మహిళల్లోనే ఆ రిస్క్ ఎక్కువ.. కార్పొరేట్ సెక్టార్‌ ఉద్యోగులపై సర్వేలో వెల్లడి

by Hamsa |   ( Updated:2023-06-22 12:13:22.0  )
మహిళల్లోనే ఆ రిస్క్ ఎక్కువ.. కార్పొరేట్ సెక్టార్‌ ఉద్యోగులపై సర్వేలో వెల్లడి
X

దిశ, ఫీచర్స్: ‘ఐదంకెలకు మించిన జీతం, లగ్జరీలైఫ్, వారికేం తక్కువ?..’ కార్పొరేట్ సెక్టార్‌లోని ఉద్యోగుల గురించి చాలామంది నోటినుంచి వెలువడే మాటలివి. కానీ వాస్తవానికి ఆ రంగంలోని ఉద్యోగుల్లో అత్యధికమంది మానసిక ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని, ఇందులో మహిళల ముందంజలో ఉన్నారని ఒక అధ్యయనం వెల్లడించింది. ప్రధానంగా ఎఫ్ఎంసీజీ, ఆటోమొబైల్, డ్యూరబుల్స్, బీపీవో, బ్యాంకింగ్, ఎడ్యుకేషన్, ఐటీ, హెల్త్‌కేర్, హాస్పిటాలిటీ అండ్ ఇ-కామర్స్‌తో సహా 10 నిర్దిష్ట రంగాలపై ప్రముఖ మార్కెట్ పరిశోధన సంస్థ ఐపీఎస్‌ఓఎస్, MPower అండ్ బిర్లా ఎడ్యుకేషన్ ట్రస్ట్‌లతో కలిసి దేశంలోని ‘ ప్రధాన నగరాలైన ముంబై, కొల్ కతా, ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్, హైదరాబాద్, పూణె, బెంగళూరులలో సర్వే నిర్వహించింది. ఇందులో భాగంగా నిపుణులు 3000మంది ప్రతిస్పందనలను విశ్లేషించారు. ప్రధాన మెట్రోపాలిటన్ నగరాల్లో పనిచేస్తున్న కార్పొరేట్ ఉద్యోగులు, ముఖ్యంగా మహిళలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు.

సర్వేలో పాల్గొన్న నిపుణులు కార్పొరేట్ ఉద్యోగులలో దాదాపు సగం లేదా 48 శాతం మంది మానసిక ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నట్లు స్పష్టం చేశారు. ఇందులో పురుషులు 41 శాతం మెంటల్ హెల్త్ రిస్కును ఎదుర్కొంటుండగా, మహిళా ఉద్యోగులు మాత్రం 56 శాతం అధికంగా మానసిక సంక్షోభాన్ని అనుభవిస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా 35 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సుగల వారే అత్యధికంగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని తెలిపారు. దీనివల్ల ఉద్యోగుల వర్క్ ప్రొడక్టివిటీపై ఎఫెక్ట్ పడుతోందని, స్ట్రెస్ మాత్రమే అందుకు కారణంగా 50 మంది నమ్ముతున్నారని సర్వేలో పాల్గొన్న నిపుణుల అబ్జర్వేషన్‌లో తేలింది. అంతేగాక తగ్గుతున్న వర్క్ ప్రొడక్టివిటీ, పెరుగుతున్న గైర్హాజర్ ఇటీవల కార్పొరేట్ రంగానికే కాకుండా, దేశ ఆర్థిక వృద్ధికి సవాలుగా మారుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ రోజుల్లో ప్రతీ ఇద్దరు కార్పొరేట్ ఉద్యోగుల్లో ఒకరు మానసిక ఆరోగ్య సమస్యను అనుభవిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

‘ఎట్ రిస్క్’ కేటగిరీ

మానసిక సంక్షోభంతో అత్యంత హాని కలిగించే సమూహంలో మధ్య స్థాయి ఉద్యోగులే అధికంగా ఉంటున్నారు. సీనియర్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ పొజిషన్‌లో ఉన్నవారు 70 శాతం, వైస్ ప్రెసిడెంట్ పొజిషన్‌లో ఉన్నవారు 61 శాతం ‘ఎట్ రిస్క్’ కేటగిరీలో మెంటల్ హెల్త్ ఇష్యూస్‌తో బాధపడుతున్నారు. రంగాల వారిగీ చూసినప్పుడు ఇ-కామర్స్ 64 శాతం, ఎఫ్‌ఎంసిజి 56 శాతం, ఆటోమొబైల్ అండ్ హెల్త్‌కేర్ 55 శాతం, హాస్పిటాలిటీ 53 శాతం, బీపీఓ 47 శాతం. బ్యాంకింగ్ 41 శాతం, ఎడ్యుకేషన్ 39 శాతం, ఐటీ 38 శాతం, డ్యూరబుల్స్ 31 శాతం మానసిక ఆరోగ్య ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి.

వర్క్ కల్చర్ ఎఫెక్ట్

మెంటల్ హెల్త్ రిస్కును ఎదుర్కొంటున్న అధిక శాతం ఉద్యోగులతో పాటు పోస్ట్-పాండమిక్ వర్క్ కల్చర్, ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల కలిగే నష్టాలను కూడా సర్వే హైలైట్ చేసింది. వారానికి 45 గంటల కంటే ఎక్కువ పని చేసే ఉద్యోగులకు మానసిక ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఎక్కువగా ఉంటోందని తేల్చి చెప్పింది. అంతేకాకుండా పని వేళల్లో రెగ్యులర్ బ్రేక్ తీసుకోకుండా, భోజనాన్ని కూడా దాటవేసి, వ్యాయామం చేయడంలో విఫలమయ్యే ఎంప్లాయీస్ మానసిక, ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొనే ప్రమాదం మరింత అధికంగా ఉంటున్నది. యజమానులు ఈ నష్టాలను గుర్తించడం, హెల్తీ వర్క్ -లైఫ్ బ్యాలెన్స్‌ను ప్రోత్సహించడం వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఇది ఉద్యోగుల మానసిక ఆరోగ్యానికి, శ్రేయస్సుకు దోహదం చేస్తుందని నిపుణులు పేర్కొన్నారు.

Also Read..

వీడియో చూసి వర్క్ నేర్చుకుంటున్న రోబోట్స్.. ఎలా అంటే

Advertisement

Next Story

Most Viewed