Trial separation : దూరమయ్యాక బలపడుతున్న బంధం.. ఏమిటీ ‘ట్రయల్ సపరేషన్’‌ ట్రెండ్?

by Javid Pasha |   ( Updated:2024-09-05 12:50:06.0  )
Trial separation : దూరమయ్యాక బలపడుతున్న బంధం.. ఏమిటీ ‘ట్రయల్ సపరేషన్’‌ ట్రెండ్?
X

దిశ, ఫీచర్స్ : ఒక్కసారి రిలేషన్ షిప్‌లోకి అడుగు పెట్టాక ఆ అనుబంధం మరింత బలంగా మారాలని, ఆనందంగా జీవించాలని పెద్దలు చెప్తుంటారు. కానీ ఇప్పుడలాంటి పరిస్థితి కనిపించడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రేమలోనైనా, దాంపత్య జీవితంలోనైనా రోజుల గడిచే కొద్దీ మునుపటిలా ఆత్మీయత, అనురాగాలు ఉండటం లేదని చెప్తున్నారు. కారణాలేమైనా ఇలాంటి అనుభవం భాగస్వాముల మధ్య మనస్ఫర్థలను పెంచుతోంది. కొందరైతే డైవర్స్ దాకా వెళ్తున్నారని నిపుణులు చెప్తున్నారు. అయితే విడిపోవాలని నిర్ణయం తీసుకునే ముందు కలిసుండే మార్గాల గురించి ముందుగా ఆలోచించాలని రిలేషన్‌షిప్ నిపుణులు సూచిస్తున్నారు. ‘ట్రయల్ సపరేషన్’ పద్ధతి అందుకు చక్కగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు.

నిర్ణయం తీసుకునేముందు

భార్యా భర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడినప్పుడు దూరం పెరుగుతుంది. పరిస్థితి సద్దుమణగకపోతే అది విడాకుల దాకా దారితీస్తుంది. అయితే ఫైనల్ డెసిషన్ తీసుకునే ముందు భాగస్వాముల మధ్య పెరిగిన దూరాన్ని దగ్గర చేయడానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన ఆలోచననే ‘ట్రయల్ సపరేషన్’ అంటున్నారు నిపుణులు. అంటే ఇక్కడ వైవాహిక బంధంలో విడాకులే సమస్యకు పరిష్కారమని భావించిన వ్యక్తుల మనసు మార్చడంలో ఇది సహాయపడుతుంది. అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ, జంటలు విడాకులు తీసుకునే నిర్ణయాన్ని ఉపసంహరించునేందుకు దోహదపడుతుంది.

ఆ సమయంలో ఏం చేస్తారు?

కారణాలేమైనా ఇక విడిపోదామనుకునే దాకా వస్తుంటారు కొందరు భాగస్వాములు. అయితే విడాకులు తీసుకోకుండా నిలువరించేందుకు లేదా మనసు మార్చుకునేందుకు కొంత కాలంపాటు భాగస్వాములు దూరంగా ఉంటారు. ఈ కాలాన్నే ట్రయల్ సపరేషన్ అంటారు. ఇలా ఇద్దరూ దూరంగా ఉండటంవల్ల వారి మనసు మారవచ్చు. రియలైజ్ అవడం కారణంగా తప్పులను, పొరపాట్లను గుర్తించే చాన్స్ ఉంటుంది. విడాకులు తీసుకోవడం సరైంది కాదనే ఆలోచనకు రావచ్చు. అందుకే ట్రయల్ సపరేషన్ పద్ధతిలో భాగంగా దంపతులు ఒకే ఇంట్లో ఉంటూ వేర్వేరు గదుల్లో జీవనం సాగించాలి. విడాకులు తీసుకున్నప్పుడు ఎలా దూరంగా ఉంటారో, ట్రయల్ సపరేషన్ పీరియడ్‌లో కూడా అలాగే ఉండాలి.

రియలైజ్ అయ్యే అవకాశం!

భార్యా భర్తల మధ్య దూరాన్ని పెంచే ట్రయల్ సపరేషన్ పద్ధతిలో వాస్తవానికి చాలా మంది రియలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. తాము విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నవారు ఈ కాలంలో డెసిషన్ మార్చుకొని మళ్లీ దగ్గర కావాలని భావించవచ్చు. కలిసున్నా విడిగా బతకడం కారణంగా పార్ట్‌నర్ విలువ ఏమిటో, ఎంతగా మిస్ అవుతున్నారో, దూరంగా కావడంవల్ల ఏం నష్టపోతారో గ్రహించగలుగుతారు. దీంతో విడాకులు తీసుకోవడం కంటే సమస్యను పరిష్కరించుకొని కలిసుండటం బెటర్ అనుకునే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు.

తిరిగి బలపడుతున్న బంధం

విడిపోయి కలిసుండే ‘ట్రయల్ సపరేషన్’ పద్ధతి కారణంగా భాగస్వాముల్లో మనసు మారితే ఆ బంధం మరింత బలపడుతుందని నిపుణులు చెప్తున్నారు. పరస్పరం విడిపోయి ఇద్దరూ ఒంటరిగా ఉండటం కారణంగా భార్య గురించిన ఆలోచనలతో భర్త, భర్త గురించిన ఆలోచనలతో భార్య మనసు నిండిపోతుంది. ఈ సందర్భంలో అసలు తాము ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు? అంత తీవ్రమైన సమస్యలున్నాయా? పరిష్కరించుకోలేనివా? అనే ఆలోచనలు వస్తాయని, దీంతో రియలైజ్ అవుతారని నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా ఒకరిపట్ల ఒకరికి కోపం తగ్గడం సానుకూల భావన ఏర్పడం వంటి కారణాలతో తిరిగి కలిసిపోవాలనే ఆలోచన వస్తుంది. ఫలితంగా విడాకుల నిర్ణయం వెనక్కి తీసుకుందామనుకునే చాన్స్ ఉంటుంది. పైగా దూరం పెరగడం వల్ల వచ్చిన మార్పు తర్వాత కలిసిపోయిన భాగస్వాముల బంధం మరింత బలపడుతుందని నిపుణులు చెప్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed