ముహూర్తాలతో పనేముంది?.. అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ పెళ్లే నిదర్శనం!

by Javid Pasha |   ( Updated:2024-07-17 15:19:28.0  )
ముహూర్తాలతో పనేముంది?.. అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ పెళ్లే నిదర్శనం!
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా ఒక పెళ్లి జరగాలంటే దానికి ముందు అనుసరించాల్సిన నియమాలు చాలానే ఉంటాయని పెద్దలు చెప్తుంటారు. ముఖ్యంగా భారతీయ సంప్రదాయాల్లో చాలా మంది వివాహానికి ముందు వధూ వరుల పేరు బలాన్ని చూస్తారు. అంటే.. వేద పండితులను లేదా పురోహితులను సంప్రదించి వారు చెప్పిన సమయానికే పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేస్తుంటారు. కాగా మెజార్టీ ప్రజల ఆచార వ్యవహారాలు, సంప్రదాయాల ప్రకారం సహజంగానే ఆషాడ మాసంలో పెళ్లి ముహూర్తాలు ఉండవు. ఈ నెలలో అల్లుడు, అత్త ఒకే వాకిట్లో తిరగ కూడదని చెప్తుంటారు.

అయితే ఏ విధంగా చూసినా ఆషాడ మాసం పెళ్లిళ్లకి మంచిది కాదని నమ్ముతుంటారు. కానీ ప్రముఖ వ్యాపార దిగ్గజం అనంత్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ పెళ్లి మాత్రం అందుకు భిన్నంగా జరిగిందని పలువురు పేర్కొంటున్నారు. ఇదే విషయమై సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. కొందరు ‘అంబానీలకు మూహూర్తాలు వర్తించవా?’ అని ప్రశ్నిస్తూ ట్రోల్స్ చేస్తుండగా.. ఇంకొందరు ‘‘అనంత్ అంబానీ పెళ్లిని చూసైనా మనం నేర్చుకోవాలి. ప్రేమ ఉంటే చాలు పెళ్లికి ఆషాడం.. గీషాడం ఏవీ అడ్డురావు. ముహూర్తాలు, మూఢాలు వంటివన్నీ ఒట్టి మూఢ నమ్మకాలే’’ అంటున్నారు.

ముహూర్తాల మోసం 2500 సంవత్సరాల క్రితమే బట్ట బయలు అయిందని, అప్పట్లో చార్వాకులు ఈ మూఢ నమ్మకాన్ని వ్యతిరేకించారని కొందరు ఎడ్యుకేటర్స్, అలాగే హేతువాదులు పేర్కొంటున్నారు. వాస్తవానికి ముహూర్తాలు అశాస్త్రీయ దృక్పథంలోంచి, అవాస్తవాల్లోంచి, అజ్ఞానంలోంచి పుట్టుకొచ్చిన భావాలని, వాటిని పాటించినా, పాటించకపోయినా ఏమీ కాదని చెప్తున్నారు. వేమన, వీరబ్రహ్మం వంటి యోగులతోపాటు రాజా రామ్మోహన్ రాయ్, పెరియార్ రామస్వామి, త్రిపురనేని, గోరా వంటి సంఘ సంస్కరణ వాదులు, హేతువాదులు ముహూర్తాలను, మూఢత్వాలను వ్యతిరేకించారని గుర్తు చేస్తున్నారు.

యువతీ యువకులకు ఒకరి మీద ప్రేమ, అంగీకారం ఉంటే చాలు ఉంటే చాలు గ్రహ బలాలు, జాతకాలు, నక్షత్రాలు, మూహూర్తాలు, పెళ్లి మంత్రాలు ఇవేవీ లేకుండా కూడా పెళ్లిళ్లు జరిపించవచ్చని హేతువాదులు, విద్యా వంతులు అభిప్రాయపడుతున్నారు. ముహూర్తాలు లేని ఆషాడ మాసంలో పెళ్లి చేసుకొని అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ మూఢ నమ్మకాలను అనుసరించవద్దనే మంచి సందేశం కూడా ఇచ్చారని, ఆధునిక యువత ఈ విషయాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇరువైపులా అంగీకారం ఉంటే చాలు.. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 ప్రకారం రిజిస్ట్రేషన్ మ్యారేజ్ కూడా చేసుకోవచ్చునని, 30 రోజుల్లో పెళ్లి సర్టిఫికెట్ కూడా వస్తుందని చెప్తున్నారు.

Advertisement

Next Story