చరిత్రలో అదృశ్యమైన ఆ పది రోజులు.. ఎందుకు కోల్పోయామంటే..?

by Hamsa |   ( Updated:2022-11-29 14:09:13.0  )
చరిత్రలో అదృశ్యమైన ఆ పది రోజులు.. ఎందుకు కోల్పోయామంటే..?
X

దిశ, ఫీచర్స్: క్యాలెండర్స్ మనకు ఖచ్చితమైన రోజులు, తేదీలను అందిస్తాయి. లేదా కనీసం మనం ఖచ్చితమైనవిగా భావించే సమాచారాన్ని అందిస్తాయి. కానీ 1582వ సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఆ ఏడాది అక్టోబర్‌లో సాధారణం కంటే 10 రోజులు తక్కువగా ఉన్నాయని గుర్తించిన ట్విట్టర్ యూజర్స్ షాక్ అవుతున్నారు. అదేంటో తెలుసుకునేందుకు చేసే ప్రయత్నంలో ఓ స్టోరీని కనుగొన్నారు.

ఫోన్ క్యాలెండర్‌లో 1582కి తిరిగి స్క్రోల్ చేస్తే, ఆ సంవత్సరంలో అక్టోబర్ క్యాలెండర్ 4వ తేదీ నుంచి నేరుగా15వ తేదీకి జంప్ అయింది. అంటే అక్టోబరు 5 నుంచి 14 వరకు ఉన్న 10 రోజులు మిస్ అయ్యాయి. ఈ లోపం స్పష్టంగా కనిపిస్తుండటంతో దీన్ని వింతగా పరిగణించిన ట్విట్టర్ యూజర్స్.. 'సమయం నిజం కాదా? దయచేసి దీనికి సంబంధించిన వివరణ ఎవరైనా ఇవ్వగలరా?' అని కోరారు.

ఈ క్రమంలో స్పందించిన అమెరికన్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త, సైన్స్ కమ్యూనికేటర్ నీల్ డిగ్రాస్ టైసన్ ఈ రహస్యం వెనుక కారణాన్ని ట్వీట్‌ చేశాడు. '1582 నాటికి జూలియన్ క్యాలెండర్ ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒక లీప్ డేతో భూమి యొక్క కక్ష్యకు సంబంధించి పది అదనపు రోజులను సేకరించింది. కాబట్టి పోప్ గ్రెగొరీ తన కొత్త, అద్భుతమైన ఖచ్చితమైన క్యాలెండర్‌ను ఆ సంవత్సరంలో 10 రోజులను రద్దు చేయడం ద్వారా ప్రారంభించాడు. అందుకే అక్టోబర్ 4 తర్వాత అక్టోబర్ 15 వచ్చింది' అని వివరించాడు.

కానీ జంప్ వెనుక లాజిక్ సక్రమంగానే అనిపిస్తున్నా.. అక్టోబర్ నెలనే ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్న కూడా వినిపిస్తుండగా.. ఈస్టర్ తేదీని లెక్కించడం కష్టతరంగా ఉన్నందున ఈ సమస్య వచ్చినట్లు తెలిపాడు. బ్రిటానికా ప్రకారం 1562-63 సంవత్సరాలలో సంస్కరించబడిన క్యాలెండర్‌ను అమలు చేయడం ద్వారా సమస్యను పరిష్కరించాలని పోప్‌ను కోరుతూ ఒక డిక్రీని ఆమోదించాలని ట్రెంట్ కౌన్సిల్(కాథలిక్ చర్చి యొక్క 19వ ఎక్యుమెనికల్ కౌన్సిల్) నిర్ణయించింది. అయితే దానికి తగిన పరిష్కారాన్ని కనుగొనడానికి మరో రెండు దశాబ్దాలు పట్టింది. పోప్ గ్రెగొరీ XIII ఫిబ్రవరి 1582లో గ్రెగోరియన్ క్యాలెండర్ అని పిలువబడే సంస్కరించబడిన క్యాలెండర్‌ను ప్రకటిస్తూ పాపల్ బుల్‌పై సంతకం చేశాడు. వసంత విషువత్తును మార్చి 11 నుంచి తిరిగి మార్చి 21కి తీసుకురావడానికి క్యాలెండర్ నుంచి 10 రోజులు తొలగించబడ్డాయి. ఏ ప్రధాన క్రైస్తవ పండుగలను దాటవేయకుండా ఉండటానికి అక్టోబర్‌ను ఎంచుకున్నారు.

READ MORE

ఆవులకు అందాల పోటీలు.. ర్యాంప్ వాక్ చేస్తూ హొయలు.. ఫొటోలు వైరల్

గూగుల్‌కి షాకిచ్చిన 7 రాష్ట్రాలు.. రూ. 76 కోట్ల దావా!

Advertisement

Next Story

Most Viewed