బరువు తగ్గట్లేదా.. కారణం ఇదే!

by Hamsa |   ( Updated:2022-09-02 05:37:19.0  )
బరువు తగ్గట్లేదా.. కారణం ఇదే!
X

దిశ, ఫీచర్స్ : అధిక బరువు అందరికీ ఆందోళన కలిగించే విషయమే. అందుకే వెయిట్ తగ్గాలంటే రోజువారీ వ్యాయామం తప్పనిసరని, ఫాస్ట్ ఫుడ్‌కు స్వస్తిచెప్పి ఇంటి భోజనమే తినాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే ఎన్ని పద్ధతులు అనుసరించినప్పటికీ కొందరు మాత్రం ఈ సమస్య నుంచి బయటపడలేకపోతుంటారు. కాగా ఇందుకు ఏఏ అంశాలు దోహదపడతాయో వివరిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా 'ప్రోటీన్, విటమిన్ డి' లేనటువంటి ఫుడ్ కారణమంటున్న ఎక్స్‌పర్ట్స్.. మరిన్ని సలహాలు, సూచనలు అందిస్తున్నారు.

1. ఒత్తిడి

ఒత్తిడి శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. స్ట్రెస్, యాంగ్జయిటీ, వర్రీ.. లాంటి మానసిక అనారోగ్యాలు బరువు పెరగడానికి లేదా బరువు తగ్గే ప్రయత్నాలకు ఆటంకం కలిగిస్తాయి. అందుకే సరైన డైట్ ఫాలో అవుతూ ఎక్సర్‌సైజ్ చేస్తున్నప్పటికీ బరువు పెరుగుతూనే ఉంటారు. అంతేకాదు స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు శరీరం విడుదలచేసే 'కార్టిసాల్' హార్మోన్‌ మూలంగా అవాంఛిత బరువు పెరుగుతారని నిపుణులు వివరిస్తున్నారు.

2. హైపోథైరాయిడిజం ఉందా?

బరువు పెరగడం అనేది హైపోథైరాయిడిజంకు సంకేతం కావచ్చు. తక్కువ థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ కలిగి ఉండటం వల్ల ఏర్పడే ఈ రుగ్మత అండర్‌యాక్టివ్ థైరాయిడ్ ఫలితంగా సంభవిస్తుంది. తద్వారా జీవక్రియ నెమ్మదించి, ఊహించనివిధంగా బరువు పెరిగేందుకు కారణమవుతుంది. ఇక థైరాయిడ్ ఎక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేస్తే.. అకస్మాత్తుగా బరువు తగ్గడం ప్రారంభించవచ్చు. దీనిని హైపర్ థైరాయిడిజం అంటారు.

3. స్లీప్ సైకిల్ ట్రాక్‌

పూర్ స్లీప్ సైకిల్ కూడా బరువులో ఊహించని మార్పులకు కారణమవుతుంది. అధిక నిద్ర, నిద్ర లేమి 'కార్టిసాల్' హార్మోన్ విడుదలను ప్రభావితం చేస్తుండగా.. ఇది ఆకలిని నియంత్రించి, కొవ్వును నిల్వ చేస్తుంది. తగినంత నిద్రలేనప్పుడు తక్కువ కేలరీలు బర్న్ అవుతాయి. కాబట్టి రోజుకు 7-8 గంటలు నిద్రించేందుకు ప్రయత్నించాలని సూచిస్తున్నారు నిపుణులు.

4. ప్రోటీన్ లోపం

బరువు తగ్గే ప్రక్రియలో కీలకమైన పోషకం ప్రోటీన్. ప్రోటీన్ తీసుకోవడం ఆరోగ్యకరమైన జీవక్రియ నిర్వహణకు, ఆకలిని అరికట్టేందుకు సాయపడుతుంది. శరీర కొవ్వును తొలగిస్తున్నప్పుడు కండర ద్రవ్యరాశిని నిర్వహించడంలో కూడా హెల్ప్ అవుతుంది. మన ఆహారంలో ప్రోటీన్ మొత్తాన్ని పెంచడానికి ప్రోటీన్ స్మూతీస్ గొప్ప మార్గం. కాగా ప్రోటీన్-రిచ్ డైట్ అనేది అతిగా తినడాన్ని నివారించి బరువు తగ్గడంలో తోడ్పడడుతుంది. కేలరీలను బర్న్ చేసే లీన్ కండరాల అభివృద్ధికి దోహదపడుతుంది.

5. డీహైడ్రేషన్‌

కొవ్వును బర్న్ చేసే శరీర సామర్థ్యం.. నీటి వినియోగంతో బలమైన సంబంధాన్ని కలిగి ఉంటుంది. అంటే మనం తగినంత నీరు తీసుకోనప్పుడు శరీరం ఆకలి, డీహైడ్రేషన్ మధ్య తేడాను గుర్తించడానికి కష్టపడుతుంది. అనేక అధ్యయనాల ప్రకారం, భోజనానికి ముందు నీరు తాగేవారు ఇతరులతో పోలిస్తే బరువు తగ్గడంలో సక్సెస్ అయ్యారు. ఎందుకంటే భోజనానికి ముందు నీరు తాగడం వల్ల కడుపు నిండిన అనుభూతి కలిగి, తక్కువ ఆహారం తీసుకునే అవకాశం ఉంది.

6. విటమిన్ డి లోపం

ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎండోక్రినాలజీ అండ్ న్యూట్రిషన్ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనాల ప్రకారం, విటమిన్ డి 'సన్‌షైన్ విటమిన్'గా ప్రసిద్ది చెందింది. ఇది బరువు తగ్గడంలోనూ సాయపడుతుండగా.. తగినంత విటమిన్ డి లభించకపోతే బరువు పెరగవచ్చు లేదా బరువు తగ్గే ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. అందుకే రోజూవారి వ్యాయామంతో పాటు అదనంగా 'విటమిన్ డి'ని ఆహారంలో చేర్చాల్సి ఉంటుంది.

7. మెనోపాజ్‌

మెనోపాజ్‌కు చేరుకునే సమయంలో స్త్రీ శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయి తగ్గుతుంది. తద్వారా ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ సైక్లికల్ ప్యాటర్న్స్‌‌కు అంతరాయం కలగడంతో బరువు పెరుగుతారు. ఇదే సమయంలో వేడి అనుభూతి, నిద్ర ఆటంకాలు ఏర్పడతాయి. కానీ రుతువిరతి బరువు పెరుగుట ఎప్పుడూ హార్మోన్ల మార్పుల వల్లే కాదు వయస్సు, జీవనశైలి, జెనెటిక్ వేరియబుల్స్ కూడా బరువు పెరిగేందుకు కారణమవుతాయి.

Also Read : అనంతాసనంతో వృక్షాసనం ప్రయోజనాలేంటి?

Advertisement

Next Story

Most Viewed