స్త్రీలు మాత్రమే నివసించే గ్రామాలు.. పురుషులకు నో ఎంట్రీ.. ఎందుకంటే..

by Javid Pasha |
స్త్రీలు మాత్రమే నివసించే గ్రామాలు..  పురుషులకు నో ఎంట్రీ.. ఎందుకంటే..
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా ప్రపంచంలోని ఏ గ్రామంలో చూసినా ప్రజలందరూ కలిసి మెలిసి జీవిస్తుంటారు. కానీ కొన్ని ఊర్లల్లో కేవలం స్త్రీలు మాత్రమే నివసిస్తారని, పైగా అక్కడ పురుషులకు అనుమతిలేదని మీకు తెలుసా? మిగతా ప్రపంచంలో ఇప్పటికీ ఏదో ఒక విషయంలో పురుషాధిక్యత కనిపిస్తున్నప్పటికీ, ఇక్కడ మాత్రం మహిళలదే సర్వాధికారం. అందుకే వాటిని కొందరు ఆడవాళ్ల రాజ్యమని పిలుస్తుంటారు. ఇంతకీ అవి ఎక్కడున్నాయి?, ప్రత్యేకతలేమిటో చూద్దాం.

ఫిన్‌లాండ్‌లోని ‘సూపర్ షీ ఐలాండ్’

సూపర్ షీ ఐలాండ్ అనే పేరు చాలామంది విని ఉంటారు. కానీ దాని ప్రత్యేకత గురించి మాత్రం అందరికీ తెలిసి ఉండకపోవచ్చు. ఏంటంటే.. ఇక్కడ కేవలం స్త్రీలు మాత్రమే నివసిస్తున్నారు. పురుషులను ఈ గ్రామంలోకి అస్సలు అనుమతించరు. ఈ ఐలాండ్ యజమాని పేరు క్రిస్టినారోత్. ప్రస్తుతం గొప్ప బిజినెస్ ఉమన్. అయితే తాను వ్యాపార రంగంలోకి అడుగు పెట్టకముందు అనేక ఉద్యోగాలు చేశానని, ఆ సందర్భంలో పురుష ఉద్యోగులు, యజమానులతో ఇబ్బందులు పడ్డానని చెప్తున్న క్రిస్టినా, అసలు పురుషులపై ఆధారపడకుండా స్త్రీలు జీవించగలిగేందుకు తనవంతు పాటుపడాలని డిసైడ్ అయిందట. తన లక్ష్యం నెరవేరాలంటే ముందు తను ఆర్థికంగా ఎదగాలని భావించింది. అందుకోసం ఓ కంపెనీని ప్రారంభించి పారిశ్రామిక వేత్తగా, వ్యాపార వేత్తగా ఎదిగింది.

అయితే తన కలనెరవేర్చే ఉద్దేశంతో క్రిస్టినా రోత్ ఫిన్‌లాండ్ సమీపంలోని ఓ ఐలాండ్‌ను కొనుగోలు చేసి దానికి ‘సూపర్ షీ ఐలాండ్’ అని పేరు పెట్టింది. ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోంది. ఇకపోతే తన సంస్థల్లో, పరిశ్రమల్లో కేవలం మహిళలకు మాత్రమే ఉద్యోగాలు కల్పిస్తోంది. యోగా, మెడిటేషన్ క్లాసులతోపాటు సమాజంలో స్త్రీలపట్ల వివక్ష వంటి అంశాలపై సెమినార్లు నిర్వహిస్తూ చైతన్యం చేస్తోంది. అసలు విషయం ఏంటంటే.. ఈ సూపర్ షీ ఐలాండ్‌లో అందరూ మహిళే నివసిస్తున్నారు. పైగా పురుషులకు అనుమతిలేదు. ఒకవేళ ఎవరైనా ఆ గ్రామాన్ని సందర్శించాలనుకుంటే ముందుగా ఎంట్రీ కోసం జరిగే సెలెక్షన్స్‌కు అటెండ్ అయి 4 యూరోల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా జస్ట్ సూపర్ షీ ఐలాండ్ చూసి వచ్చేందుకు మాత్రమే.

