లలో ఇతర వ్యక్తులతో మాట్లాడినంత ఫ్రీగా ప్రేమించిన వ్యక్తితో మాట్లాలేరు. ప్రవర్తనలో సిగ్గు పడటం, తడబడటం వంటివి కనిపిస్తుంటాయి. దీంతోపాటు మనుషుల మధ్య ఆకర్షణ, వ్యామోహం వంటివి కలగడానికి మెదడులో విడుదలయ్యే డోపమైన్, అడ్రినలిన్, నారెఫీనెప్రిన్, ఆక్సిటోసిన్ వంటి హార్మోన్లు కూడా కారణం అవుతాయి. ప్రేమికులు గంటల కొద్దీ మాట్లాడుకోవడానికి, పరస్పరం టచ్ చేసుకోవాలని, హగ్ చేసుకోవాలని అనిపంచడానికి కూడా ఇవే కారణం.