ఈజిప్ట్‌లోని అల్ సమాహా

ప్రపంచంలో పురుషులకు అనుమతిలేని మరో ఊరు పేరు అల్ సమాహా, ఇది ఈజిప్ట్‌లో ఉంది. నిపుణుల ప్రకారం.. ఈ గ్రామాన్ని ప్రత్యేకించి అక్కడి ప్రభుత్వమే వింతంతువులు, డివోర్స్ తీసుకున్న మహిళల కోసం కేటాయించింది. అయితే ఇక్కడ అందరూ స్త్రీలు మాత్రమే తమ పిల్లలతో కలిసి నివసిస్తుంటారు. ప్రస్తుతం మూడువందల మంది నివాసం ఉంటున్న ఈ గ్రామంలో స్థిర నివాసం ఉండేందుకు పురుషులను మాత్రం అనుమతించట్లేదు అక్కడి స్త్రీలు. ఇక ఇక్కడి మహిళల జీవనాధారం కోసం ప్రభుత్వమే ఇండ్లు, పొలం వంటివి కేటాయిస్తుందట. అవసరమైన ఆహార పదార్థాలు, సరుకులు కూడా సరఫరా చేస్తుంది. ట్విస్ట్ ఏంటంటే.. ఈ గ్రామంలోని స్త్రీలు ఎవరినైనా పెళ్లి చేసుకుంటే వారు ప్రభుత్వం నుంచి ఉచితంగా పొందిన భూమిని, ఇళ్లను తిరిగి ఇచ్చేయాలి. వాటిని ప్రభుత్వం ఇతర ఒంటరి మహిళలకు కేటాయిస్తుంది.

కెన్యాలోని ఉమోజ

ఉత్తర కెన్యాలో గల మరో గ్రామం ఉమోజ. 50 మంది మహిళలు, 200 మంది పిల్లలతో కలిసి నివసిస్తున్న ఈ ఊరిలోకి పురుషులకు నో ఎంట్రీ. ఇక్కడి స్థానికులు, నిపుణుల ప్రకారం.. ఒకప్పుడు బ్రిటీషర్ల చేతిలో మోసపోయి, అత్యాచారానికి గురైన బాధిత మహిళలు మొదట ఈ గ్రామాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఇక్కడ నివసించే వారిలో కూడా అత్యాచార బాధితులు, అనాథలు, వృద్ధులు, ఏ ఆసరా లేని స్త్రీలే ఎక్కువ. పశుపోషణ, రంగురాళ్లతో వివిధ ఆభరణాలు తయారు చేసి అమ్మడం వీరి ప్రధాన వృత్తి.

సిరియాలోని జిన్ వార్

ఎప్పుడూ యుద్ధ వాతావరణంలో ఉండే సిరియాలోఎంతోమంది ప్రజలు, సైనికులు శత్రువుల కాల్పుల్లో మరణిస్తుంటారని నిపుణులు చెప్తున్నారు. అయితే యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుల భార్యల కోసం అక్కడి స్వచ్ఛంద సంస్థలు ‘జిన్ వార్’ అనే ఒక గ్రామాన్ని ఏర్పాటు చేయగా, ప్రస్తుతం ఇక్కడి స్త్రీలు తమ గ్రామంలోకి పురుషులను అనుమతించడం లేదు. ఇక ఈ గ్రామాన్ని స్ఫూర్తిగా తీసుకొని కొందరు ఒంటరి మహిళలు ఉమోజ అనే మరో ఊరిని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇక్కడి మహిళలంతా యుద్ధానికి దూరంగా ఉంటూ జీవనం సాగిస్తుంటారు. దాదాపు 30 నుంచి 50 వరరకు కుటుంబాలు నివసిస్తున్న ఈ రెండు గ్రామాల్లో ఇప్పటికీ శాశ్వతంగా నివాసం ఉండేందుకు పురుషులను అనుమతించరు.

Advertisement

Next Story

Most Viewed